స్వీయ అన్వేషణ – 2
ఒక వ్యక్తి జీవితంలో కొన్ని భాగాలు ఉంటాయి. కొన్ని పట్టించుకోవలసిన పని ఉండదు. కొన్ని పట్టించుకోవటం మాత్రమే కాదు… వదలకుండా పట్టుకుని ఉండవలసినవి కూడా!
అలాటి వాటిలో కొన్ని మనతోనే మొదలు కావు… కొన్ని తరాలకు ముందే మొదలై ఉంటాయ్!
పెద్దన గారి రచన “మను చరిత్ర”. అలా వ్యవహారంలో ఉన్నా, దాని అసలు పేరు “స్వారోచిష మను సంభవం”. అంటే స్వారోచిషుడు అనే మనువు పుట్టుక, అతగాడు ” మనువు” అయిన విధానం. కథ ఎక్కడ మొదలు పెట్టాడు. వరూధినీ ప్రవరుల దగ్గర. వరూధిని ఒక దేవ కాంత, ప్రవరుడు ఒక నైష్ఠిక బ్రాహ్మణుడు. మధ్యలో మాయా ప్రవరుడు ఒక గంధర్వుడు. వరూధినీ మాయా ప్రవరుల సంతానం స్వరోచి. వరూధిని మనసులో ఉన్నది నిజ ప్రవరుడు. అది కూడా అగ్ని వలయంలో గగనంలో ఎగిరి పోతున్న ప్రవరుడు. స్వరోచిలో ఉన్నది ఏమిటి? దైవ జాతి బీజాలు. ఆమె భావన లోని నైష్ఠిక తేజస్సు. ఇది పునాది. స్వరోచి రాజు అయాడు. వివిధ శాస్త్రాలు, విద్యలు నేర్చాడు. అనంతరం స్వరోచికి కలిగిన సంతానం స్వారోచిషుడు. అతనిలో ఉన్నవి దైవీ చేతనలు, వివిధ శాస్త్ర – విద్యా బీజాలు. అనంతరం అతగాడు చేసిన తపస్సు. ఇవన్నీ అతడు “మనువు” కావటానికి మూల బీజాలు, సంస్కార బీజాలు.
అలాగే ఒక మనిషి పరిణామ క్రమంలో తన పూర్వీకుల సమస్త సంస్కార బీజాలూ ఉంటాయి.
అయితే ఈ మాటకు కొన్ని అపవాదాలూ లేకపోలేదు. ఒక వ్యక్తిలో తన పూర్వీకులలో ( తనకు తెలిసినంత వరకూ) లేని కొన్ని నైపుణ్యాలు కనపడవచ్చు.
దానికి కారణాలు అవి “దైవ దత్త ప్రజ్ఞ”లు అని కొందరు అంటారు, మరి కొందరు అవి తమ “వ్యక్తిగత శ్రమ, సాధన” అంటారు. అస్తు! కానీ, దానిని కవికుల గురువు కాళిదాస మహాకవి చెప్పిన “ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా” అన్న మాటనే నమ్ముతాను వారి విషయంలో నేను.
నా విషయానికి వస్తే నా ప్రయాణంలో రెండు భాగాలు ఉన్నాయి… ఒకటి సాహిత్య – పాత్రికేయ విభాగం కాగా రెండవది సాధనా విభాగం. రెండిటికీ మూలాలు మూడు తరాల వెనుక నుంచీ ఉన్నాయి.
ఒక మనిషి జీవితం తాను పుట్టిన నాటి నుంచి ఈ లోకయాత్ర చాలించే వరకూ మాత్రమే అనుకోను నేను. తన ముందు తరాల జీవన సారం అంతా ప్రోగు చేసుకుని సాగి, ఆ సారాన్ని తరువాతి తరానికి అందించటం ద్వారా, ఆ తరంలో తన సంస్కార బీజాలతో బ్రతికి ఉండటం ద్వారా ” మనిషి నిత్యుడు” అనుకుంటాను నేను.
మన వేదాంతం “ఆత్మ నిత్యం” అంటుంది. దానికి పొడిగింపుగా పైన చెప్పిన విధంగా “మనిషి నిత్యుడు” అని భావిస్తాను నేను.

Leave a comment