స్వీయ అన్వేషణ – 5
రంగాచార్యులు గారి “దాన వీరత్వం” తరువాత చెప్పుకోవలసినది ఆయన “దివ్య దృష్టి”!
ఆయన సిద్ధి చెప్పాలి అంటే ఆయన రెండవ తమ్ముడు ఫణిహారం భాష్యకారాచార్యులు గారితో కలిపి చెప్పాలి. ఇద్దరూ ఇద్దరే!
రంగాచార్యులు గారు తమిళనాడులోని షోలింగర్ లో ఉండే “రెడ్డి గారు” అనే గురువు దగ్గర “మహా మృత్యుంజయ మంత్రం” ఉపదేశం పొంది జీవితాంతం అనుష్ఠానం చేశారని చెప్పాను కదా!
ఆయన రెండవ తమ్ముడు భాష్యకారాచార్యులు కూడా తక్కువ వాడేమీ కాదు! వీరికి ఒక చెల్లెలు ఉండేది. వేదవల్లి తాయారు. ఆమెను బందరులోని బంధువుల అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటివి బాల్య వివాహాలే.
ఒకసారి భాష్యకారాచార్యులు గారు ఆమెతో కలసి బందరు వెళ్లారు. 14 ఏళ్ల కుర్రవాడు. ఒకరోజు బందరు కోట చూడటానికి వెళ్ళాడు. అక్కడ తిరుగుతూ అంటే “భాష్యం! ఇలా రా!” అని ఒక పిలుపు. “నన్ను ఇక్కడ భాష్యం అని పిలిచేది ఎవరు?” అనుకుంటూ ఆ పిలుపు వచ్చిన వైపు నడిస్తే అక్కడ ఒక ఉత్తరదేశపు సన్యాసి కనిపించాడు. ఎందుకో… ఆ సన్యాసిని చూడగానే దణ్ణం పెట్టాడు ఈయన. “నా పేరు మీకు ఎలా తెలుసు?” అని అడిగాడు. ఆ సన్యాసి చిన్నగా నవ్వి ” నీ పేరు ఒక్కటే ఏమిట్రా! నీ గురించి అంతా తెలుసు! నేను నిన్ను మరచిపోలేదు. నీకే నేనెవరో గుర్తు లేదు. ఉండదులే! ఈ జన్మ వేరు కదా!” అన్నాడు.
“ఇంతకీ మీరెవరు? నా గురించి మీకేమి తెలుసు? నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడనే లేదు” అన్నాడు భాష్యం గారు.
“సరేలే, అదంతా తరువాత నీకే తెలుస్తుంది కానీ, నీకు ఒక మంత్రం చెబుతాను. చేస్తావా?” అని అడిగాడు ఆ సన్యాసి భాష్యం గారి కుడి చేయి పట్టుకుని.
భాష్యం గారు ఏదో “ట్రాన్స్” ఉన్నట్టు తల ఊపారు. అప్పుడు ఆ సన్యాసి ఆయనకు “శ్రీ సుదర్శన నారసింహ మహామంత్రం” ఉపదేశించారు. ఆ మంత్రాన్ని భాష్యం గారు కూడా జీవితాంతం ఉపాసించారు.
ఇంటి వెనుక ఒక మెట్ల బావి, దానిలోనికి నీటి కోసం ఒక చేద బావి ఉన్నాయని చెప్పాను కదా? అవి ఈయన కోసం తవ్వించినవే. ఎందుకు? ఆ సన్యాసి ఉపదేశించిన మంత్రాన్ని జపించాలి అంటే నడుము లోతు నీటిలో నిలబడి చేయాలి. జపం చేస్తున్నంత సేపూ మెట్టు మీద కర్పూరం వెలుగుతూ ఉండాలి. 14 ఏళ్ల పిల్లవాడు ఏమిటి? బావులు తవ్వించటం ఏమిటి? ఆ పిల్లవాడు అంటే మాత్రం పెద్దలు ఎలా ఒప్పుకున్నారు?
అప్పటికి “మహాయోగి” వేంకటాచార్యులు బ్రతికే ఉన్నారు. భాష్యం గారు రాజమండ్రి తిరిగి రాగానే ఆయన్ని పిలిచి ” బందరు కోటకు వెళ్లావా? తులసీదాసు మంత్రం ఉపదేశించారా?” అని అడిగారట! ఆ సన్యాసి పేరు “తులసీదాస్” అని భాష్యం గారికి తండ్రి చెప్పే వరకూ తెలియదు. ” “సరేలే, బావి తవ్విద్దాం” అని వేంకటాచార్యులు గారు ఆ దిగుడుబావి తవ్వించారు. ఒక వైపు మెట్లు, బావిలోకి మెట్ల వెంబడి లోపలికి దిగుతూ ఉంటే ఎదురుగా బావి గోడలో ఒక గూడు, దానిలో ఒక ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఒక రాతి గణపతి విగ్రహం. ఇదీ ఆ బావి స్వరూపం. అలా భాష్యం గారి మంత్ర సాధన మొదలు అయింది. ( ఈ విషయాలు నాకు రంగాచార్యులు గారి మరొక సోదరుడు, నన్ను పెంచిన మా చిన్న తాత వేంకట వల్లభాచార్యులు గారు చెప్పారు)
ఇప్పుడు రంగాచార్యులు గారు, భాష్యకారాచార్యులు గారు ఇద్దరు మంత్ర సాధకులు తయారయ్యారు వంశంలో. ఇప్పుడు వీరి “సిద్ధి” ఎలాంటిదో వివరిస్తాను.
రంగాచార్యులు గారి మూడవ కుమారుడు సీతారామాచారి గారు ( ఈయన మా తండ్రి). ఈయనకు కాకినాడ లోని తిరుమల కాండూరి కృష్ణ శేషాచార్యులు గారి పెద్ద కూతురు రంగనాయకి తో వివాహం అయింది. కాలక్రమంలో కృష్ణ శేషాచార్యులు గారు గతించారు.
ఒక చలికాలంలో రాజమండ్రిలో అత్త వారింట్లో ఉన్న రంగనాయకి గారు తెల్లవారు ఝామున పెరట్లో ముగ్గు వేస్తున్నారు. ఆ సమయంలో పెరటి గుమ్మాన్ని దాటుకుంటూ ఒక పొడవాటి వ్యక్తి లోపలికి వచ్చాడు. తెల్లటి పంచ, లాల్చీ, ఒక చేతిలో సంచి, మరొక చేతిలో గొడుగు తో నడచి వచ్చి ముగ్గు వేస్తున్న రంగనాయకి గారి దగ్గర ఆగాడు. ఎవరో వచ్చారని తలెత్తి చూసి ” నువ్వేనా నాన్నా! ఇదేనా రావటం?” అంటూనే ఒక్క క్షణంలో నిలువెల్లా భయపడి పోయి, ముగ్గు చిప్ప అక్కడే పారేసి, ఇంటిలోకి పరుగు పెట్టింది ఆవిడ. అక్కడ లోపల జపం చేసుకుంటున్న రంగాచార్యులు గారు జపం ఆపి చిన్నగా నవ్వుతూ ” ఎందుకమ్మా అంత భయం? వచ్చింది మీ నాన్నగారే కదా?నా కోసం వచ్చార్లే !”అన్నారు. ఆమె భయం మాత్రం తగ్గలేదు. లోపలికి పారిపోయింది. ( ఈ సంఘటన మా అమ్మ రంగనాయకి గారు స్వయంగా నాకు చెప్పారు)
ఈ సంఘటన జరగటానికి మూడేళ్ల ముందే కృష్ణ శేషాచార్యులు గారు గతించారు! ఆ వచ్చిన ఆయన ఆయనే అని ఇంటిలో జపం చేసుకుంటున్న రంగాచార్యులు గారికి ఎలా తెలిసింది? ఇది రంగాచార్యులు గారి శక్తి! ఇక భాష్యం గారు తక్కువేమీ కాదు! అన్నగారి కన్నా నాలుగాకులు ఎక్కువ చదివిన మహా సిద్ధుడు!
ఆ విశేషాలు రేపు…
Leave a comment