“గురువు వదలడు … కానీ…

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 6

ఒక శిష్యుడి క్షేమం గురువు చూస్తూనే ఉంటాడు. అలాటి సందర్భమే భాష్యం గారి జీవితంలోనూ జరిగింది.

భాష్యం గారు అనారోగ్యం పాలయ్యారు. అప్పటికి ఆయన వయసు 40 లోపే. దాదాపుగా చివరి రోజులు.

అప్పుడు ఒక సన్యాసి ఇంటి ముందు నిలిచాడు. “అమ్మా!” అని పిలిచాడు. లోపలినుంచి భాష్యం గారి తల్లి వచ్చింది. “ఎవరు? ఏం కావాలి?” అని అడిగింది. “అమ్మా! మీ ఇంటిలో ఒక మనిషి మరణ శయ్యపై ఉన్నాడు కదా?” అని అడిగాడు. “అవును” అన్నది ఆమె.

“అమ్మా! నేను బ్రతికిస్తాను భాష్యాన్ని. అయితే ఒక తులం బంగారం ఇవ్వాలి నాకు” అన్నాడు ఆ సన్యాసి. వీడు ఎవడో తెలిసే వచ్చాడు, బంగారం కొట్టేద్దామనుకుంటున్నాడు అనుకుంది ఆవిడ. “బంగారం లేదు, గింగారం లేదు, ఫో!” అని కసురుకుంది ఆవిడ. “అమ్మా! భాష్యానికి ఇంకా బ్రతుకు ఉంది. ఈ ఆపద తప్పిస్తాను” అన్నాడు ఆ సన్యాసి. ఆమె వినిపించుకోలేదు. ఆ సన్యాసిని కసురుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఆ సన్యాసి నిట్టూరుస్తూ వెళ్లిపోయాడు.

కాసేపటికి రంగాచార్యులు గారు బయటినుంచి లోపలికి వస్తూనే తల్లిని అడిగారు “అమ్మా! ఎవరైనా సన్యాసి వచ్చారా?” అని. ఆవిడ జరిగింది అంతా చెప్పింది. “ఎంత పని చేశావమ్మా” అంటూ కంగారుగా బయటకు వెళ్లి ఆ సన్యాసి కోసం వెతికి వెతికి ఫలితం లేక వచ్చేశారు. ఆ తరువాత రెండు మూడు రోజులకే భాష్యం గారు పోయారు.

ఆ వచ్చినది మరెవరో కాదు… భాష్యం గారికి ఆయన 14 వ ఏట బందరు కోటలో “శ్రీ సుదర్శన నారసింహ మంత్రము” ఉపదేశించిన గురువు శ్రీ తులసీ దాస్!

ఈ సంఘటన అంతా నాకు నన్ను పెంచిన శ్రీ వేంకట వల్లభాచార్యులు గారు చెప్పారు. నాకు ఒక సందేహం వచ్చింది.

“శిష్యుడి మీద అంత ప్రేమ ఉంటే బ్రతికించచ్చు కదా? బంగారం ఇస్తేనే బ్రతిస్తాను అనటం ఏమిటి? అది అన్యాయం కదా?” అని ఆయనను అడిగాను. దానికి ఆయన ఒక వివరణ ఇచ్చారు.

“శిష్యుడు గురువు చెప్పిన మార్గంలో సాధన చేస్తాడు. మహా సిద్ధులు పొందుతాడు. కానీ ఆ శిష్యుడు గురువు చెప్పిన విధానంలో జీవించాలి. అది చాలామందికి సాధ్యం కాదు. ఆ క్రమంలో కొన్ని తప్పులు మాత్రమే కాదు… తెలిసీ తెలియక పాపాలూ మూట కట్టుకుంటాడు కూడా. ఆ పాపాలు పోవాలంటే గురువు తీసుకోవాలి. తీసుకోవాలి అంటే ఒక మాధ్యమం ( మీడియం) అయిన వస్తువు ఒకటి ఉండాలి. బంగారాన్ని మించిన మాధ్యమం మరొకటి లేదు. అందుకే తులసీ దాస్ గారు అలా అడిగారు.

“అంతే కాదు, గురువు శిష్యుడిని అనుగ్రహించాలి అన్నా కాలం కలసి రావాలి. శిష్యుడికి ఆ యోగం లేకపోతే అది సాధ్యం కాదు. శిష్యుడికి యోగం ఉందా, లేదా అనేది కూడా అతగాడి కర్మరాశి పైన కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే తులసీ దాస్ గారు వచ్చినా ఏమీ చేయలేక పోయారు. ఆయన రెండుసార్లు ‘ భాష్యాన్ని బ్రతికిస్తాను’ అని స్పష్టంగా చెప్పినా మా అమ్మ గమనించలేక పోయింది. ఎవడో ఇంటి ముందుకు వచ్చి “భాష్యాన్ని బ్రతికిస్తాను” అంటే కనీసం ఆ పేరు ఈ మనిషికి ఎలా తెలుసు? అనే ఆలోచన కూడా ఆమెకు రాలేదు. అంతే… గురువు ఏ ఒక్క క్షణమూ శిష్యుడిని వదలడు. శిష్యుడికి ఆ అనుగ్రహాన్ని అందుకునే యోగం ఉండాలి” అని వివరించారు.

“సర్వస్వ శరణాగతి” రేపు..


Leave a comment