“సర్వస్వ శరణాగతి!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 7

ఫణిహారం వేంకట వల్లభాచార్యులు గారు

రంగాచార్యులు గారి తరువాతి వాడు. ఈయన భార్య కనకవల్లి తాయారు గారు. వీరి దగ్గరే నేను చాలా కాలం పెరిగాను.

ఆయన గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, లా అన్నీ మద్రాసులోనే చదివారు. లా పూర్తి అయాక అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర హైకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు.

ఈయన ఎం. ఏ. (ఫిలాసఫీ) చదివేటప్పుడు ఒక స్పెషల్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఆయనకు ఫిలాసఫీ లెక్చరర్ అనంతర కాలంలో భారత రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన ప్రభావంతో ఈయన స్పెషల్ సబ్జెక్ట్ గా ఆది శంకరుల అద్వైత వేదాంతము తీసుకున్నారు. ఆది శంకరుల అద్వైత సిద్ధాంతం అణువణువునా తలకెక్కి, అది చివరికి ఆయన వంశ పరంపర అయిన రామానుజ సిద్ధాంత వ్యతిరేకతగా , ద్వేషంగా పరిణమించింది.

ఆయన భార్య కనకమ్మ గారు రామానుజులు అవతరించిన శ్రీ పెరంబుదూరులో జన్మించారు. రామానుజుల ఆలయానికి ఎడమ వైపు వారి ఇల్లు. ఇంటి అరుగు మీదకు వస్తే రామానుజుల కోవెల కనిపిస్తుంది. ఆ కారణం చేత వల్లభాచార్యులు గారు అత్త వారింటికే వెళ్ళేవారు కాదు! రామానుజుల కోవెల చూడటం కూడా ఆయనకు ఇష్టం లేదు!

చివరికి రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ వారు మద్రాసుపై బాంబు దాడి చేస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో మద్రాసు వదలి అత్తవారి ఇంటికి చేరారు. రామానుజుల కోవెల కనిపిస్తుందని ఇంటి బయటకే వచ్చేవారు కాదు.

గడ్డం బాగా పెరిగిపోయి ఒక రోజు ఉదయం షేవింగ్ సెట్ తీసుకుని రామానుజుల కోవెల కనపడకుండా తల వంచుకుని అరుగు మీదకు వచ్చి కూర్చుని షేవింగ్ చేసుకుంటున్నారు. సగం పూర్తి అయింది. అప్పుడే రామానుజుల ఊరేగింపు బయటకు వచ్చింది. మంగళ వాద్యాల శబ్దానికి అప్రయత్నంగా వెనుదిరిగి చూశారు. ఆయన చూపు రామానుజుల ఉత్సవ మూర్తిపై నిలిచిపోయింది.

ఆ పంచలోహ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఊరేగింపు సమయంలో దానికి చెమట పడుతూ ఉంటుంది. అర్చకులు ఒక వస్త్రంతో ఆ స్వేదాన్ని అద్దుతూఉంటారు. ఆ ఊరేగింపు అరుగుకు కొద్ది దూరంలో ఉండగా ఆయన అప్రయత్నంగా అరుగు దిగి ఆ మట్టి నేల పైనే “ఎన్నుడయవరే!” అంటూ సాష్టాంగ పడిపోయారు.

అప్పటి వరకూ ఉన్న వ్యతిరేకత, ద్వేషం మాయమై పోయాయి. అప్పటివరకూ అణువణువునా నిండిపోయిన ఆది శంకరులు అదృశ్యం అయిపోయారు. ఆ స్థానంలో భగవద్రామానుజులు వచ్చి తిష్ఠ వేసుకు కూర్చున్నారు. వేంకట వల్లభాచార్యులు గారు రామానుజులకు “సర్వస్య శరణాగతి” చేసేశారు.

వేంకట వల్లభాచార్యులు గారు, కనకమ్మ గార్ల దగ్గరే దాదాపు పాతిక ఏళ్లు నేను పెరిగాను. నా జీవితం, అభిప్రాయాల పై ఆ దంపతుల ప్రభావం అత్యధికం.

నాకు 10వ తరగతి పూర్తి అయేసరికి ఆయన చాలా విషయాలు బోధించారు. ఆంగ్ల సాహిత్యంలో షేక్స్పియర్, షెల్లీ, కీట్స్ వంటి వారి రచనలు బోధించారు. పాశ్చాత్యులలోని సోక్రటీస్, ప్లేటో, క్లెంట్ వంటి వారి రచనలు తెలివిడి చేశారు. యోగ శాస్త్రంలో ” షట్ చక్ర నిరూపణ” గ్రంథం వివరించారు. దానికి అనుబంధంగా తన తండ్రి వేంకటాచార్యులు గారు తన చేతి వ్రాతతో వ్రాసుకున్న “ఆయుర్వేద అంతర్గత నాడీ నిదానం”, తాను స్వయంగా మద్రాస్ కనమేరా లైబ్రరీలో నకలు వ్రాసుకున్న “హెలి బర్టన్స్ ఫిజియాలజీ” కలిపి బోధించారు. ఆది శంకరుల సౌందర్య లహరి విడమరచి చెప్పారు. ఇది ఈనాటి నాకు పునాది.

“దాంపత్యం అంటే వారిదే!” రేపు…


Leave a comment