స్వీయ అన్వేషణ – 8
“సుఖ దుఃఖాలలో అద్వైతంగా, అన్ని పరిస్థితులలో తోడుగా, కష్ట సమయంలో హృదయానికి విశ్రాంతి స్థానంగా, వార్థక్యంలో లో కూడా రస స్ఫోరకంగా, కాలం గడిచే కొద్దీ ప్రేమ – స్నేహ సారంగా పరిణమించే దాంపత్యం భద్రంగా ఉండాలనేది ఒక్కటే నేను కోరుకుంటున్నాను” అన్నాడు భవభూతి ఉత్తర రామ చరితం నాటకంలో శ్రీ రామచంద్ర మహా ప్రభువు మాటలుగా!
ఆ మాటలకు అన్ని విధాలా ఉదాహరణ వేంకట వల్లభాచార్యులు, కనకవల్లి తాయారు గార్ల దాంపత్యం.
దాంపత్యం అంటే వారిదే
వేంకట వల్లభాచార్యులు గారు, కనకమ్మగారు దంపతులు. దంపతులు అనే మాటకు అర్థం వారే. ఎలాగో వివరిస్తాను.
వారిద్దరూ గొడవ పడటం ఒక్కరోజు కూడా నేను చూడలేదు. మాట పట్టింపులు వారి మధ్య లేవు. ఒకరి అభిప్రాయాలతో మరొకరు ఏకీభవించిన వారు. ఒకవేళ అభిప్రాయ భేదాలు వచ్చినా ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించుకునే వారు.
మా పెదనాన్న రాధాకృష్ణన్ గారి ఆరోగ్యం పాడైంది. తనను శ్రీ నృసింహస్వామియే కాపాడుతాడు అంటూ భార్య ప్రవాల వల్లి తో కలసి తమిళనాడులోని శ్రీ యోగానంద నృసింహ క్షేత్రం షోలింగర్ కు వెళ్ళిపోయారు. కొద్ది కాలానికి ఆయన అక్కడే మరణించారు. ఆ సందర్భంలో కనకమ్మ గారికి ఒక అభిప్రాయం ఏర్పడింది. ఇంటిలో మంత్ర తంత్రాల పైన నమ్మకం ఉంది. సమీప బంధువులలో ఒకరు, అది కూడా మా అమ్మగారి వైపు వారిలో ఒకరు చేసిన లేదా చేయించిన ప్రయోగం వల్లనే ఆయన మరణించారు అని ఆవిడ భావించారు. అదే భర్త దగ్గర ప్రస్తావించారు. ఆయన ఏమీ మాట్లాడలేదు. తల ఊపి ఊరుకున్నారు. ఆ తరువాత ఆయన నాతో ” మీ మామ్మ ఇలా అనుకుంటోంది. నాకు అలాటి అభిప్రాయం ఏమీ లేదు. కానీ ఆవిడ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. అందుకని వారి ఇంటికి నువ్వు వెడితే వెడుతూ ఉండు. కానీ వారిని ఈ ఇంటికి మాత్రం రావద్దని చెప్పు. వారు ఇక్కడకు వచ్చి, ఈవిడ వారిని ఏమన్నా అంటే వారికి మర్యాదగా ఉండదు. గుర్తు పెట్టుకో! ఆవిడ అభిప్రాయం తో నేను ఏకీభవించటం లేదు. వారు అలా చేస్తారని నేను నమ్మను. కానీ ఆవిడ మాటకు నేను గౌరవం ఇస్తాను. ఆవిడకు బాధ కలిగే పని చేయటం నాకు ఇష్టం లేదు, అలాంటి పని నేను చేయను”.
“నువ్వు ఆ మాట నమ్మనప్పుడు ఆ మాట ఆవిడకు చెప్పవచ్చు కదా?” అన్నాను.
దానికి ఆయన సమాధానం… ” ఒకటి గుర్తు పెట్టుకో. ఒక ఆడపిల్ల ఒక ఇంటిలో కొన్నేళ్ళు పెరుగుతుంది. ఆ ఇంటి అలవాట్లు, సంప్రదాయాల మధ్య పెరుగుతుంది. ఆ తరువాత పెళ్లి అవుతుంది. పెద్దలు నిర్ణయించిన పెళ్లి. అప్పటి వరకూ పెరిగిన ఇంటిని వదలి, ముక్కూ మొహమూ తెలియని మనిషితో మరొక ఇంటికి వచ్చేస్తుంది… ఆ మనిషిని నమ్మి. తన జీవితం మొత్తం ఆ మనిషి కష్టంలో, సుఖంలో తోడుగా ఉంటాడని నమ్మి. తన గౌరవాన్ని నిలబెడతాడు అని నమ్మి. అలా వచ్చిన అమ్మాయిని ఈ ఇంటిలో కలుపుకో వలసిన బాధ్యత అత్తింటి వారిదే. ఇంటి కోడలి గౌరవ మర్యాదలు కాపాడవలసిన, నిలబెట్ట వలసిన బాధ్యత అత్తింటి వారిదే. భార్య అభిప్రాయంతో ఏకీభవించినా, లేకపోయినా ఆ అభిప్రాయాన్ని గౌరవించటం భర్త బాధ్యత”.
ఇది నాకు ఒక పాఠం.
మరొక సంఘటన… దీనిని నేను ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో కథగా కూడా వ్రాశాను.
దీపావళి. ముగ్గురికీ కొత్త బట్టలు. నా బట్టలు రాజమహేంద్రవరం లో కోటగుమ్మం దగ్గర “ది బెంగళూరు సిటీ డ్రెస్ మార్ట్” లో. అరగంటలో ఎంపిక అయిపోయేది. ఆయన పంచలు, ఆవిడ చీరలు పెద్ద మసీదు దగ్గర నీలకంఠం శేషయ్య షాప్. ఆయన బట్టల ఎంపిక చాలా సింపుల్. 100 కౌంట్ గ్లాస్కో ధోవతులు. పావుగంట పని. ఇక ఆవిడ చీరల ఎంపిక. అంత సులువుగా తేలేది కాదు. ఆ ఏడాది రెండు చీరల మధ్య పోటీ. ఒకటి నెమలి కంఠం రంగు చీర, రెండవది పాలపిట్ట రంగు చీర. ఎంతకీ తెమల్చటం లేదు. గంట గడిచినా… ఆయనకు కాస్త విసుగు వచ్చింది. ఆ రెండిటిలో ఒకటి తీసి ప్యాక్ చేయమని చెప్పేశాడు. ఆవిడ ఆయన వైపు ఒకసారి చూసింది. ఏమీ మాట్లాడలేదు. వచ్చేశాము.
దీపావళి రోజు… రెండు మండువాల ఇల్లు… పెద్ద చావడి, లోపలి చావడి… రెండిటి నిండా ముగ్గులు. మొత్తం 365 దీపాలు. దీపాలు అన్నీ వెలిగించి, కొత్త చీర కట్టుకుని వచ్చి ఆయనకు దణ్ణం పెట్టీ, ఆయనకు ఇష్టమైన గులాబ్ జామ్ ఇవ్వాలి. దీపాలు వెలిగించడం అయిపోయింది. ఆయన పెద్ద చావడిలో వెయిటింగ్. ఎంతసేపటికీ ఆవిడ రాదు. లోపలికి వెళ్ళి చూశాడు. ఆవిడ లోపలి చావడి లో స్థంభానికి ఆనుకుని ఆకాశాన్ని చూస్తూ కూర్చుని ఉంది. ఒక్క క్షణం చూశాడు ఆయన. వెంటనే బయటకు వచ్చి నన్ను తీసుకుని పెద్ద మసీదు దగ్గర నీలకంఠం శేషయ్య షాప్ కి వెళ్ళాడు. ఆ రోజు ఆవిడ చూసిన రెండవ చీర తీసుకుని వచ్చి ఆవిడ చేతిలో ఉంచి, తల నిమిరి వచ్చి ముందు చావడి లో కూర్చున్నాడు. అయిదు నిమిషాలకి ఆవిడ ఆ చీర కట్టుకుని వచ్చి ఆయనకి దణ్ణం పెట్టీ, ఏడుస్తూ, ఆయన ఒడిలో తల పెట్టుకుని ఉండిపోయింది. ఆయన ఆవిడ తల నిమురుతూ ఉండిపోయాడు.
నేను ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రికలో పనిచేసేటప్పుడు ఒక దీపావళి కి వారం రోజుల ముందు ఆఫీస్ అయిపోయాక ఎడిటర్ శ్రీ వాకాటి పాండురంగ రావు గారు ” ఇదుగో, ఉండు. నేనూ అబిడ్స్ వైపు వస్తాను మా ఆవిడకి చీర కొనాలి దీపావళికి” అంటూ వచ్చారు. నడుచుకుంటూ వెడుతున్నాం. “మా ఆవిడకి నేను చీర కొని పదేళ్లు అయింది” అన్నారు ఆయన. “సర్! మీరు కొంటారు సరే, ఆవిడకి నచ్చాలి కదా?” అన్నాను. “ఆ డౌట్ నీకెందుకు వచ్చింది?” అని అడిగారు. అప్పుడు ఈ కథ చెప్పాను ఆయనకి. కథ పూర్తి అయే దాకా నడుస్తూ ఉన్న ఆయన పూర్తి కాగానే ఆగిపోయారు. “ఇంత గొప్ప కథ పెట్టుకుని ఇన్నాళ్లూ ఏం చేస్తున్నావ్ వ్రాయకుండా? రేపు పొద్దున్న నువ్వు ఈ కథ తోనే ఆఫీస్ కి రావాలి. సరే. నేను ఇంటికి వెడతా” అన్నారు. “మరి చీర?” అని అడిగాను. చిన్న నవ్వు నవ్వి, “రేపు ఆవిడని కూడా తీసుకువచ్చి, ఆవిడకి నచ్చిన చీర కొనిస్తా. సెలక్షన్ కి ఎన్ని గంటలు పట్టినా” అని బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు. అలా ఒక ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రికలో దీపావళి ప్రత్యేక సంచికలో “స్నేహ సారే స్థితమ్” అనే కథ అచ్చు అయింది.
“చావు అంటే భయం పోయింది!”రేపు…
Leave a comment