” వంకర టింకర చదువులు”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 10

“నీ చదువుల గోల మాకెందుకయ్యా?” అనవచ్చు. నిజమే! కానీ, భగవంతుడి ప్రణాళిక ఒకటి ఉంటుంది. నా జీవితంలో ప్రతి దశలోనూ ఇది ఋజువు అయింది. ఆ క్షణంలో “ఈ పెద్దవాళ్ళున్నారే…వీళ్ళు నాతో ఆడుకుంటున్నారు” అనిపించింది కానీ, ఆంధ్ర పత్రిక దిన పత్రికలో చేరిన తరువాత అర్థం అయింది నా వంకర టింకర చదువుల ప్రయాణం పరమార్థం!


ఒకటవ తరగతి నుంచి ఎం. ఏ తెలుగు, ఇంగ్లీషు వరకు సాగిన నా చదువులో 1,2 తరగతులు హైదరాబాద్ లో, 3,4,5 తరగతులు రాజమండ్రిలో, ఆరవ తరగతి లో సగం విశాఖ జిల్లా దార్లపూడిలో, మిగిలిన సగం, 7, 8 తరగతులు మళ్ళీ హైదారాబాద్ లో, 9,10 తరగతులు, ఇంటర్ మొదటి ఏడాదిలో సగం రాజమండ్రిలో, రెండవ సగం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో,  ఇంటర్ రెండవ ఏడాది, బి. కాం మొదటి సంవత్సరం రాజమండ్రిలో జరిగాయి. అక్కడితో “రెగ్యులర్ స్టడీస్” కి మంగళం పాడేశాను.
నా చదువులో మా నాన్న సీతారామాచారి గారు చూపిన శ్రద్ధ కన్నా వేంకట వల్లభాచార్యులు గారు చూపిన నిష్ఠ చాలా…చాలా గొప్పది. ఆ మాటకు వస్తే  సీతారామాచారి గారు ఫీజులు కట్టారు తప్ప ఏ విధంగానూ పిల్లల చదువుల విషయం పట్టించుకోలేదు.
వేంకట వల్లభాచార్యులు గారు అలా కాదు. మా చిన్న తాత భాష్యంగారి మనుమడు, నాకు బావ వరుస అయిన భాష్యం CA లో మంచి స్థానంలో పాస్ అయాడు. ఆంధ్రా బ్యాంక్ లో ఉద్యోగం సాధించాడు. అతను అప్పుడు చదువుకునే పిల్లలకు రోల్ మోడల్. వేంకట వల్లభాచార్యులు గారు నన్ను కూడా CA చదివించాలి అనుకున్నారు. 9 వ తరగతిలో ట్రైనింగ్ కాలేజ్ లోని మోడల్ హై స్కూల్ లో చేరేటప్పుడు… Composite Maths తీసుకుంటే మంచిదని భాష్యం సలహా. (అప్పట్లో 8వ తరగతిలో కాంపోజిట్ మ్యాథ్స్, జనరల్ మ్యాథ్స్ అని రెండు ఉండేవి. వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి) అందుకని అందులోనే చేర్చారు. కష్టమైన సబ్జెక్ట్. ఆ లెక్కలు చేయటానికి నాతో పాటు కూర్చునేవారు. ఇద్దరం కలసి చేసేవాళ్ళం. నేను చేరేటప్పటికి సోషల్ స్టడీస్ లోని హిస్టరీలో చాలా వరకు మ్యాప్ డ్రాయింగ్ పూర్తి అయింది. సత్యనారాయణ మూర్తి గారు సోషల్ మాస్టర్. అప్పటి వరకూ పూర్తి అయిన మ్యాప్ లు 32. వాటిని అన్నిటినీ పూర్తి చేయటానికి ఆయన మూడే రోజులు గడువు పెట్టారు.
వేంకట వల్లభాచార్యులు గారు మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్. ఆయన తన తండ్రి వేంకటాచార్యులు గారి ఫోటో దగ్గర పెట్టుకుని, చార్ కోల్ తో పెయింటింగ్ వేశారు. అది ఇంటి పెద్ద చావడి గుమ్మం పైన వేంకట రంగాచార్యులు ( తహశీల్దార్ గారు), శ్రీ భగవద్రామానుజాచార్యుల వారి ఫోటోల ప్రక్కన ఉండేది. ఆ పెయింటింగ్ జీవ కళతో ఉట్టి పడుతూ ఉండేది. ఆయన కళ్ళలోని తీక్షణతను ఆ పెయింటింగ్ లో ఒడిసి పట్టుకున్నారు ఆయన. యోగ సిద్ధి అంతా ఆ పెయింటింగ్ లో సాక్షాత్కరించింది. ( ఇక్కడ ఇంతకుముందు చెప్పిన ఒక విషయాన్ని గుర్తు చేయాలి. వేంకటాచార్యులుగారు మరణిస్తే, ఆయన దేహాన్ని దహనం చేయవద్దు అనీ, ఇంటి పెరటిలో ఖననం చేయాలని, అలా చేస్తే తరువాతి పది, పదిహేను తరాలు సుఖశాంతులతో, ధన ధాన్య సమృద్ధితో విలసిల్లుతారని ఆయన కుమారుడు వేంకట రంగాచార్యులు గారి గురువు రెడ్డి గారు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ పని ఎలాగూ జరగలేదు. అందుకే ఆయన పెయింటింగ్ వేసి పెట్టారు వేంకట వల్లభాచార్యులు గారు. ప్రస్తుత ఆస్తి యాజమానుల నిర్వహణలో ఆ పెయింటింగ్ ఎక్కడ ఉందో తెలియదు. “ఆ పెయింటింగ్ నాకు కావాలి, ఎక్కడ ఉంది అని అడిగాను”. “సి డి లలో ఫోటోలు అన్నీ సేవ్ చేసి పెట్టాను. వెతకాలి. వెతికి ఇస్తాను” అన్నారు ఒక “తమ్ముడుగారు”. ఈనాటి వరకూ ఆ పని జరగలేదు.

“ఫోటోలు అన్నీ సిడి లలో సేవ్ చేయడం” అంటే ఒరిజినల్  చార్ కోల్ డ్రాయింగ్ పోయిందని అనుకోవాలా? పాడయి పోయిందని అనుకోవాలా? నిర్లక్ష్యము అనుకోవాలా? ప్రస్తుత ఆస్తి యాజమానుల నిర్వహణలో 1. దేవతార్చన పోయింది. 2. షోలింగర్ ఆలయ మర్యాదల ఆధికారిక పత్రం పోయింది. 3. తర తరాలకు రక్షణ కవచంగా నిలువ గలిగిన వేంకటాచార్యులు గారి పెయింటింగ్ జాడ లేదు.

వేంకట వల్లభాచార్యులు గారు మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్ కనుక ఆయన మార్గదర్శనంలో ఆ మ్యాప్స్ అన్నీ ఆ మూడు రోజులలో పూర్తి చేయగలిగాను.
ఆయన ఆ రెండు ఏళ్లలో ఆంగ్ల సాహిత్యంలో షెల్లీ, కీట్స్, షేక్స్పియర్ రచనలు అన్నీ బోధించారు. పాశ్చాత్య వేదాంతులు సోక్రటిస్, కెంట్ వంటి వారి రచనలు బోధించారు. వాటితో పాటుగా తన తండ్రి వేంకటాచార్యులు గారి చేతివ్రాతలో ఉన్న “ఆయుర్వేద నాడీ నిదానం”, తాను మద్రాస్ లోని కెనమెరా లైబ్రరీ లో చూసి వ్రాసుకున్న హలిబర్టన్స్ ఫిజియాలజీ, సర్ జాన్ ఉడ్రాఫ్ వ్రాసిన ” ది సర్పెంట్ పవర్” , “పాదుకా పంచకం” , “షట్ చక్ర భేదనం” కలిపి బోధించారు. ఈ బోధన నాకు యోగ శాస్త్రం లోని “కుండలినీ విద్య” లో ఒక అవగాహన కలిగించింది. ఆది శంకరుల “సౌందర్య లహరి” అవగాహన చేశారు.
ఈ రోజు నా సాధనకు అవసరం అయిన పునాది వేసిన మహాత్ముడు వేంకట వల్లభాచార్యులుగారు. ఆయన ఇలాటి పునాది వేస్తే, ఆయన భార్య కనకమ్మ గారు “మొగలాయి దర్బారు కుట్రలు”, “కాశీ మజిలీ కథలు” వంటివి చదివించి నాలో “చదవటం” అనే అలవాటును చేశారు.

“లెక్కల మాస్టారి తెలుగు పాఠాలు” రేపు..


Leave a comment