స్వీయ అన్వేషణ – 11
దార్లపూడి… విశాఖపట్టణం జిల్లాలో ఒక గ్రామం. దాని ప్రక్కనే ప్రపంచ ప్రసిద్ధి పొందిన చెక్క బొమ్మలు తయారు చేసే ఏటికొప్పాక గ్రామం. రెండు గ్రామాల మధ్య ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో, ఎప్పుడు ఉప్పొంగి పోతుందో తెలియని ఒక ఏరు. దార్లపూడికి ఆనుకొని ఏటికొప్పాక చక్కెర ఫ్యాక్టరీ. దానిలో మా పెదనాన్న గారు రాధాకృష్ణన్ గారు అకౌంట్స్ ఆఫీసర్. ఆయన దగ్గర పెడితే బాగు పడతానని ( అప్పటికి పాడైపోయింది ఏమీ లేకపోయినా!) మా నాన్న భావించి 6వ తరగతిలో అక్కడ చేర్చాడు.
ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు రెండూ కలసి ఉండేవి. అక్కడ చదివిన ఆరు నెలలలో జీవితాంతం గుర్తుండిపోయే ఒక ఉపాధ్యాయుడు వర్మ గారు. పూర్తి పేరు అప్పుడు తెలియదు, ఇప్పుడూ తెలియదు.
ఆయన లెక్కల మాష్టారు. వారం అంతా లెక్కలు చెప్పేవారు. శనివారం నాడు చివరి పీరియడ్, సోమవారం నాడు మొదటి పీరియడ్ లెక్కల పీరియడ్. ఆయనదే. సాధారణంగా ఇలాటి సందర్భాలలో ఏ లెక్కల మాస్టారు అయినా “చచ్చేంత హోమ్ వర్క్” ఇచ్చి, సోమవారం ఉదయం “చెమడాలు ఎక్కదీస్తారు”. ఈయన పూర్తిగా వ్యతిరేకం!
శనివారం చివరి పీరియడ్ వచ్చింది అంటే లెక్కల గోల వదలింది అనే సంతోషం, ఇవాళ ఏమి చెబుతారో అనే ఉత్కంఠ. ఆయన వస్తూనే చాక్ పీస్ తీసుకుని, బ్లాక్ బోర్డు మీద శ్రద్ధగా వ్రాయటం మొదలు పెట్టేవారు. వ్రాయటం పూర్తి అయే సరికి ఆ బోర్డ్ మీద ఒక “తెలుగు పద్యం” ప్రత్యక్షం అయేది! ఒక్కొక్కడినీ లేపి ఆ పద్యం చదివించేవారు. క్లాస్ లో 25 మంది ఒక్కొక్కడు నట్టుతూ, కూడ బలుక్కుంటూ చదివేసరికి పీరియడ్ సమాప్తం. అప్పుడు అనేవారు ఆయన… ” సోమవారం ప్రొద్దున ఈ పద్యం అప్పచెప్పాలిరా!”
ఆ మాట వినేసరికి గొంతులో పచ్చి వెలక్కాయ పడేది. ఇంతకన్నా ఓ పాతిక లెక్కలు హోమ్ వర్క్ ఇచ్చినా బాగుండేది అనుకునే వాళ్ళం! ఎందుకు?
ఆయన బోర్డ్ మీద వ్రాసిన ఒక్కొక్క పద్యం చదవటానికే మా వల్ల అయేది కాదు! ఒక్కొక్కటీ “కంకర రాళ్ళ గుట్ట!” నోరు తిరిగేది కాదు. ఇక ఒక్క రోజులో బట్టీ పట్టి అప్పచెప్పడమా? అలా ఆయన మొట్ట మొదట బోర్డ్ మీద వ్రాసిన పద్యం పెద్దన గారి మనుచరిత్రలోని ” అట జని కాంచె భూమిసురుడు…”! అప్పుడు చచ్చీచెడీ బట్టీ పట్టి అప్పజెప్పిన ఆ పద్యం ఇప్పటికీ ఇన్నేళ్ళ తరువాత కూడా గుర్తు ఉంది. అలా ప్రతి వారం ఆయన నోరు తిరగని పద్యాలు మాకు కంఠస్థం చేయించారు. అలాటి పద్యాల మీద అంత చిన్న వయసులో ఆసక్తి, ఇష్టం కలిగించిన వర్మ గారిని ఎలా మరచిపోగలను? తెలియకుండానే తెలుగు పద్యాన్ని నా ఎదలో నిలిపిన వర్మ గారికి శిరసు వంచి (ఆయన ఏ లోకంలో ఉన్నా…) నమస్కరించడం తప్ప ఏమి చేయగలను? నా అనంతర సాహిత్య జీవనానికి నాకు తెలియకుండానే “అంకురార్పణ” చేసిన మాష్టారూ! మీకు శిరసా వందనం!
” చెరుకు గడలు లాగేసేవాళ్ళం!”
దార్లపూడికి ప్రక్కనే ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ ఉందని చెప్పాను కదా? చెరుకు సీజన్ లో ఎడ్ల బండ్ల మీద చెరుకు గడలు వేసికొని రైతులు ఆ ఫ్యాక్టరీకి తరలించేవారు. ఈ పని అంతా రాత్రి పూట జరిగేది. వీధి దీపాలు పెద్దగా ఉండేవి కాదు. ఏటికొప్పాకకు అటువైపు గ్రామాల రైతులు ఆ ఫ్యాక్టరీకి వెళ్ళాలి అంటే దార్లపూడి మీదుగానే వెళ్ళాలి. మా ఇల్లు ఆ గ్రామ ప్రధాన వీధిలోనే ఉండేది. అంటే బళ్ళు మా ఇంటి ముందు నుంచే వెళ్ళాలి. రాత్రి 8 అయేసరికి నాతో సహా మరో ఐదుగురం చేరేవాళ్ళం. రైతులు బండి నొగలులో నిద్ర పోతూ ఉంటే బళ్ళు అలా సాగిపోతూ ఉండేవి. కాస్త ఎడం ఎక్కువగా ఉండే రెండు బళ్ళు చూసుకుని వాటంగా వాటి మధ్యలోకి దూరి ఆ బండి రైతుకు తెలియకుండా, వెనుక బండి రైతు కంట పడకుండా, తలకొక చెరుకు గడ ఒడుపుగా లాగేసుకునే వాళ్ళం. అందులోనూ “నల్ల చెరుకు” ఎంపిక చేసుకుని మరీను! ఆ సీజన్ అంతా ఇదే పని. అది “దొంగతనం”. నిజమే! కానీ అలా అనుకునే వాళ్ళం కాదు. అది మా ఒడుపు అనుకునేవాళ్ళం. అది ఆ వయసులో “తుంటరితనం”! ఇప్పుడు ఈ వయసులో “అది దొంగతనం” అనే తెలివిడి కలిగినా ఏం ప్రయోజనం? వాడెవడో అన్నట్టు “జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది”!
“హాత్ మిలావ్ దోస్త్!” రేపు…
Leave a comment