“హాథ్ మిలావ్ దోస్త్!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 12

దార్లపూడిలో 6వ తరగతి సగం అయేసరికి మా పెదనాన్న గారు ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగానికి రాజీనామా చేసేసి, రాజమహేంద్రవరం వెళ్ళిపోయారు. కనుక మా నాన్న నన్ను హైదారాబాద్ తీసుకువచ్చాడు. ఆయన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగి.

నన్ను తీసుకువచ్చి మలక్ పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్చారు. హైదారాబాద్ లో దిల్సుఖ్ నగర్ నుంచి నల్గొండ చౌరస్థాకు వెళ్లే దారిలో మలక్ పేట్ ఏరియా. మెయిన్ రోడ్ కు ఎడమవైపు ప్రభుత్వ క్వార్టర్స్ ఉంటాయి. వాటి ప్రక్క నుంచి లోపలికి వెడితే ఒకటే రోడ్ ముంతాజ్ కాలేజ్ వరకు. త్రోవ అంతా రెండు వైపులా ఎర్రని “వన జ్వాల” వృక్షాలు. ముంతాజ్ కాలేజ్ గేటుకు ముందే ఆ మలక్ పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల. అక్కడే ఆ రోడ్డు లోపలికి మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ప్రభుత్వ క్వార్టర్స్ ప్రారంభం. మళ్ళీ ఆ రోడ్డు మలుపు తిరిగి ముంతాజ్ కాలేజ్ గోడ వెంబడి పోయి, మళ్ళీ ఎడమకు తిరుగుతుంది. కొద్ది దూరం వెడితే “C” క్వార్టర్స్ ప్రారంభం. ఇంకొంచెం ముందుకు వెడితే అసాఫియా హైస్కూల్ గేట్. దాని ముందు ఒక రోడ్ C క్వార్టర్స్ లోకి వెడుతుంది. C – 27 మేము ఉండేది. అక్కడ ఆ క్వార్టర్స్ ఒక వైపు ఎదురు ఎదురుగా ఒకే వరుసలో, మరో వైపు అర్థ చంద్రాకారం లో ఉంటాయి. ఆ మధ్య గుండ్రని ప్లే గ్రౌండ్.

C – 27 మా క్వార్టర్స్. ఇంటి ముందు ఎర్ర గన్నేరు చెట్లు. రెండు గదులు, ఒక హాలు, వంటిల్లు, స్నానాల గది, టాయిలెట్ విడి విడిగా ఒకే వరుసలో ఒకదానిని ఆనుకుని ఒకటి. వెనుక పెద్ద పెరడు. దానిలో పూల మొక్కలు. ఇదీ మా నివాసం.

మలక్ పేట్ హైస్కూల్ లో ఆరవ తరగతి సగంలో చేరాను. ఆ సంవత్సరంలో బాగా అభిమానించిన టీచర్ మెరీనా శేషాద్రి. అప్పుడే శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు సినిమా వచ్చింది. దానిలో “వల్లభా! ప్రియ వల్లభా!” అనే పాట ఉంది. మెరీనా టీచర్ అలాగే పిలిచేవారు నన్ను!

ఏడవ తరగతికి వచ్చేసరికి ఒక క్రొత్త తెలుగు మాష్టారు చేరారు. ఆయన పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఆనాటి ఆధునిక కవితా రంగంలో అత్యాధునికంగా విజృంభిస్తున్న “దిగంబర కవితా ఉద్యమం” లో “చెరబండరాజు” గా ప్రసిద్ధులు! ఆయన మాకు తెలుగు బోధించటానికి వచ్చారు.

ఒకసారి స్లిప్ టెస్ట్ జరిగింది. బుద్ధుడి పై ఒక ప్రశ్న. దానికి సమాధానం వ్రాస్తూ ” బుద్ధుడు అహింసా సిద్ధాంతమును ఎలుగెత్తి చాటిన మహాత్ముడు” అని వ్రాశాను. ఆయన “ఎలుగెత్తి” అనే పదం క్రింద అండర్ లైన్ చేసి, ఆ సమాధానానికి పూర్తి మార్కులు వేశారు. ఆ రోజు సాయంత్రం స్కూల్ అయిపోయాక బయటకు వస్తుంటే ఆయన నన్ను పిలిచి, “తెలుగు పుస్తకంలో “ఎలుగెత్తి” వంటి పదాలు ఎన్ని ఉన్నాయో రేపు వ్రాసుకురా!” అన్నారు. ఆ రాత్రి కూర్చుని తెలుగు పుస్తకంలో అలాటి పదాలు వెతికి, ఒక కాగితం మీద వ్రాసుకు వెళ్ళాను. దాదాపు 70 పదాలు వచ్చాయి.

మరునాడు వాటిని ఆయన ముందు ఉంచాను. అన్నీ చదివారు ఆయన. చదవటం పూర్తి అయాక ఆయన కుడి చేయి ముందుకు చాచి, “హాత్ మిలావ్ దోస్త్!” అంటూ చేయి కలిపారు. ఆ తరువాత క్లాస్ రూం బయట మేము ఎక్కడ కలిసినా ఆయన ” దోస్త్” అనే పిలిచేవారు. రెండేళ్ల “సాహచర్యం” ఆయనతో.

తెలుగు పుస్తకంలో పోతన గారి భాగవత పద్యాలు ఉండేవి. వాటిని కూడా ఈ “దిగంబర కవి” అద్భుతంగా పాఠం చెప్పారు. తన సాహిత్య సిద్ధాంతాలు ఏవి అయినా తాను నిర్వహిస్తున్న ఉపాధ్యాయ వృత్తి ధర్మాన్ని ఎంత నిక్కచ్చిగా పాటించారో అనంతర కాలంలో కానీ నాకు అర్థం కాలేదు.

ఎవరు నమ్మినా, నమ్మక పోయినా ఆయన చెప్పిన ఒక మాట చెప్పి తీరాలి.

భాగవత పద్యాలు పాఠం చెప్పటం పూర్తి అయాక ఒక రోజు సాయంత్రం స్కూల్ బయటకు వస్తుంటే పిలిచారు “దోస్త్” అంటూ. వెళ్ళాను. ఆనాటి భాగవత పద్యాల పాఠం గురించే రోడ్డు మీద నడుస్తూ మాట్లాడారు. చివరగా ఒక మాట అన్నారు ఆ “దిగంబర కవి చెరబండ రాజు”… ” దోస్త్! బతుకు బాగుపడాలి అంటే భాగవతం చదువు!”అందుకే అన్నాను “ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఒక మాట చెప్పాలి” అని.

ఆ తరువాత ఎన్నో ఏళ్ళకి రాజమండ్రిలో మహా పండితుడు, సాహిత్య విమర్శలో మేరు శిఖరం, రస సిద్ధుడు శ్రీ మల్లంపల్లి శరభయ్య గారితో సాన్నిహిత్యం బాగా పెరిగిన తరువాత జరిగిన ఒక సంఘటన.

రాజమండ్రిలో కొందరు సాహితీ పిపాసువులు “సాహితీ వేదిక” అనే సంస్థను స్థాపించి కార్యక్రమాలు నిర్వహించేవారు. ఒక సాయంత్రం వారు “చెరబండ రాజు వర్ధంతి” కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేనూ వెళ్ళాలనుకున్నాను. ముందుగా శరభయ్య గారి ఇంటికి వెళ్ళాను. ఇద్దరం బయటకు వచ్చి మార్కండేయస్వామి గుడి రేవు మెట్ల మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాము. సాహితీ వేదిక కార్యక్రమానికి సమయం అవుతూ ఉండగా ఆయనను అడిగాను… “సాహితీ వేదికకు వస్తున్నారా?” అని. ఆయన ” ఎందుకు?” అన్నారు. ” చెరబండరాజు వర్ధంతి సభ” అన్నాను. ఆయన విసుగ్గా ” ఎవడు? ఆ దిగంబర కవేనా? వాళ్ళ భాషే దరిద్రం. పైగా దానికి కవిత్వం అని ఒక పేరు! అయినా మీరేమిటి అక్కడికి వెడుతున్నారా?” అని ఎదురు ప్రశ్న వేశారు. ” అవును!” అన్నాను. ” ఎందుకు?” అన్నారు. “మాష్టారూ! ఆయన నాకు 7,8 తరగతులలో తెలుగు టీచర్…” అంటూ ఆయనతో అనుభవం అంతా చెప్పాను. చివరగా ” బతుకు బాగుపడాలి అంటే భాగవతం చదువు” అని ఆయన చెప్పిన మాట చెప్పాను. ఆయన ఒకసారి ఆశ్చర్యంగా చూసి, లేచారు. “పదండి, వెడదాం” అన్నారు. పరమ సంప్రదాయ కవిత్వ నిష్ఠ కల శరభయ్య గారి అభిప్రాయం మారిపోయింది. ఆ తరువాత నా దగ్గర ఉన్న “చెరబండ రాజు పాటలు” పుస్తకం అడిగి తీసుకుని శ్రద్ధగా చదివారు. ఆ తరువాత ఆయన అన్న మాట… ” ఆచార్యులు గారూ! మీ తెలుగు మాష్టారి దగ్గర సరుకు ఉందండీ!”.

బహుశః ఇది పైన ఎక్కడి నుంచో చదివితే “చెరబండరాజు మాష్టారు” మళ్ళీ “హాత్ మిలావ్ దోస్త్!” అనరూ?

” ఆవారా బ్రతుకులో …” రేపు…


One response

  1. prof. T. Patanjali

    చివరగా ఒక మాట అన్నారు ఆ “దిగంబర కవి చెరబండ రాజు”… ” దోస్త్! బతుకు బాగుపడాలి అంటే భాగవతం చదువు!” ఈ వాక్యం ఆశ్చర్యంగా ఉంది. నమః.

    Like

Leave a comment