స్వీయ అన్వేషణ – 13
7,8 తరగతుల తరువాత మళ్ళీ 9,10 తరగతులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కళాశాల ( గవర్నమెంట్ టీచర్స్ ట్రైనింగ్ కాలేజ్) కు అనుబంధంగా ఉన్న మోడల్ హై స్కూల్ లో. 6,7,8 తరగతులలో ప్రేరణ కలిగించిన ఉపాధ్యాయుల వంటి వారు ఎవరూ తగలలేదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నన్ను పెంచిన మా చిన్న తాతగారు వేంకట వల్లభాచార్యులు గారు నన్ను CA చదివించాలని కాంపోజిట్ మ్యాథ్స్ లో చేర్చారు. 10 తరగతి పూర్తి అయింది. అప్పుడు నా జీవితం మరో మలుపు తిరిగింది.
పరీక్షలు పూర్తి అయాయి. తిరుపతి ప్రయాణం పెట్టాడు మా తాత. రైలుకు రిజర్వేషన్స్ కూడా చేసేశాడు. అప్పుడు చెప్పాడు నాకు. తిరుపతి అంటే గుండు! చేరాల్సింది జూనియర్ కాలేజ్ లో! గుండు తోటా? No way!
ఆయనని అడిగాను… ” గుండు కొట్టించుకోవాలా?”.
“వెళ్ళాక చేయించుకోవాలి కదా?” అని ఆయన జవాబు.
“అయితే నేను రాను!” నా నిశ్చయం.
ఒప్పించటానికి ఎంతో ప్రయత్నించాడు. ఊహూ… No way అంటే No way! నా పట్టు వదలలేదు.
“అయితే టికెట్స్ కేన్సిల్ చేసేస్తా” అన్నాడు ఆయన.
” చేసేయ్” అన్నాను నేను.
మరునాడు మధ్యాహ్నం ఆయన టికెట్స్ కేన్సిల్ చేయటానికి గోదావరి స్టేషన్ కి వెళ్ళాడు. టికెట్స్ కేన్సిల్. తిరిగి వస్తున్నాడు రిక్షాలో. అప్పుడే జరిగింది నా బ్రతుకును మలుపు తిప్పిన సంఘటన.
ఆయన రిక్షాలో వస్తున్నాడు. ఒక సందులో నుంచి ఒకడు సైకిల్ పై వేగంగా వచ్చి రిక్షా ముందు చక్రాన్ని ఢీ కొట్టాడు. రిక్షా ఒక ప్రక్కకు పడిపోయింది. ఆయన క్రింద పడిపోయాడు. తుంటి ఎముక విరిగిపోయింది. ఆయనను కాకినాడ లోని శ్రీ రంగరాయ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో చేర్చారు. రెండు నెలలు గడిచాయి ఆయన ఒక మోస్తరుగా కోలుకోవడానికి.
అక్కడ డాక్టర్ పరవస్తు రంగాచార్య గారు ఆర్థోపెడిక్ సర్జన్. భారతీయ తత్వ శాస్త్రంలో కూడా మంచి ప్రవేశం ఉన్నవారు కూడా. దానితో ఆయనకు, మా తాతకూ మంచి స్నేహం కుదిరింది. మా తాతకు నేనే పరిచారకుడిని. ఆయన నాకు బోధించిన విషయాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు నేనూ నా సందేహాలు అడిగేవాడిని. రంగాచార్య గారు ఇది గమనించారు. ఆయనకు ఏదో అభిమానం కలిగింది.
మా తాత తో ఇలా అన్నారు… ” మన వాడి టెన్త్ అయిపోయింది అన్నారు కదా! ఇంటర్లో Bi P C గ్రూప్ లో చేర్చండి. అది పూర్తి కాగానే నా దగ్గరకు పంపేయండి. మెడిసిన్ లో సీట్ ఇస్తాను.” అన్నారు. అప్పట్లో మెడికల్ సీట్స్ లో ప్రొఫెసర్స్ కోటా ఒకటి ఉండేది. ముగ్గురు విద్యార్థులను ప్రొఫెసర్ రికమెండ్ చేయవచ్చు.
ఇంకేముంది? CA చదువు అటకెక్కి మెడిసిన్ వైపు తిరిగిపోయి, Bi P C లో ప్రవేశం. ఇది మొదటి మలుపు. మళ్ళీ ఇంటర్ సగం రాజమహేంద్రవరం, మిగిలిన సగం మా నాన్న మెజిస్ట్రేట్ గా పని చేస్తున్న శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటలో. ఇంటర్ రెండవ ఏడాది మళ్ళీ రాజమహేంద్రవరం.
సరే, ఇంటర్ అయిపోయింది. ఫలితాలు వచ్చే సమయానికి నరసన్నపేట లో ఉన్నాను. ఫలితాలు వచ్చాయి. సెకండ్ క్లాస్. అది విన్న మా నాన్న “సెకండ్ క్లాసా? ఏం? థర్డ్ క్లాస్ లేదా?”… అదీ ఆయనకు నా మీద ఉన్న అభిప్రాయం. చిన్నతనం నుంచీ నా మొదటి సాహిత్య ప్రసంగం వరకూ ఇదే ధోరణి! ఎందుకో మరి?
కొన్ని రోజులకు మా తాత నుంచి ఒక ఉత్తరం వచ్చింది…. ” వి టి కాలేజ్ లో బి కామ్ లో చేరటానికి ఫీజు కట్టేశాను. వచ్చి చేరు”.
దీని వెనుక ఉన్నదిమా నాన్న తల్లి తాయారమ్మ గారు. ఆవిడ ఈ మరిది గారికి “ఉపదేశం” చేశారు. “మరిదిగారూ! మీరు మంచాన పడ్డారు. మీరూ, కనకమ్మ ఇద్దరే. మీరు వాణ్ణి కాకినాడ పంపిస్తే అయిదేళ్ళు అక్కడే ఉండాలి వాడు. కనకమ్మ ఒక్కతీ ఎలా నెట్టుకొస్తుంది? కాస్త ఆలోచించండి. వాడు మీ దగ్గరే ఉంటే మంచిది”. ఇదీ ఆవిడ ఉపదేశం. బాగానే పనిచేసింది. నా బ్రతుకు బి. కామ్. లోకి “కామ్” గా మళ్ళిపోయింది.
CA కోసం చదివిన కాంపిజిట్ మ్యాథ్స్ నుంచి మెడిసిన్ కోసం చదివిన బయాలజీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ పోయి కామర్స్, ఎకనామిక్స్, కమర్షియల్ జాగ్రఫీ లోకి వంకరటింకర నడక.
అప్పటికే సైన్స్ మత్తు తలకెక్కిన నాకు ఈ కామర్స్, ఎకనామిక్స్, కమర్షియల్ జాగ్రఫీలు నచ్చలేదు, ఒక్క ముక్కలోనూ “రుచి” పుట్టలేదు. అంతే! సరిగ్గా పరీక్షల ముందు బి కామ్ కు స్వస్తి పలికేశాను.
“ఇలా నాతో ఆడుకుంటున్నారు” అనుకున్న నాకు భగవంతుని ప్రణాళిక, ఈ వంకర టింకర చదువుల ప్రయాణం ఫలితం ఏమిటి అనేది 11 ఏళ్ల తరువాత కానీ తెలియలేదు.
అది 1974. అప్పటి నుంచి 1980 వరకూ ఆరేళ్ల “విలువైన” కాలం సినిమాలు, సిగరెట్లు, అల్లరి చిల్లర తగువులు. జస్ట్ “ఆవారా బ్రతుకు”!
“ఆవారా బ్రతుకులో పద్య పరిమళం…” రేపు
Leave a comment