” ఆవారా బ్రతుకులో పద్య పరిమళం!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 14

అలా ఆ తిరుగుతున్న కాలంలోనే నా జీవితంలోకి పద్యం మళ్ళీ ప్రవేశించింది.

గతంలో మా చిన్న తాత, శ్రీ సుదర్శన నారసింహ ఉపాసకులు భాష్యం గారి గురించి చెప్పాను కదా! ఆయన కుమారుడు అనంత తులసీ వేంకటాచార్యులు గారు. ఆయనకు పిల్లనిచ్చిన మామగారు శ్రీమాన్ సేనాధిపత్యం హయగ్రీవాచార్యులు గారు.అప్పట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారానికి ఒకసారి ( మంగళవారం అని గుర్తు) రాత్రి “సరస వినోదిని” అనే సమస్యా పూరణ కార్యక్రమం నిర్వహించేది. (ఇప్పుడు ఉందో, లేదో తెలియదు). హయగ్రీవుడు గారు ఆ కార్యక్రమానికి సమస్యలు పూరించి పంపేవారు. కొన్నిసార్లు ఆయన పద్యాలు ఆ కార్యక్రమంలో చదివేవారు. కొన్నిసార్లు “సత్రం బ్యాచ్” లో  పేరు వచ్చేది. కొందరి పద్యాలు చదివి, సమయాభావం వల్లనో, మరెందుకో కొందరి పేర్లు మాత్రం చదివేవారు. అలా పేర్లు చదివే భాగానికి “సత్రం బ్యాచ్” అని పేరు పెట్టుకున్నాం. పద్యం చదవకుండా, కేవలం పేరు మాత్రమే చదివితే అదో గొప్ప “అవమానం”గా భావించేవారు ఆయన.

ఒకసారి ఆ కార్యక్రమంలో ఒక సమస్య ఇచ్చారు. మనం తిన్నగా ఉండే రకం కాదు కదా! “ఈసారి నేను కూడా ఈ సమస్యను పూరించి పంపుతాను!” అన్నాను. ఆయన ఒక నవ్వు నవ్వి ” నువ్వా? రాస్తావా? సరే, రాయ్. నీ పద్యం రేడియోలో చదివితే అయిదు రూపాయలు ఇస్తా!” అని ఆయన సవాలు చేశారు. ఎవరైనా ఒక విషయం నాకు తెలియదు, నేను చేయలేను అని అంటే సహించే లక్షణం అప్పటికీ, ఇప్పటికీ లేదు! ఆయన ఆ మాట అనగానే మనకి చర్రున మండింది. “నా పద్యం రేడియోలో చదవక పోతే యాభై రూపాయలు ఇస్తా!” అని ప్రతి సవాల్ విసిరా. అలాగే ఒక పద్యం పంపాను.

కార్యక్రమం రోజు. రాత్రి అందరం రేడియో చుట్టూ చేరాం. వరుసగా పూరణలు సాగిపోతున్నాయి. మన పేరు లేదు… “సత్రం బ్యాచ్” కూడా అయిపొయింది. మరో మూడు నాలుగు పద్యాలు కూడా అయిపోయాయి. హయగ్రీవుడు గారు ” నా యాభై రెడీ చేసుకో!” అన్నారు. నేనూ అంతే అనుకున్నా… సరిగ్గా అప్పుడు వినిపించింది రేడియోలో… “రాజమండ్రి నుంచి ఫణిహారం వల్లభాచార్యులు గారు పంపిన పూరణ!” అంటూ నేను పంపిన పద్యం చదివారు. రేడియోలో మొదటిసారి నా పేరు వినటం! భలేగా అనిపించింది. ఆ “మత్తు” వేరే లెవెల్! కదా? హయగ్రీవుడు గారు ఏమీ మాట్లాడకుండా అయిదు రూపాయలు నా చేతిలో పెట్టారు. నా “మొదటి సంపాదన!” ఆ పద్యం ఇప్పుడు గుర్తు లేదు కానీ అప్పుడు ఇచ్చిన సమస్య మాత్రం గుర్తు ఉంది. అది ” మునికిన్ నేర్పంగనేల మోహపు సుద్దుల్!”.

రేడియోలో పేరు విన్న “కిక్” బాగా తలకెక్కేసింది. వరుసగా పూరణలు పంపేవాడిని. ప్రతి వారం రేడియోలో నా పేరు వింటున్న కొద్దీ “కిక్” పెరుగుతోంది కానీ తగ్గటం లేదు. మన దగ్గర ఉన్నది టెన్త్ క్లాస్ లో చదువుకున్న ఛందస్సు మాత్రమే. వ్రాస్తున్న కొద్దీ “పద సంపద” తరిగిపోతోంది. అప్పుడు మొదలైంది సీరియస్ గా తెలుగు సాహిత్యం చదవటం. మొట్టమొదట పట్టుకున్నది వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారి వ్యాఖ్యానంతో పెద్దన గారి “మనుచరిత్ర”. ఆ తరువాత వరుసగా తెలుగు కావ్యాలు వ్యాఖ్యనాలతో. సాహిత్య బోధకులు ఎవరూ తెలియదు. నా అంతట నేనే కుస్తీ పెట్టేవాడిని.  రోజూ ఏదో ఒక అంశంతో కనీసం పాతిక పద్యాలు వ్రాయటం ఒక సాధన.

రాజమండ్రిలో ఇంటింటి దిన పత్రిక “సమాచారం” లో ఒక వార్త చూశాను. ఆ రోజు సాయంత్రం “ఇంగ్లీష్ క్లబ్” లో ఏదో ఆంగ్ల సాహిత్య సమీక్షా కార్యక్రమం. అప్పుడు మాకు వి టి జూనియర్ కాలేజ్ లో తెలుగు బోధించిన శ్రీ కాశీభట్ట శేషయ్య శాస్త్రి గారి ఇంటికి వెళ్ళాను. “సర్! రాజమండ్రిలో ఇంగ్లీష్ క్లబ్ ఉంది. తెలుగుకి ఏవీ లేవా?” అని అడిగాను. “లేకేం? జాతీయ సాహిత్య పరిషత్ ఉందిగా? చేరుతావా?” అన్నారు. అంతకన్నా ఏం కావాలి? నాకూ ఏదో మార్గదర్శనం దొరుకుతుంది అనుకుని ఆ సంస్థలో చేరాను. ఎందరో పరిచయం అయ్యారు. కానీ వారిలో చాలామంది సాహిత్య ప్రేమికులే కానీ స్వయంగా వ్రాసేవారు కారు. అయితే ఎన్నో సాహిత్య సమావేశాలు జరిగేవి. పెద్దల ప్రసంగాలు వింటూ నేర్చుకున్నది చాలా. కానీ నాకు పద్య రచనలో మార్గదర్శనం చేసేవారు లేరు ఒక్క శేషయ్య శాస్త్రిగారు తప్ప. ఆయన తీరిక వేళల్లో ఏదో చెప్పేవారు. నాకు చాలేది కాదు!

అలా క్రిందా మీదా పడుతుండగా ఒకరోజు ఉదయం శేషయ్య శాస్త్రి గారు, మరొక లెక్చరర్ కె. వి రామారావు గారు మా ఇంటికి వచ్చారు ఒక టేప్ రికార్డర్ తీసుకుని. “శరభయ్య గారి ఇంటిలో జువ్వాడి గౌతమరావు గారు ఉన్నారు. విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం చదువుతారు. మేము రికార్డు చేసుకోవటానికి వెడుతున్నాం, నువ్వు కూడా వస్తావా? రా, వీలుంటే నీ పద్యాలు కూడా వినిపిద్దుగాని” అని అన్నారు.

“శరభయ్య గారి ఇంటికి” అనగానే వళ్ళంతా వణుకు పుట్టింది. పైగా ఆయన ఎదురుగా పద్యాలు వినిపించటం అంటే “ఆత్మహత్య” చేసుకున్నట్టే! అయినా వీళ్లిద్దరూ ఉన్నారుగా అని ఒక “చచ్చు ధైర్యం” తెచ్చుకుని, పద్యాలు వ్రాసుకున్న కొన్ని కాగితాలు తీసుకుని వాళ్ళ వెంట వెళ్ళాను.

“గురు దర్శనం” రేపు…


One response

  1. prof. T. Patanjali

    సమస్యా పూరణ కార్యక్రమం ఇప్పుడు కూడా ఉందండి. ప్రతి ఆదివారం ఉదయం 07-15 ని.లకు

    Like

Leave a comment