స్వీయ అన్వేషణ – 16
… అంటే ఏమిటి? సాహిత్య విద్యార్థికి ప్రధాన మార్గదర్శి ఇదే. “కావ్యజ్ఞుడు” అంటే కావ్య రహస్యం తెలిసినవాడు, కావ్య అధ్యయన మర్మం తెలిసినవాడు. “శిక్ష” అంటే “పనిష్మెంట్” కాదు… “శిక్షణ”… ట్రైనింగ్. అతడు ఏమి చేస్తాడు? ఒక కావ్యంలోనికి ఎలా ప్రవేశించాలి? కావ్యాత్మను ఎలా పట్టుకోవాలి? శబ్ద, అర్థ, భావ పరిధులను దాటుకుంటూ రస పరిధి లోనికి ఎలా ప్రవేశించాలి? అనే విషయాలు విద్యార్థికి “ఎరుక” చేస్తాడు. దానికి అతడు “రస సిద్ధుడు” అయి ఉండాలి. అలాటి ” రస సిద్ధుడు” మా మాష్టారు శరభయ్య గారు. ఒక ఉదాహరణ …
” పర గత సుఖ దుఃఖాలను తనవిగా అనుభవించటం సత్వ గుణం” అంటుంది అలంకార శాస్త్రం. కావ్య అధ్యయన వేళ ఆ “సహృదయుడు” చెందే పరిణామం ఏమిటి? “ఆవరణ భంగం”. అంటే ఏమిటి? కావ్యాన్ని చదువుతున్నప్పుడు తన చుట్టుప్రక్కల ఏవీ అతని దృష్టికి రావు. ఆ భౌతిక ఆవరణలు అన్నిటినీ ” పాము కుబుసం వదలినట్టు” వదలి వేస్తాడు. కేవలం “కావ్యావరణ” లోనికి ప్రవేశించి లీనమైపోతాడు. అప్పుడు ఆ కావ్యంలోని ప్రతి పాత్రా తానే అయిపోతాడు. ఆ కావ్యంలో నాయకుడు అతనే, నాయిక అతనే, ప్రతి నాయకుడు అతనే, ఇతర పాత్రలలో ప్రతి పాత్రా కూడా అతడే. అప్పుడు ఏ పాత్ర ఏ అనుభవాన్ని అనుభవిస్తోందో అదే అనుభవం ఆ పాఠకుడు అనుభవిస్తాడు.
ఒక రోజు మాష్టారు ఒక సంస్కృత నాటకంపై ప్రసంగిస్తున్నారు. సీతా రామ లక్ష్మణులు గంగ దాటి వనంలో ప్రవేశించారు. “అడవిలో చాలా కష్టాలు ఉంటాయి, రావద్దు” అని రాముడు అంటే సీత “ఎలాటి కష్టమైనా దాటేస్తా” అని ధైర్యంగా అని వెంట వచ్చింది. ముగ్గురూ గంగ దాటారు. తన ధైర్య ప్రదర్శనగా సీత గబగబా పది అడుగులు వేసింది అడవిలోనికి. అక్కడ ఆగి, ” అడవి ఇంకా ఎంత దూరం?” అని అడిగింది బేలగా. ఆ నాటకం గురించి ఎన్ని సభలలో ప్రసంగించినా సీత పలికిన ఈ పలుకులు మా మాష్టారు ఎప్పుడూ పూర్తిగా పలుకలేక పోయేవారు. ఆయన గొంతు గద్గదికం అయిపోయేది. కొన్ని క్షణాల పాటు నోట మాట వచ్చేది కాదు. తరువాత గట్టిగా ఒక నిట్టూర్పు విడచి ప్రసంగం కొనసాగించేవారు. ఆ క్షణంలో ఆయన సీతామాత ప్రక్కనే ఉండి, ఆమె కష్టాన్ని చూస్తూ, తట్టుకోలేక పోయినట్టే ఈ క్షణంలో ఆయన ఉండేవారు. అంటే ఏమిటి? ఆ ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన మన మధ్య లేరు, నాటకంలోని ఆ సన్నివేశానికి ప్రత్యక్ష సాక్షి అయిపోయేవారు. ఈ నాటకం అని మాత్రమే కాదు, ఏ నాటకం, ఏ కావ్యం అయినా ఆయన వాటిలో “తన్మయులు” అయిపోయేవారు. అటువంటి వ్యక్తి ” కావ్యజ్ఞుడు!”. ఆ “కావ్యజ్ఞు”ని శిక్షణ లభించటం కన్నా నా వంటి వాడికి అదృష్టం ఏముంటుంది?
” మాస్టారి బోధన” రేపు…
Leave a comment