” కావ్యాత్మను పట్టుకోవటం అంటే…”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 18

14,15 ఏళ్ల నల్లని, బక్కపలచటి కుర్రవాడు, మోకాళ్ళ వరకు నిక్కరు, పైన ఖద్దరు జుబ్బా, మెడలో లింగకాయ. ఒక కళాశాల ఆవరణలో చెట్టు క్రింద నిలబడి ఉన్నాడు ఒక వ్యక్తి కోసం ఎదురుచూస్తూ. తాను ఎదురు చూస్తున్న వ్యక్తి ఎలా ఉంటాడో ఆ కుర్రవాడికి తెలియదు. ఆ వ్యక్తి పేరు మాత్రమే తెలుసు. ఆ పేరు చెప్పి ఎవరినైనా వాకబు చేయవచ్చు. కానీ, ఆ కుర్రవాడు ఒక నియమం పెట్టుకున్నాడు. తాను ఏ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడో ఆ వ్యక్తిని తానే గుర్తు పట్టాలి ఎవరినీ అడగకుండా, ఏ విధమైన వాకబూ చేయకుండా! ఎలా? ఏమిటి ఆ ధైర్యం? తాను ఆ వ్యక్తి రచనలు చదివాడు… అంతే. అదే ఆధారం. తను ప్రాణం పెట్టి చదివిన రచనల రచయితను తాను గుర్తు పట్టలేడా?

కళాశాలలోకి ఎందరో వస్తున్నారు, వెడుతున్నారు, కాలం గడిచిపోతోంది, నిరీక్షణ కొనసాగుతూనే ఉంది.

ఒక వ్యక్తి అల్లంత దూరాన కనిపించాడు. లోపలికి వస్తున్నాడు. ఆ కుర్రవాడి దృష్టి ఆ వ్యక్తి మీద పడింది. ఒకానొక అంతస్సంగీతంతో కదలుతున్న మహానాగము వలె కనిపించాడు ఆ వ్యక్తి. లోపలికి వెళ్ళాడు, కొద్ది సేపటికి తిరిగి వచ్చి బయటకు వెళ్లిపోయాడు. ఈ కుర్రవాడు ఆయన వెంట పడ్డాడు. ఆయన ఒక ఇంటిలో ప్రవేశించి పడక కుర్చీలో కూర్చున్నాడు. ఈ కుర్రవాడు గబగబా వెళ్ళి ఆయన పాదాలంటి నమస్కరించాడు. కుర్రవాడి అవతారం చెప్పాను కదా? ఆ అవతారం చూసి ఆయన కోపంగా ” దూరంగా నిలబడి అడుక్కోలేవూ?” అని కసరుకున్నాడు. కుర్రవాడి కళ్ల నుండి ధారాపాతంగా అశ్రువులు స్రవిస్తున్నాయి. అది చూసి ఆయనకు జాలి కలిగింది. “ఎవరు నువ్వు? ” అని అడిగాడు. ఆ కుర్రవాడు తన పేరు, తండ్రి పేరు చెప్పుకున్నాడు. ఆ తండ్రి పేరు వినగానే ఆయనకు కూడా కళ్ళ నీళ్లు తిరిగాయి. ” పేరు తెలియకపోతే దేవతలు కూడా అవజ్ఞ పొందుతారు కదా?” అంటూ ఆ కుర్రవాడిని దగ్గరకు తీసుకున్నాడు. ఆనాడు అలా తన దగ్గరకు తీసుకున్న ఆ బాలుడిని ఆయనా జీవితాంతం విడువలేదు, ఈ బాలుడూ ఆయనను విడువలేదు.

ఆ బాలుడి పేరు “మల్లంపల్లి శరభయ్య”!

ఆయన పేరు “కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ”! ఈ సంఘటన అంతా మా మాష్టారు “సహృదయాభిసరణం” అనే వ్యాసంలో వివరించారు కూడా.

ఒక వ్యక్తి రచనలు చదివి, ఎవరినీ అడగకుండా ఆ వ్యక్తిని గుర్తు పట్టాలి అనే ఆలోచన, సంకల్పం! తన అధ్యయనం మీద ఎంత విశ్వాసం! కావ్యం అధ్యయనం చేయటం ఒక కళ. ఆ కావ్యం ఆధారంగా ఆ కవిని గుర్తు పట్టడం? అదే “కావ్యాత్మను పట్టుకోవటం”! కవే కదా కావ్యంలోనికి తన ఆత్మను క్రుమ్మరించేది. అలా “కావ్యాత్మ” ను పట్టుకొన్న ఆ రససిద్ధుడు మా మాష్టారు శరభయ్య గారు!

“రాజమహేంద్రవర సాహిత్య రాజకీయాలు!” రేపు…


One response

  1. prof. T. Patanjali

    సహృదయాభిసరణం వ్యాసం చదవాలనే ఉత్సాహాన్ని కలిగించేటంత గొప్పగా వ్రాసారు. అభినందనలు.

    Like

Leave a comment