స్వీయ అన్వేషణ – 20
రాజమండ్రిలో ఇంగ్లీష్ క్లబ్ ఉంది. ఆంగ్ల సాహిత్య కార్యక్రమాలు నడిచేవి. ఒకసారి ఆ వార్త చూసి శేషయ్య శాస్త్రి గారిని అడిగాను… ” తెలుగు సాహిత్య సంస్థలు లేవా?” అని. అంత లోకజ్ఞాన హీనత నాది. నా కావ్యాలు, నేనూ అంతే. శేషయ్య శాస్త్రి గారు ” లేకేం? జాతీయ సాహిత్య పరిషత్ ఉందిగా? చేరుతానంటే పరిచయం చేస్తాను” అని వారు తరువాతి కార్యక్రమం జరిగేటప్పుడు రమ్మని చెప్పారు. వెళ్ళాను. ఆ పరిషత్ సభ్యులకు పరిచయం చేశారు. నేనూ ఆ సంస్థలో చేరాను.
అక్కడే చిలుకూరి వేంకటరామశాస్త్రి గారు, ఆవంత్స సీతారామాంజనేయులు గారు, కే. వి. రామారావు గారు పరిచయం అయ్యారు. అనంతర కాలంలో ఆ శేషయ్య శాస్త్రి గారు, రామారావు గారే నన్ను మాష్టారు శరభయ్య గారికి పరిచయం చేసినది. ఆ సంఘటన ఇంతకు ముందే చెప్పాను. వేంకటరామ శాస్త్రి గారు నాకు చాలా ఆత్మీయులు అయ్యారు. మేము ఇద్దరమూ అనేక కావ్యాలు కలసి చదివాం. సీతారామాంజనేయులు గారు మరొక విధంగా ప్రభావితం చేశారు. అది తరువాత వివరిస్తాను.
వేంకటరామ శాస్త్రిగారు నాకు చాలా విధాలుగా మార్గదర్శనం చేసేవారు. తానుగా ఏమీ వ్రాయక పోయినా గొప్ప అధ్యయన శీలి. తాను చదివిన గ్రంథాలు, కావ్యాలు నా చేత కూడా చదివించేవారు. వాటిపై ఇద్దరం చర్చించుకునే వాళ్ళం. వాటిలో ఏవైనా సందేహాలు ఉంటే మాష్టారు శరభయ్య గారిని ఆశ్రయించే వాళ్ళం.
క్రమంగా నన్ను రాజమహేంద్రవరం జాతీయ సాహిత్య పరిషత్ శాఖకు కార్యదర్శిని చేశారు. ఎన్నో కార్యక్రమాలు చేశాం. అన్నిటిలో శాస్త్రిగారు నాకు తోడుగా నిలిచారు.
అప్పుడు ఒక మిత్రుడు ” పోయి పోయి అందులో చేరావు ఏమిటి? అది ఆర్ ఎస్ ఎస్ సంస్థ అని తెలియదా?” అని అడిగాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆర్ ఎస్ ఎస్ అంటే నాకు ఏమీ తెలియక పోయినా లోలోపల ఏదో వ్యతిరేకత మాత్రం ఉంది. దాని సిద్ధాంతం ఏమీ పరిచయం లేదు కానీ వారి వేష ధారణ నచ్చేది కాదు. ఆ మిత్రుడు అలా అడిగిన తరువాత నేను నన్ను ఆ సంస్థలో చేర్చిన శేషయ్య శాస్త్రి గారిని అడిగాను. ” ఇది ఆర్ ఎస్ ఎస్ సంస్థా?” అని. ఆయన ఒక ప్రశ్న వేశారు… ” ఎమర్జెన్సీ కాలంలో జాతీయ సాహిత్య పరిషత్ ను నిషేధించారా?” అని. ” లేదు” అన్నాను. “మరింకేమిటి?” అన్నారు నవ్వుతూ. నేను కన్విన్స్ అయిపోయాను. అయితే కాలక్రమంలో జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర నాయకులతో కలసి, వారితో పరిచయం పెరిగి, సాన్నిహిత్యం ఏర్పడ్డాక ఆర్ ఎస్ ఎస్ లో కానీ, జాతీయ సాహిత్య పరిషత్ లో కానీ నాకు “అభ్యంతరకరం” గా ఏమీ కనపడలేదు. అంటే కాదు వేంకట రామశాస్త్రి గారికి సహాయకునిగా రాజమహేంద్రవరం విశ్వ హిందూ పరిషత్ సహాయ కార్యదర్శిగా కూడా పని చేశాను. రాజమహేంద్రవరం లో మాత్రమే కాదు, అనంతర కాలంలో హైదారాబాద్ వచ్చి, ఆంధ్రపత్రిక దిన పత్రికలో, ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో పని చేసిన కాలంలో కూడా జాతీయ సాహిత్య పరిషత్ కార్యక్రమాలలో పాల్గొన్నాను.
“రంగ ప్రవేశం!
నన్నయ నవశతి ఉత్సవాలు జరిగినప్పుడు చిలుకూరి వేంకట రామశాస్త్రి గారు, నేనూ జాతీయ సాహిత్య పరిషత్ కార్యక్రమ ప్రణాళిక అద్భుతంగా రూపొందించాం. నన్నయ అనగానే నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం వంటివే అందరూ చూస్తారు. మేము ఆ దారి నుంచి కొంచెం ప్రక్కకు జరిగి ప్రణాళిక రూపొందించారు. నన్నయ భారతంలో ” ధర్మ తత్వజ్ఞత, లాక్షణికత, నీతిజ్ఞత … ఇలా నన్నయ పద్యం ఆధారంగా ఉపన్యాస పరంపరకు శ్రీకారం చుట్టాం. అంతే కాదు ఉపన్యాసకులు విషయంలో కూడా ఒక నియమం… ఆ పద్యంలో చెప్పిన రంగాలలో కృషి చేసిన వారికి ఆ అంశాలు ఇవ్వకూడదు. ఆ అంశాలను అప్పటివరకూ స్పృశించని వారికి ఆ అంశాలు ఇవ్వాలి. అలా క్రొత్తగా చదివి చెప్పే అవకాశం వారికి కలిగించాలి.
రాజమహేంద్రవరం ఇన్నిస్ పేట లోని లక్ష్మీ నరసమ్మ కాన్వెంట్ లో జరిగిన ఆ సభలలో ఒక సంఘటన జరిగింది. ఒక రోజు సాయంత్రం సభ జరుగుతూ ఉండగా ఆ మరునాటి సాయంత్రం ప్రసంగించ వలసిన వక్త తాను ప్రసంగం చేయటానికి రాలేనని టెలిగ్రాం పంపారు. సభ పూర్తి అయేసరికి రాత్రి 9 గంటలు అయింది. మరునాటి సభకు వక్త లేరు. ఏమి చేయాలో శాస్త్రి గారికి, నాకూ తోచలేదు. సభా నిర్వహణ బాధ్యత మాది. ఆ రాత్రి వెళ్లి ఎవరిని అడుగుతాం? “అయ్యా! రేపు సాయంత్రం ప్రసంగించ వలసిన వక్త రావటం లేదు. మీరు వచ్చి ప్రసంగించాలి!” అని ఆ రాత్రి అడిగితే ఏ పండితుడు అంగీకరిస్తాడు? పైగా ముందే వారిని ఎంపిక చేసుకో లేదనే కినుక కూడా ఉంటుంది కదా?
రాజమండ్రి సీతంపేట లో ఒక గట్టు మీద కూర్చున్నాం. ఏమీ తోచలేదు. మరునాటి అంశం “నన్నయ – ధార్మికత”.
చివరికి రాత్రి 12 గంటల సమయంలో శాస్త్రి గారు ” ఇంక లాభం లేదు. ఎవరూ దొరకరు. ఒకటే దారి” అన్నారు. “చెప్పండి, ఈ గండం గట్టెక్కుతే చాలు” అన్నాను. “ఏం లేదు. రేపటి వక్త దొరికేశాడు ఇప్పుడే” అన్నారు. ఆయనకు ఎవరో తట్టారు అనుకుని “నెత్తిన పాలు పోశారు.. వక్త ఎవరు?” అని అడిగాను. శాస్త్రిగారు సీరియస్ గా చూస్తూ “ఇంకెవరు? నువ్వే!” అన్నారు. నా గుండె గుభేలుమంది. అప్పటివరకు ఏదో నలుగురిలో కూచుని మాట్లాడుకోవడమే కానీ, సభలలో మాట్లాడలేదు. పైగా ఆ సభలలో శ్రోతలలో ముందు వరుసలో సింహ సదృశంగా మా సాహిత్య గురువులు మల్లంపల్లి శరభయ్య గారు కూర్చుని ఉంటారు. కొమ్ములు తిరిగిన పండితులే ఆయన సమక్షంలో మాట్లాడటానికి జంకుతారు. అలాంటప్పుడు ఆయన ఎదుట నా “సభారంగ ప్రవేశ”మా? “కుదరదు” అన్నాను. శాస్త్రి గారు వదలలేదు. చివరకు ధైర్యం చేశాను. కానీ సాహిత్య అంశాలు తప్ప ఈ “ధార్మిక అంశాల”తో అసలు పరిచయం లేదు. ఎలా? శాస్త్రి గారే మార్గం చూపారు. అంత అర్థరాత్రి ఆయన ఇంటికి వెళ్ళి కూర్చున్నాం. మేము అంతకుముందు చాలా రోజులుగా చదువుతున్న “తైత్తిరీయ ఉపనిషత్” తీశాం. దారి దొరికింది. మరునాటి ఉదయం శరభయ్య గారి ఇంటికి వెళ్ళి విషయం చెప్పాము. “కానివ్వండి. ఇప్పటికే ఆలస్యం చేశారు” అన్నారు. అలా నా మొట్టమొదటి ప్రసంగానికి శాస్త్రి గారు కారకులు అయ్యారు.
“ప్రథమ ప్రసంగం!” రేపు…
Leave a comment