” గాయత్రీ పరివార ప్రవేశం”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 23

చిలుకూరి వేంకట రామశాస్త్రి గారు కెనరా బ్యాంక్ ఉద్యోగి. వారికి సహోద్యోగి ఆవంత్స సీతారామాంజనేయులు గారు. వీరు “గాయత్రీ పరివార్” సభ్యులు కూడా.

నన్ను పెంచిన వేంకట వల్లభాచార్యులు గారు పరమపదించిన తరువాత ఆయన భార్య కనకవల్లి గారు నాకు ఉపనయనం చేయించారు. దానితో పాటే శ్రీవైష్ణవ సంప్రదాయ అనుసారంగా “సమాశ్రయణం” కూడా. పిఠాపురం లోని శ్రీ కుంతీ మాధవ స్వామి ఆలయ స్థానాచార్యుల వారు ఆ కార్యక్రమం నిర్వహించారు. మరి నాకు “ఆచార్యులు” ఎవరు? అంటే మా నాన్నగారు సీతారామాచారి గారే! ఎందుకు? మా ముత్తాత వేంకటాచార్యులు గారి కాలం నుంచీ నన్ను పెంచిన వేంకట వల్లభాచార్యులు గారి వరకూ రెండు తరాలు మా కుటుంబం “ఆచార్య స్థానం” లో నిలిచింది. శిష్య సంచార సంప్రదాయం ఉంది. ఆచార్యులు తమను ఆశ్రయించి “సమాశ్రయణం” పొందిన వారి జాబితా జాగ్రత్త పరచేవారు. ఏడాదికి ఒకసారి ఆ శిష్యులు నివసించే గ్రామాలకు లేదా పట్టణాలకు వెళ్లి వారికి శ్రీ వైష్ణవ సిద్ధాంతాన్ని, శ్రీమద్రామాయణ, శ్రీ మహా భాగవతాది గ్రంథాల నుంచి సద్విషయాలు బోధించే వారు. దానికి ” కాలక్షేపం” అని పేరు! మనకు “కాలక్షేపం” అంటే కాలాన్ని సరదాగా గడిపేయటం. కానీ ” కాలాన్ని భగవద్విషయంలో గడపటం నిజమైన కాలక్షేపం” అని భావన. కనుక మా కుటుంబానికి వేరొక “ఆచార్యులు” ఉండరు. అనగా మాది ” స్వయమాచార్య పరంపర”. కనుక నేను “సమాశ్రయణ” సందర్భంలో మా తండ్రిని తప్ప మరొకరిని ఆశ్రయించే ప్రసక్తి లేదు. మా పెద్ద నాన్న, నాన్న ఇద్దరూ లౌకిక ఉద్యోగాలకు తరలి పోవటంతో ఆ “పరంపర” విచ్ఛిన్నం అయిపోయింది.  వేంకట రంగాచార్యులు గారితో కుటుంబంలో “మంత్ర సాధన” కు కూడా తెర పడిపోయింది. ఆ “మంత్ర సాధనా పరంపర” మళ్ళీ నాకు ఎలా కనెక్ట్ అయింది అనేది అనంతర కాల విషయం.

అలా ఉపనయనం, సమాశ్రయణం అయిన తరువాత ప్రతి రోజూ  “త్రికాల సంధ్యావందనం” చేసేవాడిని, “సహస్ర గాయత్రీ జపం” చేసే వాడిని.  సంప్రదాయ పరమైన “శ్రీ మదష్టాక్షరీ మంత్ర జప”మూ చేసేవాడిని. మా ఇంటి గురించి చెప్పాను కదా? ఆ ఇంటిలో ముందున్న కచేరీ చావడి లో , సింహ ద్వారానికి ఎదురుగా కూర్చుని చేసేవాడిని. ఆ జప సందర్భంలో అనేక సార్లు మా తాతగారు వేంకట రంగాచార్యులు గారు సింహద్వారం నుంచి లోపలికి వస్తూ దర్శనమిచ్చేవారు.

సరిగా ఆ కాలంలోనే వేంకట రామ శాస్త్రి గారు, సీతారామాంజనేయులు గారు ఇద్దరూ ఒకసారి శాస్త్రి గారి ఇంటిలో జరుగుతున్న “శ్రీ గాయత్రీ హోమా” నికి పిలిచారు. అక్కడ “శ్రీ గాయత్రీ పరివార” సభ్యులతో పరిచయం ఏర్పడింది. ఈ హోమాలు ప్రతి ఆదివారం ఒక్కొక్క సభ్యుని ఇంటిలో జరిగేవి. అలా నాలుగైదు హోమాలలో పాల్గొన్న తరువాత ఆ హోమాలు మా ఇంటిలో కూడా మొదలు అయ్యాయి. ఆదివారం హోమం జరిగాక, మళ్ళీ ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఆ హోమ ప్రభావం నా మీద అంతగా ఉండేది.

క్రమంగా నా అంతట నేనే శ్రీ గాయత్రీ హోమం చేసుకోవటానికి అలవాటు పడ్డాను. అలా 1985 లో నేను హైదారాబాద్ కు వచ్చే వరకూ ఆవిరామంగా జరిగాయి.

అదే కాలంలో సాహిత్యం, కవిత్వ అభివ్యక్తి మీద ఉన్న విపరీత మోహం కారణంగా నా  దృష్టి ” శ్రీ లలితా త్రిశతి” పై పడింది. మూడు వందల నామాల శ్రీ లలితా స్తోత్రం అది. దానిలోని ప్రతి నామం ఒక్కొక్క “కావ్యం”! “వాక్యం రసాత్మకం కావ్యం” అనే మాటను ఒప్పుకుంటే “శ్రీ లలితా త్రిశతి” మూడు వందల కావ్యాలకు సమానం. ఆ కవితా సౌందర్య మాదకత నన్ను పూర్తిగా ఆవరించింది. రోజూ చదివేవాడిని. శ్రీ దేవీ నవరాత్రులు వచ్చినప్పుడు ఆ నామాలతో కుంకుమతో అర్చన చేసేవాడిని. మా ఇంటిలో శ్రీ లలితా చిత్రం లేదు. నాకు కూడా తెచ్చుకోవాలని అనిపించలేదు. నా దగ్గర ఒక పెద్ద పోస్టర్ సైజ్ లో శ్రీ గాయత్రీ దేవి ఫోటో ఉండేది. దానికే శ్రీ లలితా త్రిశతితో కుంకుమార్చన చేసేవాడిని. ఆ రెండిటికీ మధ్య అభేదాన్నే భావించాను నేను.  శ్రీ లలితా త్రిశతి లోని కవితా సౌందర్యం మాత్రమే తెలుసు నాకు అప్పుడు. అనంతర కాలంలో కానీ అది “శ్రీ పంచదశీ మంత్ర గర్భితం” అయిన స్తోత్రం అనే “ఎరుక” కలుగలేదు!

అలా శ్రీ గాయత్రీ పరివార్ పరిచయంతో మొదలై, శ్రీ లలితా త్రిశతి లోనికి పరిణమించాను. “ఆధ్యాత్మిక / సాధనా ప్రయాణం” లో అది నా తొలి అడుగు.

“ఎరక్కపోయి వెళ్లి…” రేపు..


One response

  1. prof. T. Patanjali

    ” శ్రీ లలితా త్రిశతి లోని కవితా సౌందర్యం మాత్రమే తెలుసు నాకు అప్పుడు. అనంతర కాలంలో కానీ అది “శ్రీ పంచదశీ మంత్ర గర్భితం” అయిన స్తోత్రం అనే “ఎరుక” కలుగలేదు!” అద్భుతమైన జ్ఞాన ప్రయాణం. నమః

    Like

Leave a comment