” రాజమహేంద్రవరానికి వీడ్కోలు”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 27

స్వేచ్ఛగా బ్రతకటం అలవాటు. తెలుగు కావ్య రసోన్మత్తత, మాష్టారు శరభయ్య గారి సాన్నిహిత్య భాగ్యం ,గాయత్రీ హోమ – సాధనా పరిమళ ప్రభావం, శ్రీ లలితా త్రిశతీ పారవశ్యం, శ్రీ శంకర విద్యా పీఠం నిర్వహణ బాధ్యత… చాలు! ఇంకేం కావాలి? ఒకడి దగ్గర ఉద్యోగం చేయటం, వాడి ముందు చేతులు కట్టుకుని చెప్పిన పనులు చేయటం…మన ఒంటికి సరిపడని అంశాలు! కనుక ఉద్యోగం అనే ప్రసక్తే లేదు!

… అనుకుంటూ స్వేచ్ఛగా బ్రతుకున్న కాలంలో మాష్టారు శరభయ్య గారు తెర వెనుక చాలా “కథ” నడిపారు. నేను మా మేనమామ కూతురు పెళ్లికి వెళ్ళాను. మాష్టారి దగ్గర నుండి టెలిగ్రాం వచ్చింది… ” వెంటనే బయలుదేరి రండి” అని. ఏమి కొంప మునిగిందో అని కంగారుగా బస్ ఎక్కి బయలుదేరాను. మాష్టారి ఇంటికి వెళ్లి కలిశాను. ” మీరు వెంటనే నాళం వారి సత్రానికి వెళ్ళండి. అక్కడ ఒక పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్ళికి హైదరాబాదు నుంచి ఆంధ్ర పత్రిక ఎడిటర్ రాజగోపాల రావు గారు వచ్చారు. మిమ్మల్ని కలవాలి అన్నారు. మళ్ళీ రేపు తెల్లవారు ఝామున ఆయన వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు. వెంటనే వెళ్ళండి” అన్నారు మాష్టారు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఒక డైలీ ఎడిటర్ నన్ను ఎందుకు కలవాలి అనుకుంటున్నారు? అదే అడిగాను. ” ఏమో? వెడితే తెలుస్తుంది కదా? తొందరగా వెళ్ళండి” అన్నారు మాష్టారు. తప్పేది ఏముంది? ఆయన ఆదేశం! వెళ్ళాను.

రాజగోపాల రావు గారిని కలిశాను. ఆయన నా గురించి వివరాలు అడిగారు. అంతా పిచ్చాపాటీగా సాగింది. నాకు లోపల ఏదో తేడా కొడుతోంది. అయినా ఓపికగా ఆయన అడిగినవి అన్నీ చెప్పాను. చివరలో ఆయన ” ఆంధ్ర పత్రిక డైలీ చదువుతూ ఉంటారా?” అని అడిగారు. నాకు అక్కడితో ఆపేయాలనిపించింది. ” లేదు సర్! నేను తెలుగు పేపర్లు చదవను” అన్నాను. ఆయన ప్రశాంతంగా ” సరేలెండి! ఏదో ఒకటి… న్యూస్ పేపర్లు చదువుతున్నారు కదా? మళ్ళీ కలుద్దాం!” అంటూ లేచారు. నేనూ ఆయనకు నమస్కారం చేసి వచ్చేశాను. మరునాడు మాస్టారికి జరిగినది అంతా చెప్పాను. ఆయన ఏమీ మాట్లాడలేదు. ” సరే లెండి! మళ్ళీ కలుద్దాం అన్నారు కదా!” అని ఊరుకున్నారు.

రెండు మూడు నెలలు గడిచాయి. ఒక రోజు సాయంత్రం మాష్టారు చేతిలో ఒక కవరుతో వచ్చారు. కొంచెం నీరసంగా కనిపించారు. కొద్దిగా జ్వరం కూడా ఉన్నట్టుంది.

” ఆచార్యులు గారూ! చిన్న పని చేసి పెట్టాలి మీరు. ఈ కవర్ అర్జంట్ గా ఆంధ్ర పత్రిక యజమాని (శివలెంక) రాధాకృష్ణ గారికి విజయవాడలో అందించాలి. నేనే వెడదాం అనుకున్నా. కానీ ఒంట్లో బాలేదు. రేపు రాత్రి ఆయన హైదారాబాద్ వెళ్ళిపోతారు. ఆ లోగా ఇది ఆయనకు అందాలి” అని నా చేతిలో పెట్టారు కవర్.

నేను మరునాడు ఉదయమే బయలుదేరి విజయవాడ వెళ్లి రాధాకృష్ణ గారిని కలిసి ఆ కవర్ ఆయనకు ఇచ్చాను. ఆయన ఆ కవర్ తెరిచి అందులోని ఉత్తరం చదివి ” రాజమండ్రిలో ఆంధ్రపత్రిక రిపోర్టర్ జాబే కదా? రేపు జాయిన్ అయిపొండి” అంటూ మాష్టారు వ్రాసిన ఉత్తరం నాకు అందించారు. అది చదివే సరికి నా మతి పోయింది. అందులో…

” ఈయనే నేను మీకు చెప్పిన ఫణిహారం వల్లభాచార్యులు. మీకు పనికి వచ్చే వ్యక్తి – శరభయ్య” అని ఉంది. అంతే! ఇంకేమీ లేదు! అప్పుడు అర్థం అయింది మాస్టారి”కుట్ర”!.

తప్పించుకోవాలి… ఉద్యోగాలు మన ఒంటికి పడవు. వెంటనే రాజగోపాల రావు గారు గుర్తుకు వచ్చారు. వెంటనే ” కాదు సర్! రాజమండ్రి లో రిపోర్టర్ కాదు సర్! హైదారాబాద్ లో సబ్ ఎడిటర్ పోస్ట్!” అన్నాను. మన ధైర్యం ఒకటే… మనం బి. కామ్ మొదటి ఏడాదిలోనే చదువుకి మంగళం పాడేశాం కదా? కనీసం డిగ్రీ కూడా పాస్ కాని వాడికి సబ్ ఎడిటర్ ఉద్యోగం ఎవడు ఇస్తాడు!? అదే మన ధీమా!

ఆయన ఒకసారి తలెత్తి చూసి ” హైదారాబాదా? సబ్ ఎడిటరా?” అన్నారు. మన పాచిక పారింది అనుకున్నా. మర్యాదగా ” గెట్ ఔట్”  అంటార్లే అనుకుని సిద్ధంగా ఉన్నా. ఆయన ఒక్క క్షణం ఆగి…

” ఓకే! నేను రాత్రికి హైదరాబాద్ వెడుతున్నా. అక్కడ ఎడిటర్ గారితో మాట్లాడి చెబుతా” అన్నారు. నేను వచ్చేశాను. ఆ హైదారాబాద్ ఎడిటర్ ఎలాగూ ఒప్పుకోడు. డిగ్రీ కూడా పూర్తి చేయని వాడికి ఈయనా ఎలాగూ ఆ ఉద్యోగమివ్వరు అనుకుంటూ రాజమండ్రి వచ్చేశాను రాత్రికి.

మరునాడు ఉదయమే 7 గంటలకల్లా మాష్టారు మా ఇంటి దగ్గర ప్రత్యక్షం ఆయారు.

” ఉత్తరం ఇచ్చారా?” మొదటి ప్రశ్న.

” ఇచ్చాను” నా జవాబు.

” ఏమన్నారు?” రెండవ ప్రశ్న.

” హైదారాబాద్ వెడుతున్నారుట. మాట్లాడి చెబుతాను అన్నారు” నా జవాబు.

” సరే! ఇప్పుడే లేచారు కదా! సాయంత్రం ఒకసారి రండి” అంటూ వెళ్ళిపోయారు.

సాయంత్రం వెళ్ళాను. జరిగినది అంతా చెప్పాను. ఆయన నవ్వి ” నేను ఆయనకు చెప్పినది కూడా హైదారాబాద్ పోస్ట్ గురించే!” అన్నారు. నాకు ఏమి మాట్లాడాలో తోచలేదు.

” మాష్టారూ! మీరు మరోలా అనుకోకండి. నాకు ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. ఇప్పుడు బాగానే ఉన్నా కదా? ఒకరి దగ్గర ఉద్యోగం చేయటం  ఎందుకు?” అన్నాను కొంచెం భయం భయంగానే.

మాష్టారు అనునయంగా అన్నారు… ” ఆచార్యులు గారూ! నేను అన్నీ ఆలోచించే రాధాకృష్ణ గారితో మాట్లాడాను. మీకు సరైన చోటు హైదరాబాదే. ఇక్కడే ఉంటే ఎక్కడి గొంగళి అక్కడే ఉన్నట్టు. వృద్ధిలోకి రావాలి మీరు. మీ సాహిత్య ప్రయాణం సరైన దారిలో నడవాలి. మీకంటూ ఒక గుర్తింపు రావాలి. దానికి రాధాకృష్ణ గారి లాంటి వ్యక్తి దగ్గర ఉండాలి మీరు. అందుకే అన్నీ ఆలోచించే ఇలా చెబుతున్నాను. నా మాట కాదనకండి”.

ఏం మాట్లాడుతాను? మాష్టారు అంత అనునయంగా చెబుతూ ఉంటే మారు మాట్లాడలేక పోయాను. ఇంటికి వచ్చేశాను. నన్ను పెంచిన మా చిన మామ్మ కనకమ్మ గారికి చెప్పాను. ఆవిడ ఒప్పుకోలేదు. ” నీకు ఉద్యోగాలు అవసరమా? అద్దెలు వస్తున్నాయి, నా తరువాత ఈ ఆస్తి నీదే. ఇంకేం కావాలి?” అంటూ వాదించింది. ” ఆ ఉద్యోగం వచ్చినప్పటి మాట కదా!” అంటూ ఆవిడను సముదాయించాను.

వారం రోజుల తరువాత మా వెనుక వీధిలో ఉన్న ఒక సాయంకాల దిన పత్రిక ఆఫీస్ నుంచి ఒకతను వచ్చి ” సర్! మీకు హైదారాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. మళ్ళీ అరగంటలో చేస్తాను అన్నారు. రండి” అని చెప్పాడు. వెళ్ళాను.

ఫోన్ వచ్చింది. అవతల రాజ గోపాలరావు గారు. ” హైదారాబాద్ రండి వీలైనంత త్వరగా” అన్నారు.

” ఎందుకు సర్? ఏమిటంత అర్జెన్సీ?” అని అడిగాను.

” రండి. వచ్చాక మాట్లాడుదాం” అని ఫోన్ కట్ చేశారు.

అటు నుంచి అటే మాష్టారి దగ్గరకు వెళ్ళి చెప్పాను. ” మరింకేం? వెళ్ళిరండి!” అన్నారు.

” మాష్టారూ…” అని ఏదో చెప్పబోతుంటే మధ్యలో ఆపేసి…

” మళ్ళీ మొదటికి రాకండి. బయలుదేరండి” అన్నారు.

” సరే” అని వచ్చేశాను.

అలా 1985 మే 8వ తేదీ హైదారాబాద్ చేరాను. రాజ గోపాలరావు గారిని కలిశాను. ఆయన పి టీ ఐ లో ఇంగ్లీషులో వచ్చిన ఒక వార్తను ఇచ్చి తెలుగు చేయమన్నారు. చేశాను. అది చూశారు. అప్పుడు ఆయన అన్న ఒక మాట ఇప్పటికీ గుర్తు ఉంది నాకు.

” చూడండి… ఒకరు ఉద్యోగం ఇప్పించగలరు కానీ, నిలబెట్టలేరు. ఎవరికి వారే నిలబెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోండి”. ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నాను.

అలా ముందు చిలుకూరి వేంకటరామ శాస్త్రి గారు, తరువాత నేనూ రాజమహేంద్రవరాన్ని, మా పాఠశాలనూ వదలి హైదారాబాద్ కు చేరుకున్నాం. తరువాత కొన్ని నెలలకు…

” అలా జరిగింది!” రేపు…


Leave a comment