స్వీయ అన్వేషణ – 28
ముందు చిలుకూరి వేంకట రామశాస్త్రి గారూ, వారి వెనుక కొన్ని నెలలకు నేనూ రాజమహేంద్రవరాన్నీ, మా పాఠశాలను వదలి హైదారాబాద్ కు వచ్చేశాం.
నేను ” ఆంధ్ర పత్రిక దిన పత్రిక” లో ” సబ్ ఎడిటర్ ట్రైనీ” గా చేరాను. ఆంధ్రపత్రిక అనుభవాలు చెప్పే ముందు మా పాఠశాల గురించి చెప్పాలి. నేను ఆంధ్ర పత్రికలో చేరిన కొన్ని నెలలకు శేషయ్య శాస్త్రి గారి దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. దాని సారాంశం ఇదీ… “మన స్కూల్ కి డి ఇ ఓ నుంచి లెటర్ వచ్చింది. మన స్కూల్ కు విద్యాశాఖ గుర్తింపు ఇప్పటి వరకూ లేదు. విద్యా సంవత్సరం మొదలయ్యే లోపు ఆ గుర్తింపు తెచ్చుకోవాలి. నువ్వో, శాస్త్రి గారో ఒకసారి రావాలి”.
శాస్త్రి గారికి కుదరలేదు. ఇంక మిగిలింది నేను. శలవు పెట్టేసి వెళ్ళాను. కాకినాడలో డి ఇ ఓ కార్యాలయానికి వెళ్ళాలి, దరఖాస్తు తీసుకోవాలి, దానిని పూర్తి చేసి అందించాలి. ఇవేవీ నాకు తెలియని విషయాలు. రాజమండ్రి నుంచి కాకినాడ జస్ట్ ఒక గంట దూరం. నేను శేషయ్య శాస్త్రి గారిని, రామారావు గారిని అడిగాను… “సర్! ఎవరో ఒకరు నాతో రండి. ఆ వ్యవహారాలు ఎలా చేయాలో చెప్పండి. ఆ పని పూర్తి అయాకే నేను హైదారాబాద్ వెడతాను” అని. ఇద్దరూ తమకు కుదరదు అన్నారు. జస్ట్ గంట ప్రయాణం, తిరుగు ప్రయాణం గంట, అక్కడ పని ఎక్కువలో ఎక్కువ గంట, గంటన్నర, మొత్తం మూడున్నర, నాలుగు గంటలు. వారికి కుదరలేదు. ఒకరికి స్పాట్ వాల్యూయేషన్, ఒకరికి అర్జంట్ పనులు. మరి పాఠశాల?
కాకినాడ ఒక్కడినే వెళ్ళాను. కావలసిన పేపర్లు అన్నీ తెచ్చాను. వాటిని పూర్తి చేసి రిజిస్టర్డ్ పోస్ట్ లో డి ఇ ఓ కార్యాలయానికి పంపితే చాలు. నేను మళ్ళీ వారిద్దరితో మాట్లాడి “కాస్త ఆ పని చేయండి, మీరిద్దరూ లెక్చరర్లు. ఈ పేపర్స్ ఎలా ఫిల్ చేయాలో మీకు తెలుస్తుంది” అని అడిగాను. వారు “సరే” అన్నారు. వారిద్దరి మీదా భరోసాతో నేను హైదారాబాద్ తిరిగి వచ్చేశాను.
కొన్నాళ్ళకు తెలిసింది… ఆ పాఠశాల మూత పడి పోయింది. అక్కడితో వేంకట రామశాస్త్రి గారూ, నేనూ వేసుకున్న దీర్ఘ కాలిక ప్రణాళిక, మేము కన్న కల చెదరి పోయాయి.
ఎందుకు? ఎందుకు మూత పడింది? చెప్పిన కారణం ఒకటే… “శాస్త్రి గారూ, నువ్వూ ఇద్దరూ లేరు. మేము అందరం ఏదో ఉద్యోగాలలో ఉన్నవాళ్లం. ఒక స్కూల్ నిర్వహించే తీరిక,ఓపిక రెండూ మాకు లేవు. పైగా మీ ప్రణాళిక వెనుక ‘ మతప్రాతిదిక’ ఉంది. అది అందరికీ తెలిసిన రహస్యమే. దానివల్ల మా ఉద్యోగాలకు ఇబ్బంది రావచ్చు. కనుక ఈ స్కూల్ నిర్వహించటం మాకు సాధ్యం కాదు. అందుకని ఇక్కడ ఉన్న అందరం కలసి చర్చించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. మీకు ఈ విషయం చెప్పినా మీరు మీమీ ఉద్యోగాలు వదలి వేసుకుని ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ నడిపేదీ లేదు”
నిజమే!మేము ఉద్యోగాలు వదలి వెళ్ళలేము. కొన్ని సంస్థలు ఇలాగే మూత పడిపోతాయి. ఎవరో ఒకరిద్దరి కల! కొంతమంది తోడు నిలిచినా అది ఆ కల కన్న ఆ ఇద్దరూ ఉన్నంత కాలమే! వారు దూరం కాగానే అప్పటి వరకూ ప్రక్కనే ఉన్న వారు కూడా తప్పుకుంటారు! ఒక సంస్థ ఎదుగుతూ ఉంటే దానిలో ” మేమూ ఉన్నాం” అని చెప్పుకోవటానికి మాత్రమే ఉంటారు వాళ్ళు. నిర్వహణ బాధ్యత తీసుకోవటానికి మాత్రం ముందుకు రారు!
అలా “శ్రీ శంకర విద్యా పీఠం”, దాని నిర్వహణలో ఉన్న ” శ్రీ భారత భారతీ విద్యాలయం” రెండూ కను మరుగై పోయాయి. ఇది మాత్రం శాస్త్రి గారూ, నేనూ మరచి పోలేని విషాదం! ఆ తరువాత ఎన్ని సార్లు రాజమండ్రి వెళ్ళినా ఈ మూసివేతకు కారణం అయిన వారిని ఎవరినీ నేను కలవలేదు. ” మానిపోని గాయాన్ని మళ్ళీ మళ్ళీ కెలుక్కోవడం” ఎందుకు?
” మరో కల నెరవేరింది!” రేపు…
Leave a comment