స్వీయ అన్వేషణ – 29
“ఆంధ్ర పత్రిక” హైదారాబాద్ కార్యాలయం. 1985 మే 8న ఆ భవనంలో అడుగు పెట్టాను. దానికి మూల కారణం మా మాష్టారు శరభయ్య గారు. కానీ…బహుశః దీనికి బీజం పదకొండు ఏళ్లకు ముందే పడిందేమో!
1974 లో చదువుకు మంగళం పాడేశాక ఒక ఉద్యోగం కొన్ని నెలల పాటు నిడదవోలులో వెలగ బెట్టాను. అది టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగం. ఆ ఉద్యోగానికి పోటీ పరీక్షలు వ్రాసి, పాస్ అయి, హైదారాబాద్ లో మూడు నెలల శిక్షణకు వచ్చాను. మా మేనమామ విజయకుమార్ గదిలోనే ఆవాసం. తిరుమలగిరిలో ఒక గుట్ట మీద ట్రైనింగ్ సెంటర్. రోజూ మలక్ పేట నుంచి లోకల్ ట్రెయిన్ లో బయలుదేరి తిరుమలగిరి స్టేషన్ లో దిగి అక్కడి నుంచి నడక.
ఆ మూడు నెలల శిక్షణలో ఎందరో మిత్రులు, నా కన్నా విద్యాధికులు. ఒకరు రామకృష్ణ – ఎం ఎస్ సి న్యూక్లియర్ ఫిజిక్స్, మరొకరు భానుమూర్తి – ఎం ఎ అప్లైడ్ మ్యాథ్స్, మరొకరు ఏ టు జడ్ ( ఎ.ఎస్. వి. వి. డి. ఎం.ఎర్. ఎస్. ) నాగేశ్వర రావు – టెక్నికల్ ఇంజనీరింగ్…నేను, ఒక మాజీ సైనికుడు రాజ్ కుమార్ తప్ప అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్లు. ” ఈ ఉద్యోగం ఏమిటి మీకు?” అని అడిగితే ” ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయటానికి చలాన్లు కట్టాలి. ఆ డబ్బులు అమ్మనో, నాన్ననో ఎంతకాలం అడుగుతాం? ఈ జీతం వాటికి వాడుకోవచ్చు కదా?” అని సమాధానం. జీతం నెలకు అక్షరాలా మూడు వందల యాభై ఒక్క రూపాయల డెబ్భై అయిదు పైసలు! ( నా మొదటి నెల జీతంతో మొట్ట మొదట నేను నిడదవోలు రైల్వే స్టేషన్ లో హిగిన్బోతమ్స్ స్టాల్ లో వడ్డెర చండీ దాస్ నవల ” హిమ జ్వాల” కొనుక్కున్నాను. ఆ నవల ఆంధ్ర జ్యోతిలో సీరియల్ గా వస్తున్నప్పుడే వదలకుండా చదివేవాడిని. ఆ వచనం నన్ను పద పదానా కట్టి పడేసింది)
ఆ మూడు నెలలలో బాగా సన్నిహితులు అయిన వారు గణపతి అని పిలుచుకునే హేరంబ దీక్షితులు, రమణ మూర్తి, రాజ్ కుమార్, గణేశ్ బాబు, భానుమూర్తి, రామకృష్ణ. ( ఇప్పుడు గణేశ్ బాబు ఫేస్ బుక్ లో, కొద్ది కాలం క్రితం వరకూ రమణ మూర్తి మాత్రమే టచ్ లో ఉన్నారు. తరువాత రమణమూర్తి తన ఆధ్యాత్మిక ఏకాంత గుహ లోకి వెళ్లి పోయాడు.). రమణ మూర్తి, గణపతి, నేనూ లోకల్ ట్రైన్ లో వెళ్లే వాళ్ళం. గణపతి “ఘోర నిష్ఠాపరుడు!” ఒకసారి నేను రంగనాయకమ్మ ” రామాయణ విష వృక్షం” చదువుతూ కూర్చున్నాను కిటికీ ప్రక్కనే. గణపతి కాచీగూడా స్టేషన్ లో ఎక్కాడు. ఎదురుగా కూర్చున్నాడు. రమణ మూర్తి విద్యానగర్ లో ఎక్కాడు. నా ప్రక్కన కూర్చున్నాడు. కాసేపు అయాక గణపతి ” ఏరా! ఏం చదువుతున్నావ్?” అని అడిగాడు. ” రామాయణ విష వృక్షం” అన్నాను. ” ఏదీ ఓసారి ఇవ్వవా?” అని అడిగాడు. ఇచ్చాను. దానిని వ్రేళ్ళతో పట్టుకున్నాడు. తెరచి కూడా చూడలేదు. అలాగే రైలు కిటికీ లోనుంచి బయటకు విసిరేశాడు! నేను ఆశ్చర్యపోయాను. “అదేమిటిరా అలా పడేశావ్?” అన్నాను కోపంగా. వాడు ఇంకా కోపంగా ” ఇంకోసారి నీ చేతుల్లో ఇలాటి చెత్త పుస్తకాలు చూసానంటే ఆ పుస్తకాన్ని కాదు… నిన్ను విసిరేస్తాను కిటికీ లో నుంచి!” అని మొహం త్రిప్పుకుని కిటికీ లో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు. రమణమూర్తి చిరునవ్వుతో ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆ రోజు అంతా నాతో మాట్లాడలేదు గణపతి! సాయంత్రం కాచిగూడా స్టేషన్ లో దిగుతూ ” రూమ్ కి వెళ్ళాక తలస్నానం చెయ్! ఆ పుస్తకం చదివిన పాపం పోతుంది. ఖర్మ! నేనూ ముట్టుకున్నాను దాన్ని. నేనూ తలస్నానం చేయాలి, జంధ్యం కూడా మార్చుకోవాలి” అంటూ విసవిసా దిగిపోయాడు. నేను ఆశ్చర్య పోయాను. ” ఇదేమిటి వీడు ఇంత కరుడు గట్టి పోయాడు!” అనుకున్నాను. ఉత్తముల కోపం క్షణికం కదా! మరునాటి నుంచీ అంతా మామూలే!
ఆ మూడు నెలలలో వీలు అయినప్పుడల్లా నడిచేవాడిని. ” నడవటం” అంటే…
ఊరు తెలియాలి అంటే నడవాలి! ఆటోలోనో, బస్ లోనో తిరిగితే ఏం తెలుస్తుంది? మా మేనమామ రూమ్ ఛాదర్ ఘాట్ దగ్గర ఉన్న ఆజం పురా లో. అక్కడ నుండి ఛాదర్ ఘాట్ వంతెన దాటి నడుస్తూ ఆంధ్రా బ్యాంక్ వరకూ వెళ్లే వాడిని. ఆ ఆంధ్రా బ్యాంక్ గుర్తు పెట్టుకుని ఒక రోజు నేరుగా, ఒక రోజు కుడి వైపు, మరొక రోజు ఎడమ వైపు నడిచేవాడిని. నడక నాకు అలవాటు, ఇష్టం కూడా. అసలు రాజమండ్రి లో ఉన్నప్పుడు మా చిన్నాన్న అనంత తులసీ వేంకటాచార్యులు గారి బావ మరది సేనాధిపత్యం రంగాచార్యులకు, నాకూ ఒక కోరిక ఉండేది. మేమిద్దరం రాజమండ్రి నుంచి నడుచుకుంటూ కాశీ వెళ్ళాలి అని! దాని కోసం నడక ” ప్రాక్టీస్” చేసేవాళ్ళం. మా నాన్న అప్పట్లో తణుకు లో పని చేసేవాడు. మేమిద్దరం మా ప్రాక్టీస్ లో భాగంగా రాజమండ్రి నుంచి తణుకు నడుచుకుంటూ వెళ్లే వాళ్ళం. త్రోవ అంతా తెలుగు పద్యాలు వరదలా ప్రవహించేవి. మొదటిసారి నడుస్తున్నప్పుడు ఇద్దరి జేబులలో డబ్బులు ఉన్నాయ్. పంగిడి జంక్షన్ దగ్గర ఆగి కూర్చుని టీ త్రాగాం. అంతే! కూర్చున్న వాళ్ళం లేవలేక పోయాం. మోకాళ్లు పట్టేశాయి. ఇంక నడక అసాధ్యం అని తేలి పోయింది. ఆ దారిలో వస్తున్న లారీ ఎక్కేసి తణుకు వెళ్ళిపోయాం! అలా మా మొదటి ” పాదయాత్ర” ఫెయిల్ అయిపోయింది. ఆ తరువాత నుంచీ టీ డబ్బులు మాత్రమే ఉంచుకుని నడక మొదలు పెట్టేవాళ్ళం. నిలబడే టీ త్రాగి మళ్ళీ నడిచేవాళ్ళం. అలా నడక అంటే ఇష్టం.
అలా ఆంధ్రా బ్యాంక్ నుంచి ముందుకు నేరుగా నడచి వెడుతూ వుంటే బషీర్ బాగ్ లో ” ఆంధ్ర పత్రిక” కార్యాలయం కనపడింది. రోడ్డు ప్రక్కనే కొంత ఎత్తులో ఆ “ప్యాలెస్”! ఎంత బాగుంది? ఎంత ” రాయల్” గా ఉంది? ఆ ” ప్యాలెస్” నన్ను సమ్మోహితుడిని చేసింది బయట నుంచే! ఎంతటి “మోహం” అంటే ” ఉద్యోగం అంటూ చేస్తే ఇలాటి ప్యాలెస్ లో చేయాలి” అనేంత మోహం!
అది 1974. ఇది 1985. అంటే ఆ “ప్యాలెస్” మీద పదకొండు ఏళ్ల సుదీర్ఘ విరహ – మోహం! ఇప్పుడు తీరింది! ఒకప్పుడు కల గన్న ఆ ప్యాలెస్ లోకి అడుగు పెట్టాను! రాజమండ్రిలో పాఠశాల కల చెదిరి పోయినా, ఈ కల నెరవేరింది!
” ఆంధ్ర పత్రికలో…” రేపు
Leave a comment