స్వీయ అన్వేషణ – 30
ఆంధ్ర పత్రిక అంటే కేవలం ఒక మామూలు దిన పత్రిక కానే కాదు. ఆంధ్రుల జీవితంలో ( అప్పటికి ఆంధ్ర, తెలంగాణ విడి విడిగా లేవు అని గమనించాలి) ఒక విడదీయరాని భాగం.
కాశీనాథుని నాగేశ్వరరావు గారు బొంబాయి లో సచిత్ర వార పత్రికగా ప్రారంభించగా, దిన పత్రికగా మారింది. బొంబాయి నుంచి మద్రాసు, అక్కడ నుంచి హైదారాబాద్ కు తరలి వచ్చింది. కాశీనాథుని వారు కేవలం ఈ పత్రికా నిర్వహణ మాత్రమే కాదు… రాజకీయాల్లోనూ చురుకైన పాత్ర పోషించారు. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయి, కర్నూలు రాజధానిగా క్రొత్త రాష్ట్రం ఏర్పడింది. హైకోర్టు గుంటూరులో కొలువు తీరింది. కొన్నాళ్ళ తరువాత తెలంగాణా ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలో కలవాలనే అభిప్రాయం ఏర్పడింది. రెండు ప్రాంతాల నాయకులు మద్రాసులో కాశీనాథుని వారి ” శ్రీబాగ్” నివాసంలోనే సమావేశం అయి ఒక ఒప్పందానికి వచ్చారు. అదే “శ్రీబాగ్ ఒడంబడిక”. అది ఎంతవరకూ అమలు అయింది అనేది వేరే విషయం. రెండు తెలుగు ప్రాంతాల ఏకీకరణకు కాశీనాథుని వారి నివాసం ” శ్రీబాగ్” వేదిక అయింది అన్నదే ప్రస్తుతాంశం.
అలాటి ఆంధ్ర పత్రిక తరువాత కాశీనాథుని వారి అల్లుడు శివలెంక శంభూ ప్రసాద్ గారు, ఆ తరువాత వారి కుమారుడు శివలెంక రాధాకృష్ణ గారి నిర్వహణలో సాగింది. ఆ సమయంలో నేను ఆంధ్ర పత్రికలో చేరాను. సరిగా ఆంధ్ర పత్రిక ప్రారంభం అయి 75 సంవత్సరాలు పూర్తి అయిన కొన్నాళ్ళకు నేను చేరాను.
ఆంధ్ర పత్రిక హైదారాబాద్ శాఖ రెసిడెంట్ ఎడిటర్ రాజగోపాలరావు గారు. ఇక సిబ్బంది విషయానికి వస్తే ఒక్కొక్కరూ ఒక్కొక్క దిగ్గజం. రామ్ ప్రసాద్ గారు, కృష్ణమోహన్ గారు, ప్రసాద్ గారు, రాజేశ్వరరావు గారు, సంతాన గోపాలరావు గారు, కె.ఎల్. రెడ్డి గారు, పాపయ్య శాస్త్రిగారు, విద్యారణ్య, వేణుగోపాల్, నిడదవోలు సుందరేశ్వర రావు గారూ… ఇలా ఒక్కొక్కరూ ఒక్కొక ప్రతిభ ఉన్నవారు. మరి కొందరు పెద్దలు ఉన్నారు కానీ… వారిలో నా మటుకు నాకు ఏ ప్రత్యేకతా కనపడ లేదు. యజమాని రాధాకృష్ణ గారు అప్పుడప్పుడూ వచ్చి వెడుతూ ఉండేవారు.
నేను చేరాక నన్ను సంతాన గోపాలరావు గారికి అప్పగించారు… ” ట్రైనీ సబ్ ఎడిటర్” ను కదా! ఏడాది ” ప్రొబేషన్ పీరియడ్”. జీతం 720 రూపాయలు. నేను చేసిన అనువాదాలను ఆయన సరి చూసేవారు. పరమ సౌమ్యుడు. ఏదైనా తప్పు వచ్చినా మెత్తగా చెప్పేవారు.
అందరిలోకీ నన్ను బాగా ఆకర్షించిన వారు ఇద్దరు. ఒకరు రామ్ ప్రసాద్ గారు, రెండవ వారు ములుగు రాజేశ్వర రావు గారు ( ఈ మాట ఎప్పుడూ ఆయనకు చెప్పకపోయినా ఇప్పుడు చదువుతారు లెండి!).
మేము కూర్చునే హాలుకు బయటకు వెళ్ళటానికి ఒక గుమ్మం ఉంది. దాని ప్రక్కనే రామ్ ప్రసాద్ గారి ” సింహాసనం!” కుర్చీలో ముందుకు జరిగి కూర్చుని, రెండు కాళ్ళు డెస్క్ మీదకు చాచి, ( ఆ డెస్క్ అరలో ఒక చిన్న ‘ పానీయపు సీసా!’)నోటితో చుట్ట పొగ ఘుప్పు ఘుప్పుమని వదులుతూ పి టి ఐ లో వచ్చే ఇంగ్లీషు వార్తల కట్ట పరిశీలిస్తూ, వాటిలో మూడు వంతులు చెత్త బుట్టలో దఖలు పరుస్తూ, ఎంపిక చేసుకున్న వాటిని అందరికీ పంచుతూ, కొన్ని మాత్రం తనే అట్టే పెట్టుకుని తెలుగు చేస్తూ, కిరీటం లేని చక్రవర్తిలా ఉండేవారు. రెసిడెంట్ ఎడిటర్ రాజగోపాలరావు గారు వచ్చినా ఆ కాళ్ళు డెస్క్ మీద నుంచి క్రిందికి దిగేవీ కావు, ఆ చుట్ట పొగ ఆగేదీ కాదు. రాధాకృష్ణ గారు సాధారణంగా లోపలికి ఈ హాలులోకి వచ్చేవారు కారు. ఎప్పుడైనా “అయ్యవారు” ( రాధాకృష్ణ గారిని అలా సంబోధించేవారు) వస్తే మాత్రమే ఆయన లేచి నిలబడే వారు.
ఇక ములుగు రాజేశ్వర రావు గారిని చూస్తే, కొంత “ఫాసినేషన్”, కొంత బెరకు! ” నేను ఈయనలా ఎందుకు లేను?” అని సందేహం! ఆయన భావాల తీవ్రత చూస్తే కొంత బెరకు!
చాలాకాలం తరువాత కానీ నాకు అర్థం కాలేదు… నేను ఆయనలా ఎందుకు లేను అనేది. నేను వచ్చిన నేపథ్యం, ఇక్కడకు రాకముందు నా కార్యకలాపాలు, కొన్ని సంస్థలతో నా అనుబంధాలు, భావజాలం అన్నీ చెప్పాను కదా? అవే నన్ను ఆయనలా లేకుండా చేశాయి. ఆయన ” ప్యూర్ జర్నలిస్టు!’ ఏ విధమైన ఎఫిలియేషన్స్ లేవు. వార్తను వార్తగా చూస్తారు. దానిలోని అగాథ మర్మాలు పట్టుకుంటారు. ” భయం గానీ, పక్షపాతం కానీ లేకుండా” అని చట్ట సభలలో ప్రమాణం చేస్తారే… అలాటి ప్రమాణం ఏదో లోలోపల తనకు తానే చేసుకున్నట్టు ఉండేవారు… ఉండేవారు ఏమిటి? ఇప్పటికీ అలాగే వున్నారు రాజేశ్వర రావు గారు. ఈ మధ్య కూడా మాట్లాడుకుంటున్నపుడు అనుకున్నాం… మన మధ్య ఎన్ని అభిప్రాయ బేధాలు ఉన్నా, పరస్పర అభిమాన, గౌరవాలకు ఏ మాత్రం విఘాతం లేదనీ, ఉండదనీను. అప్పట్లోనే కాదు… ఇప్పుడు కూడా ఆవేశం తోనో, ఉద్వేగంతోనో నేను సామాజిక మాధ్యమాలలో ఏదైనా వ్యాఖ్య చేసినా, నన్ను సరిదిద్దే ” మిత్రుడు, హితైషి” రాజేశ్వర రావు గారు. రామ్ ప్రసాద్ గారినీ, రాజేశ్వర రావు గారినీ ఇప్పటికీ పాత్రికేయత లో నాకు మొదటి గురువులుగా సంభావించుకుంటూన్నాను.
నిడదవోలు సుందరేశ్వర రావు గారు మరొక మేధావి, కానీ ఒకరకంగా “నష్ట జాతకుడు”! మహా పండితుడు, సాహిత్య పరిశోధకుడు, బహు గ్రంథ పరిష్కర్త నిడదవోలు వేంకటరావు గారి కుమారుడు ఈయన. సిటీ వార్తల పని ఆయనది. సరసుడు, అలసుడు కూడా. నిజానికి ” భారతి సాహిత్య మాస పత్రిక” లో ఉండవలసిన వాడు… ఇక్కడ సిటీ వార్తలు వ్రాసుకుంటూ కూర్చున్నాడు. ” రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పొజిషన్!” అనిపించేది నాకు.
కె. ఎల్. రెడ్డి మఫిసిల్ ( గ్రామీణ) వార్తలు చూసేవాడు. విచిత్ర వ్యక్తి, ఒకరకమైన అమాయకుడు, నిరాడంబరుడు. కొన్ని తీవ్ర అభిప్రాయాలూ లేకపోలేదు. ” బాపనోళ్ళు అందరూ కలిసి తెలుగును తగలేసిన్రు” అంటూ ఉండేవాడు తెలుగులో సంస్కృత పదాల ఆధిక్యతను చూసి. ఒకసారి ” గ్రంథాలయానికి నిధులు కావలెను” అని ఒక శీర్షిక పెట్టాడు. నేను అది చూసి ” ఇలా వ్రాయకూడదు, తప్పు” అన్నాను. ” అయితే ఎలా రాయాలో చెప్పు ” అన్నాడు. ” పొత్తముల కొంపకు సొమ్ములు కావలెను అని వ్రాయాలి” అన్నాను. రెడ్డి నవ్వేసి ” నేను రాస్తాను, చదివే వాడికి అర్థం అయి చావాలి కదా? అసలు తెలుగు అర్థం కాకుండా చేసింది మీవాళ్ళే కదా?” అని మళ్ళీ నవ్వేశాడు.
” దేవుడు అన్యాయం చేశాడు!”…రేపు
Leave a comment