స్వీయ అన్వేషణ – 32
ఆంధ్ర పత్రిక హైదారాబాద్ శాఖలో నిడదవోలు సుందరేశ్వర రావు గారు ఒక సబ్ ఎడిటర్. ఈయన ప్రఖ్యాత సాహిత్య పరిశోధకులు నిడదవోలు వేంకట రావు గారి కుమారుడు. ” పండితపుత్రుడు” కాదు… పండితుడు! ఇక్కడ ఓ మూల కుర్చీలో కూర్చుని నగర వార్తలు వ్రాసుకుంటూ ఉండేవారు. సరసుడు అని చెప్పాను కదా! ఆయన జీవిత లక్ష్యం ఒకటి ఉండేది… అది నెరవేరకపోవడం వేరే విషయం! తెలుగు కావ్యాల నుంచి ఒక ప్రత్యేక అంశంతో ఉన్న పద్యాలు అన్నీ సేకరించి, గ్రంథంగా ప్రకటించాలి అనేది ఆ ఆశయం… ఆ సంకలనానికి ఆయన చేసిన నామకరణం ” కుచ కలశం!” తెలుగు కావ్యాలలో స్తనాల వర్ణన కల పద్యాల సంకలనం. నాకు ఆయన చూపిన వ్రాతప్రతిలో వెయ్యికి పైగా పద్యాలు ఉన్నాయి! ఆ వ్రాత ప్రతి చూసి, ఆ పద్యాలు అన్నీ చదివి నాకు ఆశ్చర్యం కలిగింది. ఎంత శ్రమ పడ్డారూ! అని. నిజం చెప్పొద్దూ… నాకు చాలా సరదా వేసింది అది చూసి.
ఆయన చాలా “అలసుడు” అని కూడా చెప్పాను కదా! జీవితంలో ఏ సీరియస్ నెస్ లేని వ్యక్తి. ఉద్యోగంలోనూ ఏ ఆశలూ, ఆశయాలూ లేవు. రోజు గడచిపోతే చాలు అన్నట్టు ఉండేవారు. ఆయనకున్న ” అవసరం” ఒక్కటే… ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్ళాక కాస్తంత ” తీర్థం” గొంతులో పోసుకుని పడుకోవాలి. దానికి మాత్రం నాగా పడకూడదు! దాని కోసం ఆయన తన లైబ్రరీలో ఉన్న అమూల్యమైన గ్రంథాలు కూడా అమ్మేసేవారు! నిజానికి అవన్నీ ఆయన తండ్రి నిడదవోలు వేంకట రావు గారి సేకరణ. ఆయన అలా అమ్మేస్తూ ఉంటే నేనే చాలా పుస్తకాలు కొన్నాను. వాటిలో మద్రాస్ విశ్వవిద్యాలయం ప్రచురించిన రామరాజ భూషణుడి ” వసు చరిత్ర” కావ్యం ఒకటి. నిజానికి ఆ కావ్య పరిష్కరణ చేయమని ఆయననే అడిగారట ముందు. తరువాత ఏదో కారణాల వల్ల వేరే ఎవరి చేతనో చేయించారు. ఆ ప్రచురణ అది. దానిలో ప్రతి పేజీని విడదీసి, ప్రతి రెండు పేజీలకు మధ్య ఒక తెల్ల కాగితం ఉంచి బైండ్ చేయించారు వేంకట రావు గారు. ఆ ప్రచురణలో దొర్లిన తప్పులను ఆ తెల్ల కాగితం పై వ్రాశారు. అమూల్యమైన గ్రంథం! కేవలం ” తీర్థ సేవనం” కోసం అలాటి గ్రంథాన్ని వంద రూపాయలకు నాకు అమ్మేశారు ఆయన! రామరాజ భూషణుడి మహాకావ్యం, తండ్రి పరిష్కరణ ” వెల” జస్ట్ హండ్రెడ్ రూపీస్! వ్యసనం ముందు ఏదీ నిలబడదు కదా?!
ఆయనకు జీతం డబ్బులు సరిపోయేవి కావు. చేబదులు స్థాయి దాటి అప్పులు, ఆ అప్పులు దాటి కాబూలీ అప్పుల వరకూ ప్రాకింది. అఖ్తర్ ఖాన్ అనే కాబూలీవాలా ఈయనకు అప్పులు ఇచ్చేవాడు. వడ్డీ వందకు పది రూపాయలు. ప్రతి దానికీ ” శాచురేషన్ పాయింట్” ఉంటుంది కదా? అలాగే అఖ్తర్ దగ్గర ” క్రెడిట్ లిమిట్” అయిపోయింది ఈయనకి! ఓ రోజు మధ్యాహ్నం లంచ్ టైంలో సుందరేశ్వర రావు గారు నన్ను ఆఫీస్ బయటకు తీసుకు వెళ్ళారు. అక్కడ అఖ్తర్ గురించి చెప్పారు. అతగాడు ఇంక తనకు అప్పు ఇవ్వడని చెప్పారు. తనకు అత్యవసరంగా డబ్బు కావాలనీ అన్నారు. “ఇవ్వడు అంటున్నారు కదా?” అన్నాను. ” నాకు అంటే ఇవ్వడు. నీకు అయితే ఇస్తాడు కదా? సాయంత్రం నాతో రా… నీకు అవసరం అని చెబుతాను. ఇస్తాడు. వడ్డీ నేనే కట్టుకుంటాను… అసలూ నేనే తీరుస్తాను. ప్లీజ్!” అన్నారు. “సరే” అన్నాను.
సాయంత్రం ఇద్దరం వెళ్లాం. పరిచయం చేసి… ” భాయ్! ఇతనికి రెండు వేలు అవసరం. మంచివాడు” అని చెప్పారు రావు గారు.
ఖాన్ కొన్ని ప్రశ్నలు వేశాడు… ” ఎక్కడ ఉంటూన్నావు? పెళ్లి అయిందా?”
” మా మేనమామ ఇంటిలో ఉంటున్నాను, పెళ్లి కాలేదు” అని చెప్పాను.
అప్పుడు ఖాన్ ” నేను ఇతనికి అప్పు ఇవ్వను!” అనేశాడు రావు గారితో.
” అదేమిటి?” అని రావు గారి ప్రశ్న.
” ఇతను ఎవరి ఇంటిలోనో ఉంటున్నాడు. రేపు ఇతను వడ్డీ కట్టకపోతే నేను ఇంటికి వెడతా. ఇతను ఇంటిలో ఉండడు. వాళ్ళు ఏమంటారు? మాకేం సంబంధం? ఎవడికి ఇచ్చావో వాణ్ణే అడుగు అంటారు. అప్పుడు నేనేం చేయాలి?
“అదే అద్దె ఇల్లు అయితే పొరుగువాళ్ళ దగ్గర పరువు పోతుందని ఖచ్చితంగా వడ్డీ కట్టేస్తాడు.
“ఇతనికి పెళ్లి కూడా కాలేదు. పెళ్లి అయి అంటే ఇంటి దగ్గర ఇతని భార్య ఉంటుంది. లేదా ఆమె కూడా ఉద్యోగం చేస్తూ ఉంటే ఆమె ఆఫీస్ కి వెడతాను. నేను ఇంటికి వెళ్లి అడుగుతానేమో?ఆవిడ ఆఫీస్ కి వెళ్లి అడుగుతానేమో? పెళ్ళాం ముందు పరువు పోతుందనే భయం ఉంటుంది. వడ్డీ కట్టేస్తాడు.
” ఈ రెండూ లేవు కనుక ఇతనికి అప్పు ఇవ్వను! కనీసం అద్దె ఇంటికి మారాక చెప్పు. అప్పుడు ఎంత కావాలన్నా ఇస్తాను” అనేశాడు.
నాకు చాలా ముచ్చట వేసింది అతని ” బిజినెస్ స్ట్రాటజీ”కి.
ఆ తరువాత కొన్ని నెలల తరువాత మా మేనమామ ఇంటి నుంచి అద్దె ఇంటికి మారాను. సుందరేశ్వర రావు గారు మళ్ళీ తీసుకువెళ్ళారు. ఇంటి అడ్రస్ తీసుకుని ” రేపు పొద్దున్నే వచ్చి ఇస్తా” అని పంపేశాడు. అన్నట్టుగానే మరునాడు పొద్దున్నే ఏడు గంటలకల్లా ఇంటి ముందు ఆగి పిలిచాడు. రెండు వేలు ఇచ్చాడు… లేదు… పద్దెనిమిది వందలు ఇచ్చాడు… వడ్డీ రెండు వందలు కట్ చేసుకుని! ” అయిదవ తేదీ సాయంత్రం వడ్డీ కట్టకపోతే ఆరో తేదీ ఇంటికి వస్తా… ఇంటిలో లేకపోతే ఆఫీస్ కి వస్తా” అని హెచ్చరిక జారీ చేసి మళ్ళీ వెళ్ళాడు.
అలా అఖ్తర్ తో ప్రయాణం మొదలు అయింది. తరువాత అనేక సందర్భాలలో ఎవరెవరి కోసమో అప్పు తీసుకోవటమూ, కొంత మంది తిరిగి కట్టటమూ, కొంత మంది ఎగ్గొట్టిపోవటమూ, ఆ వడ్డీలు నేనే కట్టుకుంటూ ఇలా చాలా ఏళ్లు జరిగాయి. చాలా ఏళ్ళు అంటే…కొన్నేళ్ల క్రితం వరకూ సాగింది.
ఆంధ్ర పత్రికలో తరువాతి కాలంలో వై. శ్రీనివాస రావు ( వై.ఎస్.ఆర్) రిపోర్టర్ గా చేరాడు. అతని అవసరానికి ఖాన్ ని పరిచయం చేశాను. అదే సమస్య! పెళ్లి కాలేదు, ఫ్రెండ్ రూం లో ఉంటున్నాడు. ఎలా? ఖాన్ ఒకటే అన్నాడు… ” నువ్వు గ్యారంటీ ఇస్తే ఇస్తా”. అలా నేనూ, వై.ఎస్.ఆర్. ఇద్దరం ఖాన్ ఖాతాలో చేరాం. మేమిద్దరం ఒక మాట అనుకునే వాళ్ళం… ” ఇతను అఖ్తర్ ఖాన్ కాదు… అత్తరు ఖాన్! మనం ఎప్పటికైనా మన ఆత్మ కథ వ్రాసుకుంటే ఇతని గురించి ఒక ఛాప్టర్ వ్రాయాలి!”
ఆ తరువాత నేను ఆంధ్ర పత్రికలో ఉద్యోగం మానేశాక మూడు నెలలు ఖాళీ గా ఉన్నా. వడ్డీ కట్టలేదు. రెండు నెలలు ఖాన్ మాట్లాడ లేదు. మూడో నెల ఇంటి ముందు ఉన్నాడు. పరిస్థితి చెప్పాను. ” సరేలే! తొందరగా ఏదో ఉద్యోగం చూసుకో, నువ్వే వచ్చి కట్టేయ్, నేను మళ్ళీ రాను!” అన్నాడు.
అనుకోకుండా ఆంధ్ర ప్రభలో చేరా. దాదాపు మరో మూడు నెలలు చెన్నైలో ఉన్నా. తిరిగి హైదారాబాద్ వచ్చి చేరాక వారం రోజులకు ఆఫీస్ ముందు ప్రత్యక్షం అయాడు. అప్పటికి ఆరు నెలల వడ్డీ బాకీ, ఆరు వందలు… జీతం మూడు వేలు!
” ఎప్పుడు చేరావ్ ఇక్కడ?’ ఖాన్ ప్రశ్న.
” వారం అయింది” నా జవాబు.
” మంచి కంపనీలో చేరావ్. మళ్ళీ మానేయకు! జీతం ఎంత?” ఖాన్ ప్రశ్న.
” మూడు వేలు” నా జవాబు.
” ఇంక వడ్డీ బాకీ ఏం కడతావ్? సరేలే! అది వదిలేయ్! వచ్చే నెల నుంచి కట్టు” అంటూ బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు అఖ్తర్!
ఆ తరువాత కాలంలో ఒకరోజు తన కొడుకు అమాన్ ఖాన్ ను తీసుకుని వచ్చాడు ఇంటికి. ” నేను కాబూల్ వెళ్లి పోతున్నాను. వీడు నా కొడుకు. ఇక నుంచీ వీడే చూస్తాడు అన్నీ. వీడికి ఇచ్చెయ్” అని చెప్పాడు.
తరువాత కొడుకుతో ” సార్ నీకు పెద్దన్నయ్య లాటి వాడు. గుర్తు పెట్టుకో. ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకో. ఎప్పుడూ అడగొద్దు!” అని చెప్పాడు. అదే చివరిసారి అఖ్తర్ ను చూడటం. అమాన్ ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు. ఆ అప్పులు అన్నీ తీరిపోయాయి. కానీ ఇప్పటికీ అప్పుడప్పుడు ” సర్ జీ! హౌ ఆర్ యు?” అంటూ మెసేజ్ పెట్టడమో, ఫోన్ చేయడమో సాగుతూనే ఉంది మా మధ్య!
కాబూలీ వాలా అనగానే భయంకరంగా వ్యవహరిస్తాడు అనీ, కొరడా పట్టుకు తిరుగుతారనీ అనుకునే వాళ్ళం. అంటే అలాటి వాళ్ళు లేరని కాదు. ఉన్నారు కూడా. అక్తర్ తో పాటు మరో ఇరవై మంది ఆబిడ్స్ లో ఒక పెద్ద ఇల్లు తీసుకుని వుండేవారు. ఒక పెద్ద హాలు, దానికి మూడు వైపులా గదులు. ఆ హాలులో నాలుగు వైపులా గోడల వద్ద మెత్తటి తెల్లని పరుపులు, గోడలకు ఆనించిన బాలీసులు. మధ్యలో అడుగు ఎత్తున్న పొడవాటి బల్ల, దానిపైన తెల్లటి వస్త్రం, దాని పైన రక రకాల ఆహార పదార్థాలు… ఇదీ ఆ ఇంటిలో రాత్రి సీన్! త్రికోణం ఆకారంలో కట్ చేసి, బాగా వెన్న పూసిన దాదాపు వంద రొట్టెలు, రకరకాల నాన్ వెజ్ కూరలు, స్వీట్స్, పండ్లు … అదొక విందు. చాలా సార్లు అఖ్తర్ తనతో ” విందు” కు ఆహ్వానించే వాడు. వెళ్ళేవాడిని. పండ్లు, స్వీట్స్ తప్ప అవేవీ మనం తినే పదార్ధాలు కావు. అక్తర్ నవ్వేసేవాడు. ఒక బౌల్ లో స్వీట్ పెట్టీ అందించేవాడు! ఒక్కోసారి ఏపిల్స్ తనే కట్ చేసి ఇచ్చేవాడు. అవి తింటూ కబుర్లు చెప్పుకుంటూ అరగంటా, గంటా కాలక్షేపం చేసి వచ్చేసేవాడిని. అలా ఆ ఇరవై మందీ కూడా సన్నిహితులు అయ్యారు. అక్తర్ అందరిలో పెద్దవాడు. అందరూ అతని మాటను గౌరవించేవారు. అతనే నన్ను ఆహ్వానించి ” మేరా భాయ్!” అని పరిచయం చేయటంతో అందరికీ నా మీదా ఒక గౌరవం ఏర్పడింది. అలా అని దానిని ఆసరా చేసుకుని నేను మరొకరు ఎవరి దగ్గరా అప్పు చేయలేదు. వాళ్ళు అలా ఇవ్వరు కూడా! నాది అఖ్తర్ ఖాతా కదా?!
అక్తర్ ఖాన్ మరపు రాని మనిషి… మనసున్న మనిషి! ఆ స్నేహపు అత్తరు పరిమళం ఎన్నటికీ వీడనిది!
“శేషేంద్రతో పరిచయం” రేపు…
Leave a comment