స్వీయ అన్వేషణ – 33
మా మాష్టారు శరభయ్య గారు ఒక ఉత్తరం వ్రాశారు… ” నేను, మా అబ్బాయి హైదారాబాద్ వస్తున్నాము. అక్కడ శేషేంద్ర శర్మ గారిని కలవాలి. వారు ఎక్కడ ఉంటారో ఆ చిరునామా తెలియదు. కనుక మీరు మమ్మల్ని ఆయన దగ్గరకు తీసుకువెళ్లాలి” అని.
మాష్టారు వచ్చారు. నాకు కూడా శేషేంద్ర ఉండే చోటు తెలియదు. నా మిత్రుడు వై.వి.వివేకానందంకు తెలుసు. అందుకని అతనితో కలసి స్టేషన్ కు వెళ్లి ఆయనను తీసుకుని బయలుదేరాం.
“జ్ఞాన్ బాగ్ ప్యాలెస్”… అదే మొదటిసారి ప్రత్యక్షంగా చూడటం. గతంలో ముత్యాల ముగ్గు సినిమాలో చూశాం ముందు భాగం అంతే. పొడవైన దారి గుండా లోపలికి వెడితే ఆ ప్యాలెస్ దర్శనమిచ్చింది. ఆ మెట్లు ఎక్కి వెడితే అక్కడ కూర్చుని ఉన్నారు గ్రీకు శిల్పం లాంటి శేషేంద్ర. “పుంసాం మోహన రూపాయ” అంటే ఏమిటి అనేది తెలిసింది. ( శ్రీ వైష్ణవులు ఈ మాటకు కోప్పడకండి!)అయితే ఆయనను చూడటం అదే మొదటిసారి కాదు. రాజమండ్రిలో ఏదో సాహిత్య సభకు వచ్చినప్పుడు చూశాను… ఆయనను, ఆయనతో పాటు ఇందిరాదేవిని. అప్పుడే శేషేంద్ర అంటే ఒకానొక అవ్యక్త ఆకర్షణ ఏర్పడింది. ఆనాటి ఆయన ప్రసంగం నాలో ఎన్నో క్రొత్త ఆలోచనలనూ రేకెత్తించింది.
సరే… శేషేంద్ర అనే కవి సింహాన్ని తన ” గుహ” లోనే కలిశాను ఆ రోజు. వివేకానందకు అంతకుముందే స్వల్ప పరిచయం ఉంది ” యువ భారతి” కార్యదర్శిగా. మాష్టారు నన్ను పరిచయం చేశారు… ” నాకు ఆప్తుడు, శిష్యుడు” అని. మాష్టారిని అక్కడ వదలి వచ్చాం. మూడు రోజులు ఉన్నారు అక్కడ మాష్టారు. తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ కలిశాను. శేషేంద్రకు మాష్టారు ఏమి చెప్పారో తెలియదు కానీ, ” వస్తూ ఉండండి!” అన్నారు శేషేంద్ర.
ఆ మాత్రం సందు ఇస్తే ఊరుకుంటామా? అప్పట్లో ప్రతి బుధవారం ” వీక్లీ ఆఫ్” ఉండేది నాకు. ముందు రోజు ఫోన్ చేసి అనుమతి తీసుకుని వెళ్ళేవాళ్ళం నేనూ, వివేకానందం. ఉదయం 9 గంటలకు వెడితే మధ్యాహ్నం రెండో , మూడో! దాదాపు ఏడాది పాటు మాకు ప్రతి బుధవారమూ ఇదే పని. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం. మేము వేసే ఒకే ఒక ప్రశ్న… దాని గురించి వారిద్దరి మధ్య గంటలు గంటలు చర్చ! వారిద్దరికీ సాహిత్యం పై ఉన్న పట్టుకు నివ్వెరపోతూ వింటూ కూర్చొనేవాళ్ళం. మధ్య మధ్యలో చాయ్, బిస్కెట్స్. అదే మాకు “ఎడ్యుకేషన్!”
అలా గడుస్తున్న కాలంలో శేషేంద్ర తన ఆధునిక మహాభారతం ఇచ్చారు. అంతకు ముందు నేను చదివిన ఆయన కృతి ఎమెస్కో ప్రచురణ ” నా రస్తా” ఒక్కటే. ” అది యొక ధర్మ దీక్ష…” పద్యం నాకు ఎంతో ఇష్టం. ఆధునిక మహాభారతం చేతిలో పడగానే రాత్రి అంతా కూర్చుని ” ఆబగా” చదివేశాను. దానిలో పద పదానా నాకు వైదిక అభివ్యక్తులు కనిపించాయి. చివరికి సంధ్యావందన మంత్రాల ప్రభావమూ కనిపించింది. దాని గురించి వ్రాయాలి అనిపించింది. మరునాడు ఆయనకు ఫోన్ చేసి చెప్పాను… ” సర్! దీని మీద నేను వ్రాస్తాను” అని. ఆయన ” తప్పకుండా వ్రాయండి. కానీ దానిలో ‘ విప్లవ భాషా విధాత” అనే దానిని హైలైట్ చేయాలి మీరు! దానికి కావలసిన మెటీరియల్ నేను ఇస్తాను. దిగంబర కవులు, విప్లవ కవులు, నక్సల్ కవులు నాకు ఈ విషయంలో వ్రాసిన ఉత్తరాలు ఉన్నాయి. అవి మీకు చూపిస్తాను. అవి బేస్ చేసుకుని వ్రాయండి” అన్నారు.
నాకు ఏమి చెప్పాలో తోచలేదు. ఒక పుస్తకం చదివినప్పుడు నాకు కలిగిన అనుభవాన్ని వ్రాస్తాను కానీ ఆ కవి లేదా రచయిత చెప్పినట్టు వ్రాయటం ఏమిటి? కవితా రహస్యం క్షుణ్ణంగా తెలిసిన శేషేంద్రయేనా ఇలా మాట్లాడేది? “సరే లెండి!” అంటూ ఫోన్ పెట్టేశాను. మళ్ళీ శేషేంద్రను కలవలేదు.
అనంతర కాలంలో ఆంధ్ర పత్రిక లో వరుసగా నేను అనుకున్న విధంగానే వ్రాశాను శేషేంద్ర కవిత్వం గురించి. ఆ వ్యాసాలే ” శేషేంద్ర ప్రతీకోపనిషత్తు!”.అవి తరువాత నేను ప్రచురించిన నా వ్యాస సంకలనం ” మధుకశ” లో మొదటి వ్యాసాలు. అంతే కాదు నేను వ్రాసి, ప్రచురితం అయిన మొట్ట మొదటి సాహిత్య విమర్శ వ్యాసాలు కూడా అవే. ఆ వ్యాసాలు వ్రాయటంలో, అవి ప్రచురణ కావటంలో “అసురా” పాత్ర చాలా ఉంది. ” అసురా” గురించి తరువాత మాట్లాడుకుందాం.
” మంత్ర నగరిలో మొదటి అడుగు!” రేపు…
Leave a comment