” మంత్ర నగరిలో మొదటి అడుగు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ -34

డాక్టర్ ప్రసాదరాయ కులపతి… ఒకప్పటి సాహిత్య ప్రపంచానికి చిర పరిచితులు. గంగా ప్రవాహంలా ఆశువుగా పద్యాలు చెప్పిన దిట్ట. అనేక ఖండ కావ్యాలు వెలువరించిన పద్య కవి. ఇది ఒక పార్శ్వం.

కాగా… రెండవ పార్శ్వం ఆయన ” మంత్ర సాధన”. రోజుల తరబడి సాధనలో నిమగ్నులు అయేవారుట. ఆయనపై ” కావ్య కంఠ ” గణపతి ముని ప్రభావం చాలా ఉంది. గణపతి ముని దశ మహా విద్యలలో “ఛిన్న మస్త ” ఉపాసకులు. జీవించి ఉండగానే ” కపాల భేదన సిద్ధి” పొందిన మహాత్ముడు. అరుణాచలం లోని ” బ్రాహ్మణ స్వామి”కి ” భగవాన్ శ్రీ రమణ మహర్షి” అని నామకరణం చేసిన మహనీయుడు. నా అదృష్టం కొద్దీ తరువాతి కాలంలో ఎస్ వి బి సి లో ఆయన జీవితాన్ని కపాల భేదనం వరకూ ” నాయన” అనే పేరిట సీరియల్ గా రచించాను.

ఆ గణపతి ముని ఉపాసించిన ” ఛిన్న మస్త” ను ఉపాసించిన వారు ప్రసాదరాయ కులపతి.

నేను “సమస్యా పూరణం” కార్యక్రమానికి పూరణలు పంపే రోజులలో ఆయన పేరు విన్నాను. తరువాత ఇప్పుడు ఆంధ్ర పత్రికలో పని చేస్తున్న తొలి రోజులలో మిత్రుడు వివేకానందం వల్ల ఆయనతో ప్రత్యక్ష పరిచయం కలిగింది. ఆయన అనేక సాహిత్య కార్యక్రమాలకు హైదారాబాద్ కు వస్తూ ఉండేవారు. అలా సాన్నిహిత్యం ఏర్పడింది.

ఒకసారి ఆయన హైదారాబాద్ వచ్చారు. అప్పట్లో ” కృష్ణా పత్రిక” నడుపుతున్న పిరాట్ల వేంకటేశ్వర్లు ఆయనకు సన్నిహిత మిత్రుడు. అప్పుడు కులపతి గారిని కృష్ణా పత్రిక కార్యాలయానికి తీసుకువెళ్ళ వలసి వచ్చింది. ఆటోలో బయలుదేరాం. ట్యాంక్ బండ్ మీదుగా వెడుతూ ఉండగా ఆయన ” రోజూ ఆటోలోనే తిరుగుతారా?” అని అడిగారు. ” అవును” అన్నాను. “చాలా ఖర్చు అవుతుంది కదా? పోనీ ఏదైనా చిన్న స్కూటర్ లాంటిది కొనుక్కోవచ్చు కదా?” అన్నారు.

” సర్! నా జీతం పన్నెండు వందలు. కొన్ని అవకాశాలు వస్తున్నాయి కానీ చివరి క్షణంలో చేజారి పోతున్నాయి” అన్నాను.

“అదేమిటి?” అని అడిగారు.

“సర్! మా ఎడిటర్ రాజగోపాల రావు గారికి ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆయన నెహ్రూ దగ్గర పని చేశారు. నెహ్రూతో ఆయన అనుభవాలను ఇంగ్లీష్ లో నోట్ చేసి పెట్టారు. ఆయన ఒక పుస్తకంగా చేయాలని అనుకున్నారు. మా ఎడిటర్ కి చెప్పారు. ఆయన నాకు చెప్పి ‘ రోజూ సాయంత్రం ఆయన దగ్గరకు వెళ్ళాలి. ఆయన ఏ రోజుకు ఆ రోజు రికార్డు చేసి ఇస్తారు. అది విని తెలుగులో అనువదించి ఇవ్వాలి. ఈ పని జరిగినంత కాలం నెలకు అయిదు వేలు ఇస్తారు. చేస్తారా?’ అని అడిగారు. నాకూ డబ్బు అవసరం… ఒప్పుకున్నాను. ఫోన్ లో ఆయనతో మాట్లాడించారు. ‘ నేను ఢిల్లీ వెడుతున్నా. తిరిగి రావటానికి వారం, పది రోజులు పడుతుంది. రాగానే ఫోన్ చేస్తాను” అన్నారు.

వారం గడిచింది, పది రోజులూ గడిచాయి, పదిహేను… ఇరవై… పాతిక రోజులు…నెల రోజులు గడిచి పోయాయి. కబురు లేదు. అప్పుడు ఒక పాత్రికేయ మిత్రుడు కలిశాడు. మాటల సందర్భంలో చెప్పాడు… అప్పుడు తెలిసింది… ఆ పని అతనికి అప్పగించారు …అని.

“సర్! ఇలా చాలా అవకాశాలు చేజారి పోతున్నాయి” అన్నాను.

కులపతి గారు ” అంటే పనులలో విఘ్నాలు వస్తున్నాయన్న మాట! తొలగించుకుంటే సరి!” అన్నారు.

“సర్! డయాగ్నోసిస్ కాదు… ప్రిస్క్రిప్షన్ చెప్పండి” అన్నాను.

” ఒక పని చేయండి… మీకు శలవు ఉన్న రోజు గుంటూరుకు రండి. మీరు పాన్ వేసుకుంటారు కదా? అది వేసుకునే చేసే మంత్రాన్ని చెబుతాను. జపం చేయండి” అన్నారు. ” సరే” అన్నాను.

మరుసటి బుధవారం నేనూ, మిత్రుడు వివేకానందం ఇద్దరమూ గుంటూరులో ఆయన ఇంటికి వెళ్ళాం. ఆయన ఇద్దరికీ ఒక ” గణపతి మంత్రం” ఉపదేశించారు.

“ఆ మంత్రం రాత్రి చేయాలి. రుద్రాక్ష మాలతో చేయాలి. మొత్తం లక్ష జపం చేయాలి. ప్రతి రోజూ జపం పూర్తి అయాక ఒక ఉల్లిపాయ కోసి, కుంకుమ అద్ది, నైవేద్యం పెట్టాలి. దానిని మరునాడు ఉదయమే బయట పారవేయాలి” ఇదీ ఆయన చెప్పిన విధానం! మంత్ర శాస్త్రం గురించి వినటమే కానీ ఈ విధానాలతో అప్పట్లో ఏ మాత్రం పరిచయం లేదు. అనంతర కాలంలో కానీ అది ” వామాచార విధానం” అని తెలియలేదు. ఆయనతో సాన్నిహిత్యం పెరిగిన కొద్దీ ఆయనకు ఆ వామాచార విధానాలపై ఉన్న తీవ్ర ఆసక్తి గురించి తెలిసింది!

ఆ జపం మొదలు పెట్టాక మా అమ్మ గోల పెట్టింది… “ఇదేవిట్రా? మనం ( శ్రీ వైష్ణవులు) గణపతి జపం చేయటం ఏమిటీ? ఆ రుద్రాక్ష మాల ఏవిటీ? పైగా ఆ ఉల్లి పాయలూ, కుంకాలూ… ఏవిట్రా?” అంటూ.

నేను పట్టించుకోకుండా లక్ష జపం పూర్తి చేశాను. అలా ” మంత్ర సాధన”లో నా తొలి అడుగు పడింది.

” ప్యాలెస్ పోయింది!” రేపు…


Leave a comment