స్వీయ అన్వేషణ – 35
ఆంధ్ర పత్రిక కార్యాలయం బషీర్ బాగ్ లోని ప్యాలెస్ లో ఉందని చెప్పాను కదా? ఆంధ్ర పత్రిక మద్రాసు నుంచి హైదారాబాద్ కు తరలి వచ్చినప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్యాలెస్ ను నామమాత్రపు నెలవారీ అద్దెకు ఆంధ్ర పత్రికకు ఇచ్చింది. నేను విన్నది ఏమిటంటే తరువాతి కాలంలో ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ” ఈ భవంతిని నామమాత్రపు ఖరీదుకు ఇచ్చేస్తాము, కొనేసుకోండి, మళ్ళీ మళ్ళీ ఇలాటి అవకాశం రాకపోవచ్చు” అని ఆంధ్ర పత్రిక అప్పటి యజమాని శంభూ ప్రసాద్ గారికి చెప్పారట. కానీ ఆయన ఇప్పుడున్న ” నామమాత్రపు నెలవారీ అద్దె” వైపే మొగ్గు చూపారుట! ఎంత నామమాత్రపు ఖరీదు అయినా కనీసం కొన్ని లక్షలు పెట్టాలి కదా? దానికన్నా ఈ నెలవారీ అద్దే బెటర్ అనుకున్నారేమో? కానీ ఒక వ్యాపారవేత్తగా ఆలోచించలేక పోయారు! చివరికి ఆ కాంగ్రెస్ ముఖ్య మంత్రి చెప్పినదే నిజమైంది!
రాష్ట్ర రాజకీయాల్లోకి ఒక సునామీ లాగ వచ్చాడు నందమూరి తారక రామారావు. కేవలం తొమ్మిది నెలల ప్రచారంతో రాష్ర్టం అంతా చుట్టేసి, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తుడిచి పెట్టేసి, తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.
అప్పటికి ఒక వైపు చాలా ప్రభుత్వ కార్యాలయాలు వేలకు వేలు అద్దెలు పోసి ప్రయివేటు భవనాలలో ఉంటున్నాయి. మరొక వైపు ప్రభుత్వ భవనాలు నెలవారీ నామమాత్రపు అద్దెలకు ప్రయివేటు వ్యక్తుల, సంస్థల చేతుల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి రామారావు దృష్టి ఈ అంశంపై పడింది. అలా ప్రభుత్వ భవనాలలో ఉన్న ప్రయివేటు వ్యక్తులు – సంస్థలకు నోటీసులు వెళ్లాయి “నియమిత సమయంలో ఆ భవనాలను ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలి” అని. అలా నోటీసులు అందుకున్న సంస్థలలో ఆంధ్ర పత్రిక కూడా ఉంది. ప్రభుత్వంతో చేసిన చర్చలు ఏవీ ఫలించలేదు. బషీర్ బాగ్ ప్యాలెస్ ను ఆంధ్ర పత్రిక ఖాళీ చేయవలసి వచ్చింది.
దోమలగూడా లోని ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడకు మార్చారు కార్యాలయాన్ని. అలా ఆంధ్ర పత్రిక వైభవానికి మొదటి దెబ్బ తగిలింది. అయితే అప్పటికే పత్రికా రంగంలో ఈనాడు విజృంభణ సాగుతోంది. క్రొత్త క్రొత్త పత్రికలు వచ్చాయి. వాటిలో టెక్నాలజీ వాడకం పెరిగింది. కంప్యూటర్లు ప్రవేశించాయి. రంగుల వాడకం ప్రారంభం అయింది. దినవారీ అనుబంధాలు టాబ్లాయిడ్ రూపంలో వెలువడ్డాయి. ఆంధ్ర పత్రిక లో అప్పటికీ హ్యాండ్ కమ్పోజ్ విధానమే ఉంది. ఈ ప్రభంజనంలో ఆంధ్ర పత్రిక వైభవం మసక బారడం అప్పటికే మొదలైపోయింది. రోజుకు మూడు ఎడిషన్స్ ఉండే పత్రిక రెండు ఎడిషన్లకు దిగిపోయింది. సర్కులేషన్ పడిపోతోంది. సుందరేశ్వర రావుగారు ఒక మాట అనేవారు … “ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్ ఇన్ ద ఆఫీస్!” అని. అలాగే మరొక మాట కూడా ఉండేది… ” ప్రతి వేసవికాలం ముగిసే సరికి ఆంధ్ర పత్రిక సర్కులేషన్ పడిపోతుంది” అని. ఎందుకు? వేసవి తాపానికి వృద్ధులు కొందరైనా ఈ లోకాన్ని వదిలేస్తారు కనుక. ఆ మేరకు చందాదారులు తగ్గిపోతారు అని. అంటే ఆంధ్రపత్రిక కేవలం వృద్ధ తరానికి మాత్రమే పరిమితం అని! క్రమంగా అదే నిజమా అనిపించే స్థాయికి పడిపోయింది పత్రిక. కాలానికి తగినట్లు మారకపోతే జన బాహుళ్యానికి సంబంధించిన ఏ వ్యాపారమూ, ప్రచురణ, పత్రిక మనుగడ సాగించలేదు అనటానికి ఆంధ్ర పత్రికను ఒక కేస్ స్టడీ గా తీసుకోవచ్చు.
ఒకప్పుడు స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్న కాలంలో తెలుగు వారికి ప్రేరణ ఆ పత్రిక! ఒక పల్లెకు వచ్చే ఒకే ప్రతిని రచ్చబండ దగ్గర ఒకరు చదువుతూ అంటే ఆ పల్లెలో ప్రజలు అందరూ శ్రద్ధగా విన్న పత్రిక! ఆ విధంగా ఆధునిక ” బుక్ రీడింగ్ సెషన్స్” కు ప్రొటోటైప్ అది!
నాకు ఖాళీ ఉన్న సమయంలో వెనుక వైపు ఉన్న గోడౌన్ లో ఉన్న పాత పత్రికలు తిరగేసే వాణ్ణి. ఎన్నో ఆసక్తికరమైన వార్తలు ఉండేవి. భాషలో క్రొత్త క్రొత్త ప్రయోగాలు ఉండేవి. ప్రభుత్వ ప్రకటనలు, వ్యాపార ప్రకటనలు చిత్ర విచిత్రంగా ఉండేవి.
ఇప్పుడు ఒక్కొక్కసారి దిన పత్రికలలో మొదటి పేజీ అంతా వ్యాపార ప్రకటనలు వస్తూ ఉంటాయి కదా? అలా ఎప్పుడో ఒకసారి వస్తాయి. కానీ ఆంధ్రపత్రిక మొదట్లోనే అలా ఉండేది. మొదటి పేజీ అంతా ప్రకటనలే ఉండేవి.
నేను ఆంధ్ర పత్రికలో చేరిన రెండేళ్లకు 1987 లో భద్రాచలంలో స్వామికి మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరిగింది. ఆ ఉత్సవం 60 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అంటే 1987కు ముందు 1927లో జరిగి ఉండాలి. అప్పటి ఉత్సవం రిపోర్ట్ దొరికింది. అది పూర్తిగా ఒక పేజీ ఉంది. దానిని వెతికి తీసి 1987లో మళ్ళీ ప్రచురించాం. అప్పట్లో భద్రాచలానికి వెళ్లే వారు భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ లో దిగి, గోదావరి దాటి ఆలయానికి వెళ్ళాలి. అప్పటి నిజాం ప్రభుత్వం రెండు ప్రకటనలు విడుదల చేసింది. 1. రైల్ కి సంబంధించినది. 2. టీకాలకు సంబంధించినది.
రైల్వే ప్రకటనలో ” నిజాం ప్రభుత్వం వారి ఇనుప దారి” అని ఉంది. అది చదివి నవ్వూ వచ్చింది,ముచ్చటా వేసింది. అలాగే అటువంటి జన సమూహం ప్రోగు పడే ఉత్సవానికి వెళ్లే వారికి అంటు వ్యాధులు సోకకుండా టీకాలు వేయించుకుని తీరాలి అని ప్రభుత్వ ఆదేశం. అలా వేయించుకున్న వారికి మాత్రమే గోదావరి దాటే అవకాశం ఉంటుందని నియమం. ఈ ప్రకటనలోని జాగ్రత్త ఎంత మంచి ఆలోచన!
ఇప్పుడు ” ధర్నా”లు చేస్తున్నారు కదా? అప్పుడు కూడా చేసేవారు… దానికి సంబంధించిన వార్త ” రైతులు తమ పొలాలకు నీటిని విడుదల చేయాలని జిల్లా అధికారి కార్యాలయము వద్ద ‘ మొండికి పడి కూర్చొనిరి” … బావుంది కదూ?
ఇప్పటి ” ఫ్రీలాన్స్ జర్నలిస్టు” అప్పుడు ” స్వకీయ విలేఖరి”!
ఇలా ఆ పాత పత్రికలలో ఎన్నెన్నో… ఇప్పటికీ నేర్చుకో వలసిన విషయాలు …ఉన్నాయి! ఆంధ్ర పత్రిక డిజిటలైజ్ అయి ఉంది. ఆసక్తి ఉంటే చూడవచ్చు. పరిశోధనకు పనికి వచ్చే అంశాలు కుప్పలు కుప్పలుగా దొరుకుతాయి.
“ఆ రోజులు వెళ్లిపోయాయి” రేపు…
Leave a comment