“ఆ రోజులు వెళ్లిపోయాయి”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 36

అవును… ఆ రోజులు వెళ్లిపోయాయి…బషీర్ బాగ్ భవనంలో పని చేస్తున్న కాలంలో ఎన్నో స్మృతులు!

నేను 1985 మే 8న మొదటిసారి ఆ భవనంలో అడుగు పెట్టాను అని చెప్పాను కదా?

1984 డిసెంబర్ లో అని గుర్తు… శ్రీ శృంగేరీ జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి రాజమహేంద్రవరం వచ్చారు. అక్కడ గోదావరి గట్టున ఉన్న శ్రీ శృంగేరి మఠం లో విడిది. ప్రతిరోజూ సాయంకాలం శ్రీ చంద్ర మౌళీశ్వర అర్చన. మిత్రులు, మహాకవి ఎటికలపూడి సుబ్రహ్మణ్య శర్మ ( సమవర్తి ఆయన కలంపేరు) నన్ను తీసుకు వెళ్ళేవారు. అర్చన అనంతరం స్వామివారి చేతుల మీదుగా తీర్థం గ్రహించే మహద్భాగ్యం సమవర్తి వల్ల కలిగింది.

నేను హైదారాబాద్ వచ్చేశాక స్వామివారు తమ యాత్రలో భాగంగా హైదారాబాద్ వచ్చారు. నల్లకుంట శంకర మఠం విడిది. రోజూ ఆఫీస్ అయిపోయాక సాయంత్రం అక్కడికి చేరే వాళ్ళం నేనూ, మిత్రుడు వివేకానందం.

అక్కడే తుమ్మలపల్లి రామలింగేశ్వర రావుగారి పరిచయం. మొదట్లో ఆయన మమ్మల్ని పట్టించుకునే వారు కారు. ఆయన కూడా మహా పండితులు, ప్రౌఢ కవి. ఇక్కడి సాహిత్య ప్రపంచానికి ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు “పెద్ద తలకాయ”. “హైదారాబాద్ వాళ్ళం” కావటంతో మేము కూడా ఆయన ” బ్యాచ్” అనుకున్నారు తుమ్మలపల్లి వారు. ఆయనకు… ఆయనకు మాత్రమే ఏమిటి?…విశ్వనాథ వారి శిష్య వర్గంలో అత్యధిక భాగానికి… దివాకర్ల వారు అంటే చులకన! దివాకర్ల వారిని ” దస్తావేజుల కవి” అనేవారు వారు. ఈ మాట స్వయంగా విశ్వనాథ వారే అన్నారని మా మాష్టారు శరభయ్య గారు చెప్పారు ఒక సందర్భంలో. విశ్వనాథ వారు శ్రీమద్రామాయణ కల్పవృక్షం మహాకావ్యం యుద్ధ కాండతో ముగించారు. మిగిలిన ఉత్తర కాండ పూర్తి చేయాలని దివాకర్లవారు ఆశించి ” గురువుగారూ! ఉత్తర కాండను శ్రీమద్రామాయణ కల్పవృక్షం పరిశిష్టంగా రచించటానికి అనుమతించండి” అని అడిగారట! విశ్వనాథ వారు ఒప్పుకోలేదుట! ఎందుకు అని అడిగితే విశ్వనాథ వారు ఆ వ్యాఖ్య చేశారని మాష్టారు చెప్పారు. ఆయన పద్య రచన అలా ఉండేదని వారి నిష్కర్ష! అందువల్ల, మేము హైదారాబాద్ లో ఉండటం వల్ల, మేము కూడా దివాకర్ల వారి “బ్యాచ్” అనుకుని తుమ్మలపల్లి వారు పట్టించుకునే వారు కారు! అలా ఒకవారం గడిచాక ఆయన అక్కడి శివాలయం మెట్ల మీద కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్నారు. మేము ప్రక్కనే మాలో మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. మా మాటలలో మా మాష్టారు శరభయ్య గారి ప్రసక్తి వచ్చింది. అది ఆయన చెవిన పడింది. దగ్గరకు పిలిచారు. ” శరభయ్య మీకు తెలుసా?” అని అడిగారు. ” మా గురువుగారు” అన్నాను. అంతే! ఆ రోజు నుంచి ఆయన ధోరణి మారిపోయింది. ఆయన ఆప్త వర్గంలో ఒకళ్ళం అయిపోయాం. ” రేపు సాయంత్రం రండి. స్వామి వారి దగ్గరకు తీసుకువెడతా!” అన్నారు.

మరునాడు సాయంత్రం నేనూ, వివేకానందం, మరో మిత్రుడు సుధీంద్ర తీర్థ వెళ్లాం. స్వామివారు పూజ కోసం దిగి వస్తుండగా మమ్మల్ని పరిచయం చేశారు. నేను విశిష్టాద్వైతిని, వివేకానందం అద్వైతి, సుధీంద్ర తీర్థ ద్వైతి. మా పేర్లు విని స్వామి వారు చిరునవ్వు నవ్వుతూ ” త్రిమతాచార్యులు ఒకేసారి వచ్చారే!” అని ఆశీర్వదించారు.

ఆ తరువాత స్వామివారు అక్కడ ఉన్నంత కాలం దాదాపుగా రోజు విడిచి రోజు కలిసేవాళ్ళం. స్వామివారి కార్యదర్శి(?) దక్షిణా మూర్తి గారు స్వామి వారి దగ్గర ఎవరు ఉన్నా మమ్మల్ని లోపలికి పంపేవారు. అలా స్వామివారితో ప్రత్యక్షంగా సంభాషించే అవకాశం, భాగ్యం మాకు తుమ్మలపల్లి వారి సాన్నిహిత్యం వల్ల కలిగింది. ప్రతి రోజూ స్వామివారి అనుగ్రహ భాషణం విశేషాలు నేనే రిపోర్ట్ చేసే వాడిని.

ఆ కాలంలోనే ” వాక్యార్థ సభలు” జరిగాయి. ఎంతో మంది పండితులు వేదాంత విషయాలపై ప్రసంగించారు. వాటి అన్నిటికీ రిపోర్టర్ నేనే! కానీ ఒకసారి స్వామివారు అన్న మాట నాకు నచ్చలేదు. ఒక పండితుడు ప్రసంగిస్తూ ఏదో విషయాన్ని ప్రస్తావిస్తూ అది శంకరుల భాష్యంలో ఉంది అని ప్రమాణం చూపటానికి శంకరుల బ్రహ్మసూత్ర భాష్యాన్ని ఉదహరిస్తూ ” ఇతి శాంకరీయే భాష్యే” అన్నారు. వెంటనే స్వామివారు కల్పించుకుని  ” తదేవ భాష్యం!” అన్నారు. అంటే “శంకరుల భాష్యం అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు,భాష్యం అంటే అదొక్కటే, మిగిలినవి ఏవీ భాష్యాలు కావు” అని స్వామివారి అభిప్రాయం. అది నాకు నచ్చలేదు. బ్రహ్మ సూత్రాలకు శంకరులు, రామానుజులు, ఆనంద తీర్థులు (మధ్వాచార్యులు) ముగ్గురూ భాష్యాలు అనుగ్రహించారు. తరువాతి కాలంలో ఆచార్యులు కొంతమంది కూడా బ్రహ్మసూత్ర భాష్యాలు వ్రాశారు. ” శంకరులది ఒక్కటే భాష్యం, మిగిలినవి ఏవీ కావు” అని సభాముఖంగా తీసి పారేయటం నాకు రుచించలేదు. అది స్వామివారు ప్రాతినిథ్యం వహిస్తున్న పీఠ సంప్రదాయానికి అనుగుణమైన మాటయే. సందేహం లేదు. ఆ పండితుడు ” శంకర భాష్యం లో…” అని అన్నప్పుడు ఆయన ఆ వ్యాఖ్య చేయకుండా ఉంటే ఉచితంగా ఉండేది.

అప్పట్లో మిత్రుడు వివేకానందం ” యువ భారతి” సాహిత్య సంస్థకు కార్యదర్శి. ఆ సంస్థ ఏడాదికి ఒకసారి ఒక ప్రత్యేక అంశాన్ని తీసుకుని దానిపై కార్యక్రమ పరంపర నిర్వహించేది. ఆ ప్రసంగ పరంపరను పుస్తక రూపంలో ప్రచురించేది. అలా వచ్చినవే ” కావ్య లహరి” వగైరాలు. స్వామివారు హైదారాబాద్ లోనే ఉన్నారు కనుక శంకరుల సాహిత్యం పై అలాటి కార్యక్రమం చేస్తే బాగుంటుందని నేనూ, వివేకానందం అనుకున్నాం. స్వామివారి దగ్గర ప్రస్తావించి, శంకరుల గ్రంథాలలో వేటిని స్వీకరించాలి, వాటిపై ఎవరు ప్రసంగించాలి అనే నిర్ణయం వారికే వదలి వేశాం. స్వామి వారు జాబితా ఇచ్చారు.

శంకరులు అద్వైత వేదాంతి. శుద్ధ ఙ్ఞాన మార్గం అది. అయితే శంకరుల పేరిట ” ప్రపంచసార తంత్రం” అనే తంత్ర గ్రంథం ఒకటి ఉంది. కొంతమంది అది శంకరుల రచన అని ఒప్పుకోరు. స్వామి వారు మాతో ” ప్రపంచసార తంత్రం’ పై ప్రసంగం ఉండి తీరాలి. దానిపై తుమ్మలపల్లి రామలింగేశ్వర రావు ప్రసంగిస్తారు” అని చెప్పారు. దానితో ” ప్రపంచసార తంత్రం” శంకరుల రచన అని పీఠాధిపతుల ఆధికారిక ముద్ర పడినట్లు అయింది. ఆ ప్రసంగ పరంపర ప్రారంభోపన్యాసం వారే చేశారు కూడా. ఆ ప్రసంగ పరంపర ” జగద్గురు  సాహితీ లహరి” పేరిట ప్రచురితం అయింది. ఆ గ్రంథం చూసి స్వామివారు ఎంతో ఆనందించారు. మమ్మల్ని ఆశీర్వదించారు. చాలదూ మాలాంటి పరమ లౌకిక జీవులకు?

” హైకోర్టుకు హాజరు” రేపు..


Leave a comment