స్వీయ అన్వేషణ – 37
హైకోర్టుకు హాజరయ్యాను…ఒక కేసు విషయంలో… కేసు నా మీద కాదు… అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మీద. ఆయన రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని, పాలన అస్తవ్యస్తం చేశారని ఒక కాంగ్రెస్ సభ్యుడు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో కేసు వేశారు. నేను అప్పుడు రేస్ కోర్స్ రోడ్ లో కాగజ్ కార్ఖానా దగ్గర ఉండేవాడిని. హై కోర్టుకు దగ్గర. నేను ఆంధ్ర పత్రిక లో సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నాను. అంటే నాది డెస్క్ జాబ్ కానీ, ఫీల్డ్ జాబ్ అంటే రిపోర్టింగ్ తో నిజానికి నాకు సంబంధం లేదు.
కానీ… చిన్నప్పటి నుంచీ లా పుస్తకాల లెదర్ బైండ్స్ వాసనల మధ్య పెరిగాను. ఇద్దరు తాతలు లాయర్లు, తండ్రి మెజిస్ట్రేట్. వాసన ఎక్కడికి పోతుంది?
దానికి తోడు ఆ కేసులో హేమాహేమీలు అయిన లాయర్లు వాదించబోతున్నారు. కోర్టుకు సహకరించడానికి ప్రముఖ సీనియర్ న్యాయవాది శ్రీ పరాశరన్ ” ఎమికస్ క్యూరీ”గా వస్తున్నారు. ఈ పరాశరన్ గారే ఇటీవల అయోధ్య రామాలయం కేసులో సుప్రీం కోర్టులో 90 ఏళ్ల వయసులో, ప్రధాన న్యాయమూర్తి ఆయన వయసు దృష్ట్యా కూర్చుని వాదనలు వినిపించమన్నా కూడా నిరాకరించి, ఏడెనిమిది గంటల పాటు నిలబడే ఏకధాటిగా వాదనలు వినిపించిన మహానుభావుడు! ఆయనను చూడాలని, వినాలని నా సరదా.
అందుకని ఎడిటర్ రాజగోపాలరావు గారిని రిక్వెస్ట్ చేసి రిపోర్టింగ్ కి వెళ్ళాను. ఉదయం కోర్టు ప్రారంభం అయినప్పటి నుంచి మధ్యాహ్నం లంచ్ టైమ్ వరకూ నేనూ, ఆ తరువాత కోర్టు సమయం ముగిసేవరకూ సీనియర్ రిపోర్టర్ వేణుగోపాల్ రిపోర్టింగ్ చేసే వాళ్ళం. నా రిపోర్ట్ ఈవెనింగ్ ఎడిషన్ కి అందించేవాడిని.
అప్పుడే ప్రముఖ న్యాయవాదులు రామ్ జెఠ్మలానీ, శోధి, గోపాల సుబ్రహ్మణ్యం, రామచంద్ర రావు వంటి వారి వాదనలు, పరాశరన్ ఆ వాదనలలోని లోతుపాతులను విశ్లేషిస్తూ కోర్టుకు సహకరించిన విధానం ప్రత్యక్షంగా వినే అవకాశం కలిగింది. దాని వల్ల అప్పటివరకూ నాకు తెలియని రాజ్యాంగ విషయాలు, వాటిలోని మర్మాల గురించీ తెలుసుకొనే అవకాశం కలిగింది. రామ్ జెఠ్మలానీ వేసే మెలికలు, షోధి దురుసు వాదనలు, రామచంద్రరావు తెలివితేటలు, గోపాల సుబ్రహ్మణ్యం వైదుష్యం, అన్నిటికీ పరాశరన్ అందించే క్లారిటీ ఎప్పటికీ మరచి పోలేని అనుభవం అది. అనంతర కాలంలో రామచంద్ర రావు అడ్వకేట్ జనరల్ అయ్యారు. గోపాల సుబ్రహ్మణ్యంను కేంద్ర ప్రభుత్వం సొలిసిటర్ జనరల్ గా నియమించింది.
ఆ కేసు వాదనలు విన్న తరువాత నుంచీ పరాశరన్, గోపాల సుబ్రహ్మణ్యం వాదించే కేసులను క్లోజ్ గా ఫాలో అయేవాడిని. ఆ “రుచి”తోనే ఇప్పుడు సుప్రీం కోర్టు న్యాయవాది సాయి దీపక్ ను ఫాలో అవుతున్నాను. ఈ సాయి దీపక్ లో భవిష్యత్ పరాశరన్ కనిపిస్తున్నారు నాకు.
“నా వారసుడు గోపాల సుబ్రహ్మణ్యం” అన్నారు పరాశరన్ కోర్టు బయట మాతో మాట్లాడుతూ. న్యాయ శాస్త్ర విశ్లేషణలో అది నిజమే అయింది. అలాగే ఆయన ధార్మిక నిబద్ధతకు సాయి దీపక్ వారసుడు అవుతారేమో? చూద్దాం.
“ఆయనే ఈయన…!” రేపు…
Leave a comment