“ఆయనే ఈయన!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 38

రాజమహేంద్రవరం లో ఉన్న కాలంలో ” విజయ” మాస పత్రిక చదివేవాడిని. ఆ మాస పత్రికకు అనుబంధంగా ఒక నవల కూడా ఉండేది. వాటిలో చాలా చారిత్రక నవలలు వచ్చాయి. ” యుగంధర”, ” చాణక్య” “అప్పాజీ”, ” పేష్వా నారాయణరావు వధ “… ఇలా ఎన్నో నవలలు అనుబంధంగా వచ్చాయి. వాటి రచయిత ” ప్రసాద్”. ఆ నవలలో చారిత్రక అంశాల సాధికారత ఎంత అనేది ప్రశ్నార్థకమే…కానీ… వాటిలో ఉద్దేశ్యం, ఎమోషన్స్ అన్నీ మన చరిత్ర పట్ల ఆసక్తిని పెంచేవిగా ఉండేవి. ప్రవాహ సదృశంగా సాగే వచనం, సంభాషణల్లో గాఢత నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

తరువాత ఆంధ్ర పత్రికలో చేరాను. ఒకరోజు సాయంత్రం డే షిఫ్ట్ ముగించుకున్న వాళ్ళం అందరం బయటకు వచ్చాం. హోరున వాన కురుస్తోంది. వేచి ఉండాల్సి వచ్చింది.  అక్కడే నిలబడి మాట్లాడుకుంటున్నాం. నవలా సాహిత్యం మీద మంచి పట్టున్న ప్రసాద్ గారు ( సీతాఫలం మీద  అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన) “తెలుగులో చారిత్రక నవలలు అంత బాగా రాలేదు, వచ్చినవి కూడా అంత బాగా రాయలేదు. వాటిలో కాల్పనికత ఎక్కువ” అన్నారు. నేను చదివిన విజయ అనుబంధ చారిత్రక నవలలు గుర్తుకు వచ్చాయి. వాటిని ప్రస్తావించాను… ” విజయలో అనుబంధంగా చాలా వచ్చాయి. బాగున్నాయి కూడా!” అన్నాను.

“అవి ఎవరు రాశారో తెలుసా?” అన్నారు.

“ఎవరో ప్రసాద్” అన్నాను.

“ఆ ప్రసాద్ ఎవరో తెలుసా?” అని అడిగారు సుందరేశ్వర రావు గారు.

” తెలియదు” అన్నాను.

అక్కడ స్తంభానికి ఆనుకుని గుప్పు గుప్పున చుట్ట పొగ వదులుతూ మా మాటలు వింటున్నారు రామ్ ప్రసాద్ గారు.

” అదుగో… ఆ మహానుభావుడే… ఆ చుట్ట కాలుస్తూ ఏమీ పట్టనట్టు నిలబడ్డారే రామ్ ప్రసాద్ గారు… ఆయనే ఆ నవలలు రాసిన ప్రసాద్” అన్నారు సుందరేశ్వర రావు గారు.

నాకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. అప్పటికి నేను ఆంధ్ర పత్రికలో చేరి దాదాపు ఏడాదిన్నర గడచిపోయింది… నాకు తెలియకుండానే నా “అభిమాన రచయిత”తో కలసి సన్నిహితంగా పని చేస్తున్నానా? ” అప్పాజీ” అనే ఒకే ఒక్క నవలతో నన్ను ప్రభావితం చేసిన రచయితతో కలసి పని చేస్తున్నానా?

తామరాకు మీద నీటి బొట్టులా ఉన్నారు ఇదంతా వింటూ రామ్ ప్రసాద్ గారు.

“మీరే అని నాకు తెలియదు సర్! సారీ!” అన్నాను.

“అన్నీ చదివేశావా?” అని అడిగారు.

” చదివాను” అన్నాను.

” ఏదో రాసి పారేశాను అప్పట్లో” అని చుట్టను ఆస్వాదిస్తూ ఉండిపోయారు.

ఆ రోజు నుంచి ఆయన మరింత సన్నిహితులు అయిపోయారు. ఎంతైనా నా “అభిమాన రచయిత” కదా! నేను మరచిపోలేని వ్యక్తులలో ఆయనా ఒకరు.

” క్రొత్త ఆఫీస్… క్రొత్త మనుషులు” రేపు…


Leave a comment