స్వీయ అన్వేషణ – 39
బషీర్ బాగ్ లోని ప్యాలెస్ ను జారవిడుచుకున్న తరువాత ఆంధ్ర పత్రిక దోమల్ గుడా లోని ఒక ఇంటికి మారింది. రాజభవనం లో బ్రతికిన మనిషి పూరి గుడెసిలోకి మారినట్టు అనిపించింది. “కాలో హి దురతిక్రమః!”
ఇక్కడికి మారే వరకూ ప్రశాంతంగా ఉన్న ఆంధ్ర పత్రిక వాతావరణం కొద్ది రోజులకే మారిపోయింది. అప్పటివరకూ లేని “రాజకీయాలు” ప్రవేశించి వాతావరణాన్ని కలుషితం చేశాయి.
ఇక్కడికి మారిన కొన్ని నెలలకు ఆంధ్ర పత్రికలో కొన్ని సంస్కరణలు జరిగాయి. రెసిడెంట్ ఎడిటర్ గా రాజగోపాలరావు గారు ఉన్నారు. పత్రికకు నూతన జవసత్వాలు కలిగించాలనే ఉద్దేశ్యంతో యాజమాన్యం కొంతమంది క్రొత్త వారిని నియమించింది. ఆ నియామకాల్లో క్రొత్తగా ” న్యూస్ ఎడిటర్” అనే పోస్ట్ కల్పించారు. ఆ స్థానంలో డాక్టర్ అంబటి సురేంద్ర రాజు ( అసురా) నియమితులు అయ్యారు. ఆయన నియామకం రాజగోపాల రావు గారిలో ఒక ” అభద్రతా భావా” నికి తావు ఇచ్చింది.
“అసురా” ను వెళ్లగొట్టాలని ఆయనపై అనేక ఫిర్యాదులు వెళ్లాయి యాజమాన్యానికి. చివరికి ఆయన క్యారెక్టర్ ను చంపేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. తెలిసినా బయటకు చెప్పలేని పరిస్థితి. అయితే అవేవీ ఫలించలేదు.
నాకు ” జాగృతి” పత్రిక ఎడిటర్ రామమోహన రావు గారు బాగా సన్నిహితులు అయారు. రాజమండ్రి లో ఉన్నప్పుడు నా కార్యకలాపాలు చెప్పాను కదా? జాతీయ సాహిత్య పరిషత్, జాగృతి ఒకే చెట్టు కొమ్మలు. కాగా జాతీయ సాహిత్య పరిషత్ ప్రముఖులలో ఒకరైన డాక్టర్ కొత్తపల్లి ఘనశ్యామల రావు గారు కూడా రాజమండ్రిలో ఉండగానే సన్నిహితులు అయ్యారు. రాజమండ్రి వచ్చినప్పుడు మా ఇంటిలోనే ఉండేవారు. ఆయన వల్లనే ప్రసాదరాయ కులపతి మంత్ర సాధన గురించి తెలిసింది. అంతేకాదు… ఘనశ్యామల ప్రసాదరావు గారు ఆయన దగ్గర “శ్రీ లఘు శ్యామలా మంత్రం” ఉపదేశం పొందారని కూడా తెలిసింది.
ఆయన ద్వారా రామమోహన రావుగారు మరింత దగ్గర అయ్యారు. ఘనశ్యామల రావు గారు అగస్త్య పండితుని ” బాల భారతం” పై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఆ పరిశోధన కాలంలో అనేకసార్లు ఆయన అమలాపురం నుండి రాజమండ్రి వచ్చి మా ఇంటిలో రెండు మూడు రోజులు ఉండేవారు. మేమిద్దరమూ ఆ కావ్యం గురించి చర్చించుకునే వాళ్ళం. అప్పటివరకూ ఆయన వ్రాసిన దానిపై చర్చ జరిగేది. ఆయన చేసిన కొన్ని నిర్ణయాలతో నేను ఏకీభవించలేదు. వాటిపై వాదన జరిగేది. మొత్తం మీద దాదాపు ఎనభై శాతం నా వాదనను అంగీకరించి తన నిర్ణయాలను మార్చుకునే వారు… సహృదయుడు కదా! ఆ పరిశోధన గ్రంథం అచ్చయి, ఆవిష్కరణ సభ హైదారాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది. ఆ గ్రంథ పరిచయ కర్తలలో నేను కూడా ఒకడిని ఆ సభలో. నిజానికి ఆ సభలో నేను మాట్లాడను అన్నాను. “ఎందుకు?” అని అడిగారు ఘన శ్యామల ప్రసాదరావు గారు. ” మీ పరిశోధన నిర్ణయాలలో కొన్నిటితో నేను ఇప్పటికీ ఏకీభవించనని మీకు తెలుసు కదా? నేను మాట్లాడితే అవి కూడా మాట్లాడుతాను. అది సభ వాతావరణాన్ని పాడు చేస్తుంది. వద్దు” అన్నాను. ” నువ్వు ఏమి మాట్లాడుతావో మాట్లాడు. నేను జవాబు చెబుతాను” అన్నారు. “సరే” అన్నాను. నేను అనుకున్నవి మాట్లాడాను. సమాధానాలు రాలేదు! అయినా ఆయనకు నా మీద అభిమానం, ఆప్యాయత ఏ మాత్రం తగ్గలేదు!
ఒకసారి జాగృతి కార్యాలయంలో ఒక సమావేశం జరిగింది. ఆ సిద్ధాంత నిబద్ధత కలిగిన పాత్రికేయులు సమావేశం అయ్యారు. పత్రికా రంగంలో “వామపక్ష భావాలు” కల వారు అధికంగా ఉన్నారు. “మనవాళ్ళు” తక్కువగా ఉన్నారు. ఈ పరిస్థితి మారాలి. “మనవాళ్ళు” కూడా అధికంగా పత్రికా రంగంలోకి రావాలి. దానికి ఇప్పటికే పత్రికా రంగంలో ఉన్నవారు పూనుకోవాలి. అవకాశాలు ఉన్న చోట “మన” వాళ్ళని ప్రవేశ పెట్టాలి. ఇదీ ఆ సమావేశంలో అనుకున్న మాట. అందులో భాగంగానే ఆంధ్ర పత్రికలో సబ్ ఎడిటర్ ట్రెయినీలు అవసరం అయినప్పుడు రేమిళ్ల అవధాని, బాల భాస్కర్ లను ప్రవేశ పెట్టాను. అయితే వారు ఆ ఉద్యోగానికి పెట్టిన పరీక్షలో పాస్ అయిన తరువాత మాత్రమే! పాస్ కాని మరొకరి ఇద్దరిని తీసుకోలేదు. రామమోహన రావు గారికి చెప్పేశాను కూడా… వీళ్ళు ఇద్దరూ పనికి రారని.
నిజానికి ఇది నిరుపయోగ ప్రయోగం, ప్రయత్నం. “మనవాళ్ళు” పత్రికలలో చేరినా ఏ స్థాయిలో చేరుతారు? సబ్ ఎడిటర్, రిపోర్టర్ ట్రెయినీలుగా చేరుతారు. వారు ఏ విధంగానూ ప్రభావితం చేయలేరు. వారు వారి వారి ఉద్యోగాలు నిలబెట్టుకోవడానికే ఏడాది కాలం గడిచిపోతుంది. ఆ తరువాత కూడా వారు ఏ విధంగానూ “పాలసీ నిర్ణయాల”ను ప్రభావితం చేయలేరు. అప్పటికే పత్రికా రంగంలో స్థిరపడి ఉన్నత స్థానాలకు చేరుకున్న ” సో కాల్డ్ వామపక్ష వాదులు” చెప్పినట్టే చేయాలి. కాదని వీరు ఏమైనా వ్రాసినా అది బుట్ట దాఖలు అవటం ఖాయం. కనుక క్రింది స్థాయిలో ” మనవాళ్ళు” ప్రవేశించి అలాటి ఉన్నత స్థానానికి చేరేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తి అయిపోతుంది. కనుక ” మన వాళ్ళు” ఎడిటర్ స్థాయిలో ఉంటే తప్ప అనుకున్నది సాధ్యం కాదు. ఆ స్థాయిలో వుంటే ఎలా ఉంటుందో వాకాటి పాండురంగ రావు గారు, ఎం.వి.ఆర్. శాస్త్రి గారు చేసి చూపించారు.
క్రొత్త చోటుకి ఆఫీస్ మారిన తరువాత జాతీయ సాహిత్య పరిషత్ లో నా కార్యకలాపాలు పెరిగాయి. ప్రతి బుధవారం నాకు వీక్లీ ఆఫ్. దాదాపుగా ప్రతి బుధవారం నేను తెలంగాణా ప్రాంతంలో అనేక ఊళ్లలో కార్యక్రమాలకు హాజరై ప్రసంగించే వాడిని. అలా ఈ ప్రాంతంలోని జాతీయ సాహిత్య పరిషత్ ప్రముఖులు ఎందరో సన్నిహితులు అయారు. ఆ సంస్థ రాష్ట్ర మహాసభలలో కూడా ప్రసంగించే అవకాశాలు కలిగాయి.
అలా పాలమూరులో జరిగిన రాష్ట్ర మహాసభలు నేను మరచిపోలేనివి. ఆ సందర్భంలోనే రాష్ట్ర జాతీయ సాహిత్య పరిషత్ కు ” వెన్నెముక” వంటి భండారు సదాశివరావు గారి పరిచయం కలిగింది. నాకు పాన్ వేసుకునే అలవాటు ఉన్నట్టే ఆయనకూ ఉంది. దానికి ఆయన పెట్టిన పేరు ” జ్ఞాన గుళిక!”
పాలమూరులో రాష్ట్ర మహాసభల సందర్భంలో నా ప్రసంగాంశం ” ప్రబంధ సాహిత్యం – సామాజిక సందేశం”. ప్రధానంగా పెద్దన గారి మనుచరిత్ర ఆధారం చేసుకుని, మిగిలిన ప్రబంధాలను స్పృశిస్తూ ప్రసంగాంశం సిద్ధం చేసుకున్నాను. ఇంకా వారం రోజులు సమయం ఉంది. ఒకసారి విశాలాంధ్ర బుక్ హౌస్ కు వెళ్లాను. అక్కడ ఒక పుస్తకం కనిపించింది. రష్యా ఏక ఖండంగా ఉన్న రోజులలో ” ఈస్తటిక్ కాంగ్రెస్ ” పేరుతో సదస్సులు జరిగేవి. ఆ సదస్సులో వక్తలు సమర్పించిన పత్రాలను పుస్తకంగా ప్రచురించేవారు. అదీ ఆ పుస్తకం.
దానిలో ఇరినా కులికోవా అనే వక్త సమర్పించిన పత్రం నన్ను బాగా ఆకర్షించింది. దానిలో మొదటి పేరాలోనే ” Literature , first and foremost, satisfies ones spiritual needs rather than material needs” అని ఉంటుంది. “సాహిత్యం ముందుగా ఒక వ్యక్తి లౌకిక అవసరాల కన్నా ఆధ్యాత్మిక/ ఆత్మిక అవసరాలను తీరుస్తుంది!”
చాలు…అనిపించింది. ఆ పుస్తకం తీసుకున్నాను. రెండు రోజులలో మొత్తం పూర్తి చేశాను. ” ప్రబంధ సాహిత్యం – సామాజిక సందేశం” అనే నా ప్రసంగాంశానికి ” క్రొత్త వెలుగు దారి” దొరికింది. అంతకుముందు నేను సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రక్కన పారేశాను.
ఆ సభలలో కమ్యూనిస్టు రష్యా లోని వక్తలు చెప్పిన అంశాలను మన ప్రబంధ సాహిత్యానికి అన్వయించాను. భండారు సదాశివరావు గారు ఆ ప్రసంగం విని చాలా సంతోషించారు. ” జాతీయ సాహిత్య పరిషత్ కు బ్రహ్మాస్త్రం లాంటి పుస్తకం ఇచ్చావయ్యా!” అని భుజం తట్టారు. అప్పుడు నేను అన్న మాట ఇప్పటికీ వర్తిస్తుంది… ” ఏం లాభం సర్! మనవాళ్ళు చదవరు కదా?” అని నా మాట.
జాతీయ సాహిత్య పరిషత్ జాతీయ భావాలను ప్రచారం చేసే భారతీయ సాహిత్య అధ్యయన, ప్రచారాలకు ఏర్పడినది. దాని కార్య ప్రణాళిక బాగానే ఉండేది కానీ ప్రముఖులలో కూడా చాలా కొద్దిమంది తప్ప మిగిలిన వారు ఎవరూ ఇతర సాహిత్యాలను అధ్యయనం చేసేవారు కారు. అందులోనూ పుస్తకాలు ఇంగ్లీషులో ఉంటే వాటిని ” అంటరాని” వాటిగా చూసేవారు. అందువల్ల జాతీయ సాహిత్య పరిషత్ తన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వచ్చే విమర్శలకు సమాధానాలు చెప్పుకునే ” డిఫెన్సివ్ మోడ్” లోనే ఉంది… ఇప్పటికీ! ప్రపంచ వ్యాప్తంగా వెలువడుతున్న సాహిత్య అధ్యయనం ఇలాటి సంస్థలకు అవసరం. అంతేకాదు, తమ సిద్ధాంతానికి విరుద్ధ సిద్ధాంతాల ప్రభుత్వాలు ఉన్న దేశాలలోని సాహిత్య అధ్యయనం అత్యవసరం కూడా. మన సాహిత్య సిద్ధాంతాలలో “తప్పులు వెతికి” లేదా ” ఆపాదించి” విమర్శించేవారికి సమాధానాలు చెప్పుకుంటూ కూర్చోవటమే కానీ వారి సాహిత్యంలో ఉన్న లొసుగులు బయట పెట్టే “చేవ” సాధించుకోక పోవటం మన బలహీనత.
” అసురా ఇచ్చిన ఆసరా!” రేపు
Leave a comment