“అసురా ఇచ్చిన ఆసరా!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 40

నాకు ఒక అపనమ్మకం ఉండేది. జర్నలిస్టులు అనబడే “పదార్ధాల”కు మన ప్రాచీన సాహిత్యంతో సంబంధం లేదని! ఈ విషయంలో వారు “స్వచ్ఛమైన నిరక్షరాస్యులు” అని!

ఆంధ్ర పత్రిక దోమల్ గుడాకు మారింది… క్రొత్త ఉద్యోగులు చేరారు. వారిలో న్యూస్ ఎడిటర్ గా చేరిన హోమియో డాక్టర్ అంబటి సురేంద్ర రాజు ఒకరు. “అసురా” అని పిలుపు అని తరువాత తెలిసింది. ఈయన విషయంలోనూ మొదట అదే అభిప్రాయం నాది.

కొన్నాళ్ళ తరువాత సాయంత్రం పూట చాయ్ త్రాగటానికి వెళ్ళేవాళ్ళం. అలా వెడుతున్నప్పుడు ఒకసారి మహాభారత ప్రస్తావన వచ్చింది. ఆ సందర్భంలో “అసురా” ఒక మాట అన్నారు… ” సర్పయాగం మనిషి మృత్యువును జయించటానికి చేసిన ప్రయత్నానికి ప్రతీక!” అని. ఒక్కసారి ఆయనను చూశాను. ” ఈ మనిషిని అంత తేలికగా తీసుకోకూడదు” అనుకున్నాను.అలా చాలా సాయంత్రాలు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన మీద నా అభిప్రాయం మార్చుకున్నాను.

అలాటి సాయంత్రాలలోనే ఒకసారి శేషేంద్ర ప్రస్తావన వచ్చింది. శేషేంద్ర పెద్ద కుమారుడు వనమాలి “అసురా”కు స్నేహితుడట. అలా అలా మాటలు శేషేంద్ర కవిత్వం వైపు మళ్ళాయి. “శేషేంద్ర కవిత్వం ఆధునికం ఏమీ కాదు. అది అంతా వైదిక ప్రతీకలే! సంధ్యావందనంలోని మంత్రాల భావంతో సహా, ఉపనిషత్తులు, అధర్వ వేద సూక్తాలు అందులో ఇమిడి ఉన్నాయి!” అన్నాను.

” అవునా? ఎలా?” అని అడిగారు అసురా.

కొన్ని ఉదాహరణలు చెప్పాను.

ఇక్కడ ఒకే ఒక ఉదాహరణ చెబుతాను… ” సూర్యుడు జనాలను  పనులలో ప్రేరేపిస్తున్నాడు” అంటాడు శేషేంద్ర. ” మిత్రో జనాన్ యాతయతి” అంటుంది సంధ్యా వందన మంత్రం. రెండూ ఒకటేగా? తేడా ఏముంది చెప్పండి?

” రాయండి మరి ఇవన్నీ” అన్నారు.

” రాస్తాను సరే వేసేవాడు ఎవరు?” అన్నాను.

” నేను వేస్తాను. రాయండి” అన్నారు.

అలా వచ్చిన వ్యాసాలే ” శేషేంద్ర ప్రతీకోపనిషత్తు”. నా ” మధుకశ” వ్యాస సంపుటిలో మొదటి వ్యాసాలు అవే. అంతే కాదు నేను వ్రాసిన సాహిత్య విమర్శ వ్యాసాలలో మొదటివీ అవే!

అలా “అసురా” నేను సాహిత్య విమర్శ వ్యాసాలు వ్రాయటానికి కారకుడు అయ్యారు. ఆయన “ఆసరా” వల్లనే అవి ఆంధ్ర పత్రిక దిన పత్రికలో  ప్రచురితం అయ్యాయి.

“అసురాజీ! థాంక్యూ!”

” అపార్థాలు – అపోహలు!” రేపు


Leave a comment