స్వీయ అన్వేషణ – 41
ఆంధ్ర పత్రిక కార్యాలయం మారిన కొంత కాలానికి యాజమాన్యం కూడా మారింది. కాశీనాథుని నాగేశ్వరావు పంతులు గారు స్థాపించిన పత్రిక, స్వాతంత్ర సంగ్రామం కాలంలో స్ఫూర్తి నింపిన పత్రిక, దానితో పాటుగా సాహిత్య – చారిత్రక – ఆర్థిక – రాజకీయాలతో పాటు వివిధ శాస్త్రాలకు సంబంధించిన మహత్తర మాస పత్రిక ” భారతి” ఆ కుటుంబం చేతి నుంచి జారిపోయాయి. యాజమాన్యం ఒక గొప్ప ” వారసత్వా”న్ని నిలబెట్టుకోలేక వేరే వ్యక్తులకు విజయవాడ లోని కార్యాలయ భవనంతో సహా అమ్మేసుకుంది. ఒకానొక కాలంలో రాజకీయ నాయకుల సమావేశ స్థలి, సాహిత్యకారులకు “అపర భువన విజయం” … ఆ భవనం చేజారిపోయింది.
క్రొత్త యాజమాన్యం వచ్చినప్పుడు మార్పులు సహజం కదా? మరికొంత మంది క్రొత్త వారిని తీసుకోవాలని తలచారు. అది కూడా సీనియర్ జర్నలిస్టులను తీసుకోవాలని అనుకున్నారు.
అప్పుడు ” సో కాల్డ్” హాస్యావధానిగా ఇప్పట్లో పేరు పొందిన శంకర నారాయణ ఉద్యోగం కోసం చూస్తున్నారు. అతడు కూడా ఒక సీనియర్ జర్నలిస్టు. నాకు పరిచితుడే. అప్పుడప్పుడే అష్టావధానాలలో ” అప్రస్తుత ప్రసంగం”తో ఆకట్టుకుంటున్నారు. అతడిని ఆ ” పాత్ర”లో పరిచయం చేసినది నా మిత్రుడు వివేకానందం.
ఎలాగూ క్రొత్త వారి కోసం… అందులోనూ సీనియర్ల కోసం… చూస్తున్నారు కనుక , ఇతడు ఉద్యోగం కోసం చూస్తున్నాడు కనుక, అతడికి ” ఇక్కడ అవకాశం ఉంది” అని చెప్పాను. అంతవరకే నేను చేసినది. అతడు దరఖాస్తు చేశాడు. క్రొత్త యాజమాన్యం ఇంటర్వ్యూ చేసి, నియామకం జరిపింది. అప్పుడు నేను రాజమండ్రి వెళ్ళాను.
నేను తిరిగి వచ్చేసరికి చక్రధర్ అనే మరొక వ్యక్తి నియామకం కూడా జరిగిపోయింది. పైగా అప్పటివరకూ ఆంధ్ర పత్రికలో ఉద్యోగాలు చేస్తున్న వారందరి పైనా “అజమాయిషీ” చేసే విధంగా ఆ నియామకం జరిగింది. అతడిని తీసుకు వచ్చినది శంకర నారాయణ! వారిద్దరూ స్నేహితులు.
శంకర నారాయణ నాకు పరిచితుడు కావటం, అతడు మరొకరిని తీసుకురావటంతో అప్పటివరకూ పని చేస్తున్న వారికి వీరిద్దరినీ నేనే తీసుకువచ్చాననే అపోహ కలిగింది. దానివల్ల అప్పటికే సీనియర్లు అయిన వారిలో అపార్థాలకి తావు ఏర్పడింది. అయితే అచిరకాలంలోనే ఆంధ్ర పత్రిక మూత పడిపోయింది. వచ్చిన ఇద్దరూ పని చేయకుండానే వెళ్ళిపోయే స్థితి! కానీ నా పై ఏర్పడిన అపోహ తొలగిపోవడానికి మాత్రం చాలా కాలం పట్టింది.
ఆంధ్ర పత్రిక మూత పడటానికి ముందు జరిగిన మరొక సంఘటన చెప్పడం చాలా అవసరం. ఆంధ్ర పత్రిక మూత పడటానికి ముందే నేను నా ఉద్యోగానికి ” రాజీనామా” చేసి వెళ్ళిపోయాను. అయితే నేను ఎందుకు రాజీనామా చేశాను అనేది స్పష్టం చేసి తీరాలి. ఎందుకు అంటే అప్పటి సంపాదకులు తనను గురించి ఒక సామాజిక మాధ్యమంలో వ్రాస్తూ నేను రాజీనామా ” వ్యక్తిగత కారణాలు” తో చేశానని వ్రాశారు. అది అబద్ధం మాత్రమే కాదు… ఆయన తాను చేసిన పనిని కప్పి పుచ్చుకోవటం కూడా! ఆయన చేసిన పనికి నిరసనగానే నేను రాజీనామా చేశాను కానీ వ్యక్తిగత కారణాలతో కాదు. అది కూడా ఒకానొక “సాహిత్య” సంబంధమైన వివాదం! “నిజం” గురించి తెలియాలి కనుక నా రాజీనామా కారణాలను వివరించి తీరాలి.
“నా మొదటి రాజీనామా…” రేపు
Leave a comment