“ఆంధ్ర పత్రికకు రాజీనామా”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 42

ఇది నా ఉద్యోగ జీవితంలోని రాజీనామాల పర్వంలో మొదటిది. నేను చేసిన ఉద్యోగాలు అన్నిటి నుంచీ… ఒక్కటి తప్ప… నా పై అధికారుల ధోరణి నచ్చక… నేనే రాజీనామా చేసి వదిలేశాను.

ప్రస్తుతం ఆంధ్ర పత్రిక రాజీనామా విషయం…

ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం ఒక సదస్సులో విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యంపై ఒక పత్రం సమర్పించారు. దాని శీర్షిక ” నవ్య సంప్రదాయ ప్రయోక్త విశ్వనాథ”. దీనిని ఆంధ్రపత్రిక దిన పత్రిక ప్రచురించింది. అప్పుడు సంపాదకుడు శ్రీరామమూర్తి. ఆ పత్రం ఆంధ్ర పత్రికలో ప్రచురించిన  తరువాత అప్పట్లో ప్రముఖ మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడు త్రిపురనేని మధుసూధనరావు ఆ పత్రంలోని విషయాలను విమర్శిస్తూ వ్యాసాలు వ్రాయటం ప్రారంభించారు. అవి ఆంధ్ర పత్రికలో ప్రచురించటం మొదలు పెట్టారు. ఇది ఆంధ్ర పత్రికకు అలవాటే.

ఒకప్పుడు శంభూప్రసాద్ గారి యాజమాన్యం నడుస్తున్న రోజులలో కూడా విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్షం పై విమర్శ వ్యాసాలు ” వ్రాయించి” భారతి మాస పత్రికలో ప్రచురించారు.( అప్పటి నుంచీ విశ్వనాథ వారికీ, ఆంధ్రపత్రిక కు ఉన్న అనుబంధం తెగిపోయింది. ఆ తరువాత ఆంధ్ర సాహిత్య చరిత్రను విశ్వనాథవారు పది రేడియో నాటకాలుగా వ్రాశారు. అవి ఆకాశవాణిలో ప్రసారం అయాయి. వాటిని భారతిలో ప్రచురించాలని అనుకున్నారు శంభుప్రసాద్ గారు. ఆయన స్వయంగా విశ్వనాథ వారి దగ్గరకు వెళ్ళి అనుమతి కోరవలసి వచ్చింది) అదే విధానం అనుకుంటా… ఇప్పుడు శ్రీరామమూర్తి అనుసరించారు. తాను  ప్రచురించిన వ్యాసానికి తానే ఖండన/ విమర్శ ” వ్రాయించి” ప్రచురించారు. ఋజువులు దొరకవు కానీ త్రిపురనేని చేత ఆయనే ఈ విమర్శ అడిగి మరీ వ్రాయించారని నా వ్యక్తిగత నమ్మకం. ఆయన ” సైద్ధాంతిక పక్ష వ్యామోహం” బహిరంగ రహస్యమే!

త్రిపురనేని విమర్శ నాకు చాలా ” దుర్విమర్శ” గా కనిపించింది. అప్పుడు నేను ఆయన వ్యాసాలకు ఖండన వ్యాసాలు వ్రాసి పంపటం మొదలు  పెట్టాను. కొన్ని ప్రచురితం అయిన తరువాత సంపాదకుడు శ్రీరామమూర్తి ఒక ప్రకటన చేశారు… త్రిపురనేని వ్యాసాలు కొనసాగుతాయి కానీ నా ప్రతివిమర్శను నిలిపి వేస్తున్నాం…అని! అదెలా?

నిలిపివేస్తే విమర్శ, ప్రతివిమర్శ రెండూ నిలిపివేయాలి. అంతే కానీ విమర్శను కొనసాగించి, దానికి ఖండనను నిలిపివేయటం ఏ ” పాత్రికేయ విలువ?”

అప్పటికే నేను మరికొన్ని ఖండన వ్యాసాలు సిద్ధం చేసి ఉన్నాను. వాటిని పంపాలా? వద్దా? సంపాదకుడు “ప్రతివిమర్శను నిలిపి వేస్తాము” అన్న తరువాత ఆ మనిషికి ఎలా పంపుతాం?

కనుక పరిస్థితిని తెలియ చేస్తూ, ఆ వ్యాసాలు అన్నిటినీ ఆంధ్ర పత్రిక యజమాని శివలెంక రాధాకృష్ణ గారికి పోస్ట్ చేశాను. చివరగా

“యథేచ్ఛసి తథా కురు!” అని ముగించాను.

కొద్ది రోజులకు నా ప్రతివిమర్శ ప్రచురణ మళ్ళీ మొదలైంది. వాటి ప్రచురణ మొదలైన రోజు కూడా శ్రీరామమూర్తి ఒక ప్రకటన చేశారు…

” సంపాదకుని ముగింపు నోట్ ను సైతం లెక్క చేయకుండా విరుచుకుపడ్డ ప్రతివిమర్శ ను కూడా ప్రచురిస్తున్నాము” అని!

అసలు ఒక విషయంపై వాద ప్రతివాదాలు, పరస్పర ఖండనలు జరుగుతున్నప్పుడు వారిద్దరిలో ఎవరో ఒకరు ” జితోస్మి” అని తప్పుకునే వరకూ సాగవలసిందే. సరే… పత్రికలలో అంత సుదీర్ఘ కాల అవకాశం ఉండదు… నిజమే. అప్పుడు ఏం చేయాలి? విమర్శను, ప్రతివిమర్శను రెండిటినీ ఒకేసారి నిలిపి వేయాలి… ఈ చర్చ ఇంతటితో నిలిపి వేస్తున్నాం… అని ప్రకటించాలి. అది ” సంపాదకుడు” అనే స్థానంలో ఉన్న వ్యక్తి చేయవలసిన పని.

కానీ … “సంపాదక శబ్ద వాచ్యుడు” అయిన ఈ “పెద్ద మనిషి” విమర్శను కొనసాగిస్తూ, ప్రతివిమర్శను నిలిపి వేస్తానని ప్రకటించి ” సంపాదక” స్థాయిని దిగజార్చాడు.

అటువంటి వ్యక్తి సంపాదకత్వంలోకి మహత్తర చరిత్ర కల ఆంధ్రపత్రిక పోవటం దురదృష్టకరం. సంపాదకుడు అనబడే ఆ వ్యక్తి అనుసరించిన ధోరణికి నిరసనగానే నేను ఆంధ్ర పత్రికలో నా ఉద్యోగానికి రాజీనామా చేశాను.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చింది! శ్రీరామమూర్తి ఈ మధ్యకాలంలో ఫేస్ బుక్ లో ” నా గురించి” అనే శీర్షికతో తన గురించి తాను వ్రాసుకుంటూ ఉన్నారు. దానిలోని ఒక భాగంలో ఈ ఉదంతాన్ని ప్రస్తావించారు. ఈ వాద వివాదాలలో చివరకి ఆంధ్రపత్రిక యజమాని కూడా కల్పించుకున్నారు అని వ్రాశారు. ఆ తరువాత  ” వల్లభాచార్యులు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశాడు” అని వ్రాశారు.

ఆంధ్ర పత్రిక యజమాని ఎందుకు కల్పించుకోవలసి వచ్చింది? ఆ మాట కప్పిపుచ్చారు! నేను చాలా స్పష్టంగా నా  రాజీనామా లేఖలో ” సంపాదకుని పక్షపాత వైఖరికి నిరసనగా నేను రాజీనామా చేస్తున్నాను” అని వ్రాశాను. దానిని ” వ్యక్తిగత కారణాల”తో రాజీనామా చేశానని వక్రీకరించారు.

జరిగిన వాస్తవాలను నిజాయితీగా వెల్లడిస్తే ఆయన చేసిన పని బయట పడుతుంది. అలా బయటపడితే సంపాదకునిగా ఆయన చేసిన పని తెలుస్తుంది కదా? శ్రీరామమూర్తి అనే ఈ వ్యక్తి తన సైద్ధాంతిక పక్షపాత ధోరణితోనే వ్యవహరించి “సంపాదక” స్థానానికి మచ్చ తెచ్చాడు అని నా వ్యక్తిగత అభిప్రాయం, నిష్కర్ష. అప్పటి ఆంధ్ర పత్రిక దిన పత్రికలు చూసిన వారికి ఇది ఖచ్చితంగా అర్థం అవుతుంది.

” బాలమురళి తో ఒక రోజు” రేపు…


Leave a comment