” బాల మురళి తో ఒక రోజు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 43

ఆంధ్రపత్రికలో నాకు కలిగిన ఒక గొప్ప అదృష్టం ఆధునిక వాగ్గేయకారుడు, సంగీత సామ్రాజ్య సార్వభౌముడు బాల మురళీకృష్ణ తో ఒక రోజంతా గడపటం!

రాజ గోపాలరావు గారు ఆంధ్రపత్రిక సంపాదకులుగా ఉన్న రోజులలోనే అదీ జరిగింది. ఒకరోజు ఆయన నన్ను పిలిచి ” మీరు మద్రాసు వెళ్ళాలి. బాలమురళి షష్టి పూర్తి. మీరు ఆయనను ఇంటర్వ్యూ చేసుకుని రావాలి” అన్నారు. అంతకన్నా అదృష్టం ఏముంటుంది? సరే అన్నాను.

నేను రాజమహేంద్రవరంలో ఉన్న కాలంలో అక్కడ బుగ్గా పాపయ్య శాస్త్రి గారు “శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి” ని స్థాపించి ప్రతి ఏటా త్యాగరాజ ఉత్సవాలు నిర్వహించేవారు. వారమో, పది రోజులో గుర్తు లేదు. ప్రతిరోజూ సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఒంటిగంట వరకూ సాగేవి ఆ కార్యక్రమాలు. సాయంత్రం ఆరు నుంచి ఏడు, ఏడున్నర వరకూ వర్ధిష్ణువులైన సంగీత కళాకారుల కచేరీలు, ఏడున్నర, ఎనిమిది నుంచి రాత్రి పదీ, పదిన్నర వరకూ ప్రఖ్యాత విద్వాంసుల కచేరీలు జరిగేవి. ఆ తరువాత హరికథలు. ఇలా సాయంత్రం ఆరు నుంచి రాత్రి దాదాపు ఒంటిగంట వరకూ మన మకాం ఆ కార్యక్రమాలు జరిగే హిందూ సమాజం ఆవరణలోనే.

ప్రఖ్యాత విద్వాంసులు ఈమని శంకర శాస్త్రి, బాల మురళి, ఆర్. కె. సూర్యనారాయణన్, గాయత్రి, రజని, కన్నైకుడి వైద్యనాథన్, ఎల్. సుబ్రహ్మణ్యం, లాల్గుడి జయరామన్, నూకల చిన సత్యనారాయణ, నేదునూరి కృష్ణమూర్తి, చిట్టిబాబు, ఎం.ఎస్. బాల సుబ్రహ్మణ్యశర్మ …ఇలా ఎందరో మహానుభావుల సంగీతసాగరంలో తేలియాడే వాళ్ళం. సంగీతంలో మెలకువలు తెలియవు… కేవలం ఆ నాదం, గాన వైఖరి అంతే. వారి కచేరీలు రికార్డు చేసుకోవటానికి అప్పట్లో ఒక టేప్ రికార్డర్ కూడా కొనుక్కున్నాం. ఆ టేప్స్ ఇప్పటికీ మా చెల్లెలు రజనీ కాంత దగ్గర భద్రంగా ఉన్నాయి.

ఆ సందర్భంలోనే బాలమురళి ప్రతి ఏడాదీ వచ్చేవారు. మా చిన్నాన్న అనంత తులసీ వేంకటాచార్యుల స్నేహితుడు రాంబాబు అని వుండేవారు. ఆయన ఇంటిలో బాలమురళి విడిది. మా చిన్నాన్న వెళ్ళేవాడు. వెళ్ళేటప్పుడు రెండు బాబా జర్దా పాన్లు తీసుకువెళ్ళి ఆయనకు ఇచ్చేవాడు. ” తాంబూల ద్వయ గౌరవం” అనుకుంటా. అలా రెండు సార్లో, మూడు సార్లో ఆయనతో వెళ్లి బాలమురళి దర్శనం చేసుకున్నాను. పట్టుమని పాతికేళ్ళు లేవు నాకు అప్పుడు. బాలమురళి స్వరం అంటే పిచ్చి వ్యామోహం…అంతే… ఇప్పటికీను.

అలాటి బాలమురళితో నా ఇంటర్వ్యూ.

నేనూ, నా మిత్రుడు వివేకానందం ఇద్దరమూ మద్రాసు చేరాము. ఆయన ఇంటికి వెళ్లాం. ” హైదారాబాద్ ఆంధ్రపత్రిక ఎడిటర్ రాజగోపాలరావు గారు పంపారు” అని చెప్పాను. ” అవును, ఫోన్ చేసి చెప్పారు మీరు వస్తారని, ఇంటర్వ్యూ కావాలని. కానీ ఇప్పుడు ఇంత హఠాత్తుగా ఇంటర్వ్యూ దేనికి?” అన్నారు. ” మీ షష్టిపూర్తి కదా?” అన్నాను. ఆయన నవ్వేసి ” No, I am entering sixty. Not completed!” అన్నారు. నాకు ఏమి చెప్పాలో తోచలేదు. మళ్ళీ ఆయనే ” సరేలెండి! ఎలాగూ వచ్చారుగా! రేపు పొద్దున్న ఏడున్నరకల్లా రండి ” అన్నారు. ” హమ్మయ్య అనుకున్నాను.

ఆ రోజు సాయంత్రం మెరీనా బీచ్ లో కొంచెం సేపు గడిపి, పార్థసారథి స్వామి గుడికి వెళ్లాం. ఆ తరువాత “ఈ గుడికి ఎందుకు వచ్చానురా దేవుడా?” అనిపించింది. దానికి కారణం నేను నాలుగో తరగతి చదువుతున్నపుడు దర్శించుకున్న పార్థసారథి ఇప్పుడు కనపడక పోవటమే. ఆ అనుభవాన్ని నేను వ్రాసిన ” పార్థసారథీ! పారిపో!” అనే కథలో వ్రాశాను. అది ఆంధ్ర ప్రభ దినపత్రిక అనుబంధంలో ప్రచురితం అయింది. అది నా రెండవ కథ. మొదటి కథ ” మెరీనా! ఓ మెరీనా!” కథ చాలా ఉంది. తరువాత చెబుతాను.

మరునాడు ఉదయమే వెళ్లాం. మనకి సాహిత్యంతో పరిచయమే కానీ సంగీతంతో  కాదు. ఎదురుగా ఒక దిగ్గజం! ఏమి అడగాలి? ఎప్పుడు సంగీతం నేర్చుకున్నారు? ఎన్ని కచేరీలు చేశారు? అవార్డులు ఏమిటి? చివరగా యువ గాయకులకు మీరిచ్చే సందేశం? వంటి రొడ్డ కొట్టుడు ప్రశ్నలు వేయటం ఏమిటి అలాటి వాడు ఎదురుగా దొరికితే?

ఒకటే ప్రశ్న…”బాల మురళి ఎవరు? బాలమురళి గురించి బాల మురళి ఏమి చెబుతాడు?”

ఈ ప్రశ్న అడిగినప్పుడు ఉదయం సుమారు ఎనిమిది గంటలు అయివుంటుంది. మాకు హైదారాబాద్ తిరిగి రావటానికి సాయంత్రం ఆరు గంటలకు రైలు. అయిదున్నర గంటలకు బలవంతంగా బయటకు వచ్చాం! ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం అయిదున్నర వరకూ ఆయన ఒక్కరే మాట్లాడారు. మరొక ప్రశ్న నేను అడగలేదు. నిజం చెప్పాలంటే బాలమురళి ఆ రోజు తన జీవితాన్ని నా ముందు పరిచేశారు… అది ఆయన ” ఆత్మ కథా గానం”. ఆయన జీవితంలో బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషాదాలు, అవమానాలు, తిరస్కారాలు… అన్నీ… ఆ రోజు ఆయన అంతరంగపు అగాధాలలో అణచి పెట్టుకున్నవి… అన్నీ ఆ రోజు నా ముందు ఒలకబోసుకున్నారు.

ప్రపంచం అంతా సన్మానించిన వ్యక్తి ఒక చిన్న పిల్లవాడు తన బాధలను కన్నతల్లికి చెప్పుకున్నట్టు చెప్పుకున్నారు ఆ రోజు.

ఇంక మేము బయలు దేరవలసిన సమయం వచ్చింది. మాకు అక్కడనుంచి కదలాలని లేదు… ఆయనకు ఇంకా ఏదో చెప్పుకోవాలని . కానీ ఏం చేస్తాం? లేచాం. ఆయన మాతోపాటు మేడ దిగి గేటు వరకూ వచ్చి, సాగనంపారు. చివరగా ఆయన అన్న మాట… ” నా గుండె బరువు అంతా దించుకున్నాను. థ్యాంక్స్!”

హైదారాబాద్ తిరిగి వచ్చి ఆ ” ఆత్మకథ” అంతా వ్రాసి ఇచ్చాను. ఆ రిపోర్ట్ ఆంధ్రపత్రిక దిన పత్రికకు అనుబంధంగా ఎనిమిది పేజీల టాబ్లాయిడ్ గా ప్రచురితం అయింది. నేను చేసిన మొదటి ఇంటర్వ్యూ… అదీ బాలమురళితో… నా దురదృష్టం ఏమిటంటే ఆ ప్రతి ఇప్పుడు నా దగ్గర లేదు!

” జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత” రేపు…


Leave a comment