స్వీయ అన్వేషణ – 44
నేను ఆంధ్రపత్రికలో పని చేస్తున్న రోజులలోనే డాక్టర్ సి. నారాయణ రెడ్డికి “జ్ఞాన పీఠ పురస్కార” వార్త వచ్చింది. ఆ వార్త చూడగానే నేను సంపాదకుడు రాజగోపాలరావు గారితో ” సర్! ఒక వ్యాసం రాస్తాను. ఈవెనింగ్ ఎడిషన్ కే వేద్దాం” అని అడిగాను. ఈ వార్త మిగిలిన దిన పత్రికలలో మరునాడు కానీ రాదు… ఏ దిన పత్రికకూ ఈవెనింగ్ ఎడిషన్ లేదు కాబట్టి. ఆంధ్ర పత్రిక ఈ వార్త ప్రకటించిన మొదటి దిన పత్రిక అవుతుంది.
” తళతళలాడే కవి” అనే శీర్షికతో వ్యాసం వ్రాశాను. నిజానికి ఇది నా మాట కాదు. తెలుగువారిలో మొట్ట మొదటి జ్ఞాన పీఠ పురస్కార ” విజేత” కవి సమ్రాట్ విశ్వనాథ వారు నారాయణ రెడ్డి గురించి అన్న మాట!
విశ్వనాథ వారు తెలుగు సాహిత్య చరిత్రను పది రేడియో నాటకాలుగా వ్రాశారని ఇంతకుముందు చెప్పాను కదా? ఆ పది నాటకాలలో చివరిది ” ఆధునిక యుగము”. దీనిలో హరి, గిరి అని రెండు పాత్రలు. ఆధునిక సాహిత్యం గురించి ఒకరు అడిగితే రెండవవాడు చెప్పటం ప్రణాళిక.
ఒక పాత్ర కోస్తా, సీమ ప్రాంతాల గురించి చెప్పాక, రెండవ పాత్ర ” మరి తెలంగాణమున కవులు లేరా?” అని అడుగుతుంది. దానికి రెండవ పాత్ర ఇలా చెబుతుంది…
” లేకేమి? నారాయణ రెడ్డి అని యొకడున్నాడు. అతడు తళతళ లాడు కవి. అచట ముషాహిరాలని జరుగుతవి. వాటి పంపిణీ మీద ఆతడు తన కవిత్వము నభివృద్ధి చేసికొనినాడు.” అని ఒకటి రెండు కావ్యాల గురించి చెప్పి…
” దాశరథియని మరి యొకడున్నాడు” అని చెప్పబోతూ ఉండగా రెండవ పాత్ర ” అతని గురించి నీవేమీ చెప్పనవసరము లేదు. ఆతని ” శిల్పి” పద్యములు చదువుము” అంటుంది.
దీనిలో దాశరథి ప్రస్తావన వదలి వేసి నారాయణ రెడ్డి వరకూ విశ్వనాథ వారు చెప్పినదే మొదట ఉంచి ఆ వ్యాసం వ్రాశాను. ” రెండవ జ్ఞానపీఠ పురస్కారం అందుకుంటున్న వ్యక్తి గురించి మొదట జ్ఞానపీఠ పురస్కారం అందుకొన్న వ్యక్తి చెప్పిన మాట” అని చేర్చాను.
నేను రాజమహేంద్రవరం లో ఉన్న కాలంలోనే నారాయణరెడ్డి ” కర్పూర వసంతరాయలు” చదివాను. నాకు అది నచ్చింది. తరువాత ” రామప్ప”, ” నాగార్జున సాగరం” చూశాను.
ఆ వ్యాసం ప్రచురణ అయాక రాజగోపాలరావు గారి ఆదేశం మేరకు ఆ పత్రిక తీసుకువెళ్ళి నారాయణ రెడ్డికి ఇచ్చాను. విశ్వనాథ వారిని ఉటంకించిన “తళతళలాడే కవి” ఆయనకు బాగా నచ్చింది. ఆయన అప్పుడు అక్కడ అందుబాటులో ఉన్న ఆయన ప్రచురణలు నాకు ఇచ్చారు.
నాకు ఒకటే ఆశ్చర్యం! ఇంతకీ విశ్వనాథ వారి తీర్పు ఏమిటి? నారాయణ రెడ్డిని ” తళతళలాడే కవి” అని, ” ముషాహిరాల పంపిణీ మీద కవిత్వము నభివృద్ధి చేసుకొని నాడు” అనీ, ” దాశరథి గురించి చెప్ప నవసరము లేదు. ఆతని శిల్పి పద్యములు చదువుము” అంటే ఏమిటి అర్థం? మీరే ఊహించుకోండి!
” నాడీ జ్యోతిషం కోసం…” రేపు
Leave a comment