స్వీయ అన్వేషణ – 45
ఆర్థిక ఇబ్బందులు ఎవరికి ఉండవు? అలాగే నాకూ ఉన్నాయి. ఉద్యోగం అయితే ఉంది ఆంధ్ర పత్రికలో. జీతం ఏ మూలకి? నేను ఆంధ్ర పత్రికలో చేరిన కొన్నాళ్ళకు కుటుంబం అంతా హైదారాబాద్ చేరింది. మా నాన్న ఎక్కడో ఉద్యోగం చేసేవాడు. అంటే రెండు సంసారాలు. నెలనెలా ఆయన పంపే డబ్బు ఏ మూలకు? నా జీతం పన్నెండు వందలు. ఇంటి అద్దె ఎనిమిది వందలు! ఆ సమయంలో ములుగు రాజేశ్వర రావు గారి వల్ల దూరదర్శన్ లో వార్తల అనువాదం పని దొరికింది. నెలకు పది రోజులు, వెయ్యి రూపాయలు! వేన్నీళ్లకు చన్నీళ్ళు.
ఇలా సాగిపోతూ ఉండగా అసలు మన జాతకం ఏమిటి? అనే ప్రశ్న వచ్చింది. నిజానికి నేను రాజమహేంద్రవరంలో వుండగానే జ్యోతిష రంగ ప్రవేశం చేశాను. అదొక కథ.
మా ఇంటి మేడ మీద షాపులలో వసంత బాబు అనే ఆయన అద్దెకు ఉండేవాడు. ఏదో ఫార్మా కంపెనీకి డిస్ట్రిబ్యూటర్. నాకు స్నేహితుడు అయాడు. అతని వల్లనే నేను చలం రచనలు ఒక పద్ధతిలో చదివాను. ఒకసారి ఎవరి కోసమో రైల్వే స్టేషన్ కి వెళ్ళాం. రైలు 20 నిమిషాలు ఆలస్యం అన్నారు. వసంత బాబు ” చూడు…సరిగ్గా 16 నిమిషాలకు వస్తుంది” అన్నాడు. ” వాళ్ళు 20 నిమిషాలు అంటే ఇంకా ఆలస్యం అయే ఛాన్స్ ఉంటుంది కానీ ముందే ఎలా వస్తుంది?” అన్నాను. “చూడు” అన్నాడు. సరిగ్గా 16 నిమిషాలకు రైలు ఔటర్ నుంచి వస్తోంది. మేము ఒక చోట నిలబడి ఉన్నాం. ” ఇప్పుడు చూడు… ఫలానా నంబర్ బోగీ మన ఎదురుగా ఆగుతుంది” అన్నాడు. సరిగ్గా అలాగే జరిగింది. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ” ఎలా” అని అడిగాను. ” కె.పి. మెథడ్” అన్నాడు. ” అదేమిటి?” అని అడిగాను. ” రేపు చెబుతాను” అన్నాడు. మరునాటి నుంచి వసంత బాబు నాకు కె.పి.మెథడ్ బోధించటం మొదలైంది. చాలా కాలం నేనూ తెలిసిన వారికి అడిగినప్పుడు ఫలితాలు చెప్పేవాడిని. కొంత కాలం గడచిన తరువాత నేను అది ఆపేశాను. చెప్పినవన్నీ జరుగుతున్నాయి…ఎప్పుడైనా తప్పితే? హీరోయిన్ లైమ్ లైట్ లో వుండగానే కావాలని రిటైర్ అయిపోయిన్నట్టు అక్కడితో ఆ అధ్యాయం ముగించాను.
ఇప్పుడు మళ్ళీ జ్యోతిషం వైపు దృష్టి మళ్ళింది. అయితే వదలి వేసిన విద్య. ఎవరిని సంప్రదించాలి?
మిత్రుడు వివేకానందం ఉన్నాడు. అతను తన కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అనేక మంది మంత్రవేత్తలను కలుస్తూ ఉండేవాడు. డాక్టర్ ప్రసాద రాయ కులపతి ఒకప్పుడు అతని ఇంటిలోనే అద్దెకు ఉండేవాడు. అతను ఒకసారి అమలాపురంలోని ఒక నాడీ జ్యోతిషుని కలిశాడు. ఒక రోజు రాత్రి ఆయనను కలిశాడు. సరిగా నాడీ పత్రం తీసే సమయానికి ఒక గుడ్లగూబ అరిచిందిట. వెంటనే ఆయన ఆపేసి, మరునాడు ఉదయం రమ్మన్నారు. అలాగే వెళ్ళాడు. పత్రం తీయగానే ” ఈ జాతకుడు నిన్న వచ్చినప్పుడు గుడ్లగూబ కూసింది” అంటూ మొదలైంది. ఆ నాడీ గ్రంథం సంస్కృతంలో ఉంది. ఆ నాడీ జ్యోతిష్యుడు బయాలజీ లెక్చరర్. సంస్కృతం రాదు అప్పటికప్పుడు శ్లోకం అల్లేసి చెప్పటానికి. సరే… ఆ రీడింగ్ అయింది. తిరిగి వచ్చిన వివేకానందం నాకు చెప్పాడు. ” ఇదేదో బావుంది. వెడదాం ఒకసారి” అన్నాను. ఒక రోజు వెళ్లాం.
ఒక ఉదయం ఆయనను కలిశాం. పత్రం తీసి చదవటం మొదలు పెట్టారు. నా పేరు, తల్లిదండ్రుల పేర్లు, నన్ను ఇంటిలో పిలిచే పేరూ అన్నీ వచ్చాయి. అవి కాక విచిత్రమైన విషయాలు వచ్చాయి. నాకు జర్దా పాన్ అలవాటు ఉంది. ” నువ్వు పద్యాలు వ్రాస్తావు. నాలుక మీద సరస్వతి ఉంటుంది. కానీ నువ్వు ఆ సరస్వతిని హింసిస్తున్నావు. ఆ అలవాటు మానేస్తే సరస్వతీ కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుంది” అంటూ, ” నువ్వు అమ్మవారి మీద ఆరు పద్యాలు వ్రాశావు. అవి ఇప్పుడు చదువు. ఆ తరువాత మాత్రమే మిగిలిన విషయాలు వస్తాయి” అన్నారు. చదివాను.
అప్పుడు ఆయన చదవటం మొదలు పెట్టారు… ” తెలుగు సాహిత్య రంగంలో ఇప్పుడు నారాయణ అనే పేరుతో ఇద్దరు కవులు అన్నారు. వారిలో ఒకరు వేద ధర్మాన్ని, జాతి సంస్కృతినీ నిలబెట్టడానికి వ్రాస్తున్నారు. రెండవ వారు ఆ ధర్మాన్ని నిరసించే వారు. అతనిని బయట పెట్టడమే నీ కర్తవ్యం! ఆ పని చేసి మళ్ళీ ఏడాది గడచిన తరువాత రా!
” నువ్వు జన్మతః వైష్ణవుడివి. కానీ ఆయనను వదలివేస్తున్నావ్. శివుని వెనుక పడుతున్నావ్. నువ్వు హరిద్వార్ వెళ్లి, గంగాస్నానం చెయ్. అది హరిద్వార్, హరద్వార్ కూడా. బదరీనాథ్ కీ, కేదార్ నాథ్ కీ కూడా అదే ద్వారం. అప్పుడే నీ సమస్యలు తీరుతాయి”
అక్కడితో రీడింగ్ అయిపోయింది. నేను వెళ్ళింది ఒకందుకు… ఆయన చెప్పినది వేరొకటి! నేను నా ఆర్థిక ఇబ్బందుల విషయం కోసం వెడితే మొత్తం సాహిత్యం గోల వచ్చింది. ఏం చేస్తాం? తిరిగి వచ్చేశాం.
ఆ తరువాత కొన్ని నెలలకు ఒక లెక్చరర్ కలిశారు. హిందీ, ఉర్దూ సాహిత్యాలలో మంచి ప్రవేశం ఉంది. మాటల్లో సి. నారాయణ రెడ్డి ప్రస్తావన వచ్చింది. ఆయన నాతో ” ఆలీ జాఫ్రీ వ్రాసిన ‘ నయీ దునియా కా సలామ్’ చదవండి. విశ్వంభర కి మూలం దొరుకుతుంది” అన్నారు. నాకు నాడీ జ్యోతిష్యుడు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. ఆలీ జాఫ్రీ పుస్తకం కోసం ఎంత ప్రయత్నించినా నాకు ఇప్పటికీ దొరకనే లేదు. అది దొరకలేదు కానీ వేరొక విధంగా నాడి లో చెప్పిన పని కొంత వరకూ జరిగింది! ఆ కథ తరువాత…
అలా నాడీ జ్యోతిషం ఒకందుకు వెడితే మరొక దారిలో నడిపించింది.
” సరి క్రొత్త అధ్యాయం ప్రారంభం!” రేపు
Leave a comment