స్వీయ అన్వేషణ – 46
ఆంధ్ర పత్రికలో మానివేశాక కొన్నాళ్ళు ఖాళీ… ఏం చేయాలో తెలియదు. అవి లోక్ సభ ఎన్నికల ప్రచారం మొదలు అవుతున్న రోజులు. జాగృతి సంపాదకులు రామమోహన రావు గారు పిలిచారు. వెళ్ళాను. అక్కడ పాత్రికేయ మిత్రుడు సదాశివ శర్మ కూడా ఉన్నాడు. ” బి జె పి వారు ‘ అయోధ్య ‘ అనే బులిటెన్ తీస్తున్నారు. మీరు ఇప్పుడు ఖాళీ గానే ఉన్నారు కదా? దానికి పని చేస్తారా?” అని అడిగారు. “సరే” అన్నాను.
పాత ఎం ఎల్ ఏ క్వార్టర్స్ లోని బి జే పి కార్యాలయంలోనే ఈ పని ప్రారంభం అయింది. సీనియర్ పాత్రికేయులు కందర్ప రామచంద్ర రావు గారు ” అయోధ్య” కు ఇంఛార్జ్. సదాశివ శర్మ అప్పుడు ఏదో దిన పత్రికలో పని చేస్తున్నాడు. వచ్చి వెడుతూ వుండేవాడు. అతనూ, నేనూ వచ్చిన వ్యాసాలను చూసి, ఎంపిక చేసేవాళ్ళం.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజీవ్ గాంధీ ఈశాన్య రాష్ట్రాలలో పర్యటిస్తూ తాము అధికారంలోకి వస్తే ఈశాన్య రాష్ట్రాలలో బైబిల్ ప్రకారం పాలన చేస్తామని ప్రచారం చేస్తున్న రోజులు. బి జె పి అయోధ్య ప్రధానాంశంగా ప్రచారం చేస్తున్న రోజులు. అక్కడ ఆంధ్ర పత్రిక అనుభవం పనికి వచ్చింది. దానికి తోడు రాజమండ్రిలో ఉన్న రోజులలోనే చదివిన బైబిల్ పనికి వచ్చింది.
ఇక్కడ కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఆంధ్ర పత్రికలో మానేశాక ఒక రోజు ఘన శ్యామలప్రసాద రావు గారు హైదరాబాద్ వచ్చారు. వాకాటి పాండురంగ రావు గారి ఇంటికి వెళ్ళాలని అన్నారు. మిత్రుడు వివేకానందం కి ఆయన ఇల్లు తెలుసు. ముగ్గురం వెళ్లాం. ఘనశ్యామ్ గారు ఆయనతో ఏవేవో విషయాలు మాట్లాడారు. నన్ను పరిచయం చేశారు. వారి సంభాషణ ముగిసింది. వాకాటి వారు నన్ను అడిగారు… ” ఎక్కడ పనిచేస్తున్నారు?”
” ఆంధ్ర పత్రికలో చేసే వాడిని. ఈ మధ్యనే మానేశాను” అన్నాను.
” మీకు డైలీ ఇష్టమా? వీక్లీ ఇష్టమా?” అని అడిగారు.
” సర్! నాకు వీక్లీ జర్నలిజం తెలియదు.” అన్నాను.
” సరే లెండి! కథలు ఏమైనా రాశారా?” అని అడిగారు.
” ఇప్పటి వరకూ ఒకటే రాశాను సర్!” అన్నాను.
” ఒకసారి తెచ్చి ఇవ్వండి. చూస్తాను” అన్నారు.
రెండు మూడు రోజుల తరువాత ఆ కథ ఆయనకు అందించాను. ఆ కథే ” మెరీనా! ఓ మెరీనా!”.
ఈ కథ వెనుక మరో కథ ఉంది. ఆంధ్ర పత్రికలో ఉన్నప్పుడే ఆంధ్ర ప్రభ కథల పోటీ ప్రకటించారు. దానికి వ్రాసి పంపిన కథ అది. మొదటి పేజీ పైన “R” అనే అక్షరం, దాని చుట్టూ ఒక రౌండు… తిరిగి వచ్చింది. “రిజెక్టెడ్”. ఆ మొదటి పేజీ తీసేసి మళ్ళీ రాసి పంపా. అలా ఆరుసార్లు అది తిరిగి రావటం, మళ్ళీ పంపటం! ఆ కథనే ఆయనకు ఇచ్చాను.
ఆ తరువాత ఒక రోజు వాకాటి వారు కబురు పెట్టారు. ” ప్రభ ఆఫీస్ కి వెళ్లి అక్కడ ఎం. వి. ఆర్. శాస్త్రి అని ఉంటారు. ఆయనను కలవండి. But, I am promising you nothing” అన్నారు.
వెళ్లి శాస్త్రి గారిని కలిసాను. చాలాసేపు మాట్లాడారు. ” అవసరమైతే కబురు చేస్తాను” అన్నారు శాస్త్రి గారు.
” అయోధ్య” లో పని చేస్తున్నప్పుడు శాస్త్రి గారి పిలుపు వచ్చింది. ” ఆంధ్ర ప్రభ సమ్మె జరుగుతోంది. ప్రస్తుతం మద్రాసు నుంచే వస్తుంది. మీరు మద్రాస్ వెళ్లి పని చేస్తాను అంటే వెళ్లి అక్కడ వాకాటి వారు ఉన్నారు… వారిని కలవండి” అన్నారు.
సరిగా అప్పుడే నన్ను పెంచిన మా చిన్న నాయనమ్మ కనకవల్లి గారు పోయారు. అదే చెప్పాను… ” ఇదీ పరిస్థితి. ఒకసారి రాజమండ్రి వెళ్లి, అక్కడ నుంచి మద్రాసు వెడతాను” అని. ఆయనా ” సరే” అన్నారు.
రాజమండ్రి వెళ్లి అక్కడ నుంచి మద్రాసు వెళ్లి ఇండియన్ ఎక్స్ప్రెస్ కార్యాలయంలో వాకాటి వారిని కలిశాను. అది 1991 మే 18. ( ఆంధ్ర పత్రికలో చేరిన తేదీ 1985 మే 8. ఈ “మే” నెలకు నా ఉద్యోగాలకు ఏదో లింక్ ఉన్నట్టుంది!) ఆయన ” ఇక్కడ కూర్చుని పని మొదలు పెట్టండి. శాస్త్రి గారు నెక్స్ట్ వీక్ వస్తారు” అన్నారు. అలా అంటూనే నాకు పని చెప్పటం మొదలు పెట్టారు. అది ఆంధ్ర ప్రభ వీక్లీ సెక్షన్!
వారం తరువాత శాస్త్రి గారు వచ్చారు. ” డైలీకి పంపితే వీక్లీలో సెటిల్ అయినట్టున్నావ్” అన్నారు. ” సర్! డైలీ అప్లికేషన్ మరచి పొండి.” అన్నాను. ఆయనా నవ్వేసి ఊరుకున్నారు. అలా ఆంధ్ర ప్రభ వీక్లీలో, వాకాటి వారితో ప్రయాణం మొదలైంది.
1985 నుండి 1991 వరకూ ఆంధ్ర పత్రికలో గడిపిన కాలం ఒక ఎత్తు, 1991 నుంచి 1998 మధ్య వరకూ సాగిన కాలం మరొక ఎత్తు! అక్కడ నేరుగా జనంతో సంబంధం లేని ఉద్యోగం. ఇక్కడ ప్రతి రోజూ కథా రచయితలు, కవులు, వ్యాస కర్తలు, సాహిత్య విమర్శకులు, పండితులు, సామాజిక విశ్లేషకులు… ఇలా ఎందరెందరినో నేరుగా కలిసే అవకాశం! నాకు ఇష్టమైన ప్రపంచం!
“బాపూ బొమ్మ దొరికింది!” రేపు…
Leave a comment