“బాపూ బొమ్మ దొరికింది!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 47

ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక… వాకాటి పాండురంగ రావు గారి సారధ్యంలో, సమ్మె కాలంలో మద్రాసు నుంచి ప్రచురితం అయేది. అక్కడ నేను చేరాను.

రాయపేట లో పాత ఉడ్ ల్యాండ్స్ హోటల్ ఉంది. సమ్మె కాలంలో హైదారాబాద్ నుంచి వెళ్లి పని చేస్తున్నవారు బస చేసినది అక్కడే.

లోపలికి ప్రవేశించగానే కుడి వైపు రెస్ట్రాంట్. దాటి ముందుకు వెళ్ళి కుడి వెైపు చూస్తే రెండు వరుసలుగా గదులు, వాటిని దాటి వెడితే అడ్డంగా మరికొన్ని గదులు, రెండు వరుసల గదుల మధ్య పొడవునా చిన్న డివైడర్, దానిలో రెండు పెద్ద పెద్ద రావి చెట్లు. ఈ గదుల వెనుక వైపు మరికొన్ని గదులు.

రెండు వరుసలుగా ఉన్న గదులలో ముందు ఒక చిన్న గది, దానిలో రెండు కుర్చీలు, ఆ గది వెనుక ఒక డబుల్ బెడ్, కుర్చీ, టేబుల్ తో మరొక గది, దాని వెనుక వాష్ రూమ్, దానిలో నీళ్ళతో పెద్ద గంగాళం, చెంబు.

ఇక ఆ రెండు వరుసల గదులను దాటి అడ్డంగా ఉన్న గదులలో ఒక్కొక్క దానిలో ఇద్దరికి వసతి, అన్ని గదులకూ కలిపి కామన్ బాత్ రూమ్, కామన్ టాయిలెట్.

హైదారాబాద్ నుంచి వచ్చిన  నళినీ మోహన్, పి.ఎస్.ఆర్. ఆంజనేయ శాస్త్రి, కె.ఎల్. రెడ్డి ( గతంలో ఆంధ్ర పత్రికలో పనిచేసిన వారే), నేనూ ఆ రెండు వరుసల గదులలో ఉండేవాళ్ళం. చిత్రకారుడు సెల్వరాజ్ కామన్ రూమ్స్ లో ఒక దానిలో ఉండేవాడు.

వెనుక వైపు గదులలో ఒకదానిలో వాకాటి వారు, మరొక దానిలో ఎం.వి.ఆర్. శాస్త్రి గారు ఉండేవారు.

నాకూ, సెల్వ రాజ్ కు నెల జీతం లేదు… వారానికి 750 రూపాయల డి. ఏ. ఇచ్చేవారు. గది అద్దె, తిండీ తిప్పలు అన్నీ అందులోనే. మిగిలిన వారి కుటుంబాలకు వీరి నెల జీతం హైదారాబాద్ లో అందేది. వీరికి ఇక్కడ 750 రూపాయల డి ఏ అదనంగా అందేది. వీరి నెల జీతాలు వారి కుటుంబాలకు ఖచ్చితంగా అందేటట్లు వాకాటి వారు చూసుకునే వారు.

ఉదయం స్నానాదులు పూర్తి చేసుకుని ఆఫీస్ కి బయలు దేరేవాళ్ళం. మేమున్న లాడ్జ్ దగ్గర రోడ్డు దాటి కుడి వైపునకు కొంచెం ముందుకు వెడితే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆఫీస్ వెనుక గేట్. రెండు నిమిషాల నడక అంతే. లోపలికి వెళ్ళాక ఒక పాడుబడ్డ భవంతి. సినిమా షూటింగ్ లలో విలన్ డెన్ అది. అది దాటాక క్యాంటీన్. మా మొదటి మజిలీ అక్కడే.

ఇడ్లీ, వడ, కట్టు పొంగలి ప్రతిరోజూ ఉండేవి. నాలుగు ఇడ్లీలు, రెండు వడలు, ఇద్దరికి సరిపోయే కట్టు పొంగలి… జస్ట్ ఫైవ్ రూపీస్! క్యాంటీన్ గోడలలో ఉన్న మూడు, నాలుగు అరలలో చట్నీ, సాంబార్ బకెట్లు. టిఫిన్ తీసుకుని ఓ పక్కకి వెళ్లే వాళ్ళం అందరం…ఇడ్లీలు, పొంగలి అన్నం కలిపినట్టు కలిపేసి, దానిలోనే చట్నీ, సాంబార్ మిలాయించేసే దృశ్యాలు చూడలేక!

అలా బ్రేక్ ఫాస్ట్ అయాక ఆఫీస్ లోకి ప్రవేశం.

మధ్యాహ్నం లంచ్… ఎగ్జిక్యూటివ్ లంచ్. ఒక ప్లేట్, దానిలో ఒక రోజు సాంబార్ అన్నం, ఒక రోజు పులిహోర, ఒక రోజు పెరుగు అన్నం, ఒక రోజు కొబ్బరి అన్నం.. ఇలా రోజుకు ఒక వెరైటీ, దానికి తోడు ఒక స్వీట్, చిప్స్, చట్నీ. ఇది కూడా జస్ట్ ఫైవ్ రుపీస్!

నేను చేరిన మూడో రోజు సాయంత్రం అందరం… వాకాటి వారితో సహా… మెరీనా బీచ్ కి వెళ్ళాం. కె.ఎల్. రెడ్డి ఆ మహాసాగరాన్ని కళ్ళప్పగించి చూస్తూ ఉండి పోయాడు. ఒక రకమైన పారవశ్యం, తృప్తి. చాలాసేపు అయాక ” ఇంక చచ్చిపోయినా ఫికర్ లేదు. సముద్రాన్ని చూసేశాను!” అన్నాడు. అతను నల్గొండ జిల్లా వాడు. అంత నీటిని ఎన్నడూ చూసినవాడు కాదు. అదీ అతని ఆనందం, తృప్తి! మనిషి అద్దం లాంటి వాడు.

ఆ మరునాడు వాకాటి వారు ఆర్టిస్ట్ సెల్వరాజ్ తో ఒక కథకు బొమ్మ వేయాలని చెబుతున్నారు. బొమ్మ ఇలా ఉండాలి అంటున్నారు. నాకు ఎక్కడో కొడుతోంది.

ఆ మరునాడు మళ్ళీ సెల్వ రాజ్ ను పిలిచి ” ఆ బొమ్మ నువ్వు వేయకు. నిన్న బాపూ గారిని కలిశాను. ఆ కథ చెప్పాను. అది విని బొమ్మ బాపూ గారే వేస్తానన్నారు” అని చెప్పారు.  నన్ను పిలిచి ఒక కథ నా చేతిలో ఉంచి “కంపోజ్ కి పంపండి, ప్రూఫ్ కూడా మీరే చూడండి” అన్నారు. ఆయన నా చేతిలో పెట్టిన కథ ” మెరీనా! ఓ మెరీనా!” నేను ఆశ్చర్యపోయి చూస్తుంటే ” ఈ కథకు మీకు రెమ్యూనరేషన్ రాదు” అన్నారు. నేను వెంటనే ” నాకూ రెమ్యూనరేషన్ వద్దు సర్! ఈ కథ ప్రింట్ అయ్యాక దీనికి బాపూ గారు వేసిన బొమ్మ నాకు ఇచ్చేయండి, అది చాలు” అన్నాను. ఆయన నవ్వేసి ” అలాగే, తీసుకోండి” అన్నారు.

ఆ మరునాడు వాకాటి వారు మళ్ళీ నన్ను పిలిచి ” ఆ బొమ్మ పంపకండి” అన్నారు. ” ఎందుకు సర్?” అని అడిగాను. ” బాపూ గారు నిన్న సాయంత్రం ఫోన్ చేశారు. ఆ కథకు ఆయన వేసిన బొమ్మ ఆయనకే తృప్తికరంగా లేదట! మళ్ళీ ఇంకో బొమ్మ వేసి పంపిస్తానన్నారు. రేపు వస్తుంది. అప్పుడు ఇద్దాం” అన్నారు.

“మెరీనా! ఓ మెరీనా!” నా మొదటి కథ! దానికే బాపుగారి బొమ్మ! అదీ ఆయనంతట ఆయన వేస్తాను అన్న బొమ్మ! ఒకటి ఇచ్చి, తృప్తిగా లేదని ఇంకో బొమ్మ! నా మొదటి కథకు బాపూ గారు వేసిన రెండు బొమ్మలు! చాలదూ… ఇంకేం కావాలి? ఇప్పటికీ ఆ రెండు బొమ్మలూ నా దగ్గర భద్రంగా ఉన్నాయి.

ఆ కథ అచ్చు అయాక వాకాటి వారికి ఆ కథ వెనుక కథ చెప్పాను. ” సర్! మీ నుంచి ఆరుసార్లు రిజెక్ట్ అయి తిరిగి వచ్చిన కథ అది. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమిటి? అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేశారు? ఇప్పుడు ఎందుకు వేశారు?” అని అడిగాను.

దానికి ఆయన చెప్పిన జవాబు నాకు ఆశ్చర్యం కలిగింది… ” అదేవిటి? మీరు నాకు ఇచ్చిన తరువాతనే నేను ఈ కథ చదివాను. అంతకుముందు చదవలేదు!”

ఏ కథ అయినా ఎడిటర్ చూసి యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేస్తారు అనుకునే వాడిని. కానీ పత్రికా కార్యాలయాలలో వీటిని కొందరు పరిశీలించి నిర్ణయిస్తారని తరువాత తెలిసింది. అన్నీ ఎడిటర్ దాకా వెళ్లవు!

బాపూ గారు నా కథకు బొమ్మ వేస్తే, ఆయన వేసిన బొమ్మకు నేను కథ రాసిన సందర్భం కూడా ఉంది. అది తరువాత ఆ సందర్భం వచ్చినప్పుడు…

“చిలిపి పనుల రహస్యాలు” రేపు…


Leave a comment