స్వీయ అన్వేషణ – 48
ఆంధ్ర ప్రభ వీక్లీ, డైలీ మద్రాస్ నుంచి ప్రచురితం అవుతున్నాయి. వీక్లీ, డైలీ లోని ఆదివారం అనుబంధం వాకాటి వారు, డైలీ వాసుదేవ దీక్షితులు గారు చూసే వారు.
ఒకరోజు వాకాటి వారు ” డైలీ సప్లిమెంట్ లో బాలమురళి ఇంటర్వ్యూ వేయాలి కదా? అది కంపోజ్ అయి రెడీగా ఉంది. ఒకసారి దీక్షితులు గారికి పంపండి. ఆయన చూస్తాను అన్నారు” అని చెప్పారు. నేను పంపాను. కొంత సేపటికి అది ఆయన దగ్గర నుంచి తిరిగి వచ్చింది. దానికి పెట్టిన హెడ్డింగ్ ఎర్రని స్కెచ్ పెన్ తో కొట్టేసి ఉంది. దానిని తీసుకువచ్చిన డైలీ సబ్ ఎడిటర్ ను అడిగాను ” ఇది ఎవరు కొట్టేశారు?” అని. ” దీక్షితులు గారు” అని చెప్పాడు. ” ఉన్న హెడ్డింగ్ కొట్టేశారు. మరి కొత్త హెడ్డింగ్ రాసి ఇమ్మని చెప్పండి. ఇది ఆయనకే ఇచ్చేయండి” అని దానిని తిప్పి పంపేసాను.
నళినీ మోహన్, కె.ఎల్.రెడ్డి, ఆంజనేయ శాస్త్రి అప్పటికే ఆంధ్ర ప్రభ ఉద్యోగులు. నేనూ, సెల్వ రాజ్ ఇద్దరమూ తాత్కాలిక ఉద్యోగులం. దీక్షితులు గారు డైలీ ఎడిటర్. నళినీ మోహన్ గారు సౌమ్యులు, పెద్దవారు. ఆయన ” అలా తిప్పి పంపకుండా ఉండాల్సింది మీరు. వాకాటి వచ్చాక చెబితే వాళ్ళు వాళ్ళూ చూసుకునే వారు ఆ విషయాన్ని. మీరు ఇంకా ప్రభలో అపాయింట్ కాలేదు. ముందే దీక్షితులు గారితో పెట్టేసుకున్నారు” అన్నారు. ” సర్! మనవాళ్ళు ఒక హెడ్డింగ్ పెట్టారు. దాన్ని ఆయన కొట్టేశారు. అలా కొట్టేస్తే మరి దానికన్నా మంచి హెడ్డింగ్ పెట్టాలి కదా? లేకపోతే మీరన్నట్టు వాకాటి వారు వచ్చాక ఆయనతో మాట్లాడి వాళ్ళు ఇద్దరూ ఒక నిర్ణయానికి రావాలి. అంతే కానీ ఉన్న హెడ్డింగ్ కొట్టేసి తిరిగి పంపటం ఏమిటి సర్? నాకు నచ్చలేదు” అన్నాను.
కాస్సేపటికి వాకాటి వారు ఆఫీస్ కి వచ్చారు. ” చెప్పండి” అన్నారు నళినీ మోహన్. ” మీరే చెప్పండి” అన్నాను నేను. ” నేను చెప్పను. చెబితే మీ మీద కంప్లయింట్ చేసినట్టు ఉంటుంది” అన్నారు. ” అయితే అదేదో దీక్షితులు గారే చెప్పుకుంటార్లెండి!” అన్నాను నేను. ఆయన నవ్వేసి ” మీకు చాలా ఉందే!” అన్నారు. ” ఉన్నదల్లా అదొక్కటే సర్!” అన్నాను.
కాస్సేపటికి దీక్షితులు గారే మేమున్న సెక్షన్ కి వచ్చారు ఆ ఇంటర్వ్యూ పట్టుకుని. వాకాటి వారికి ఇచ్చారు. ఆయన ఏదో చెప్పబోతూ ఉండగానే దానిని చూసిన వాకాటి వారు ” ఈ హెడ్డింగ్ ఎవరు కొట్టేశారు?” అని అడిగారు. ” నేనే” అన్నారు దీక్షితులు గారు. వాకాటి వారు చిరునవ్వుతో దానిని తిరిగి ఆయనకు అందించి ” మరి బెటర్ హెడ్డింగ్ ఇవ్వండి” అన్నారు. నేను నళినీ మోహన్ గారి వైపు చూశాను. ఆయన ఏమీ అనలేదు. దీక్షితులు గారు దానిని తీసుకుని వెళ్లిపోయారు కించిత్ కోపంగానే. తరువాత అది వాకాటి వారు చూస్తున్న ఆదివారం అనుబంధంలో కాకుండా దీక్షితులు గారి ఆధ్వర్యవంలో ఉన్న డైలీ పేజెస్ లోనే ప్రింట్ అయింది!
ఆయన వెళ్ళిపోయాక నళినీ మోహన్ వాకాటి వారితో ” వల్లభుడు సరిగ్గా మీలాగే చెప్పి తిప్పి పంపాడు” అంటూ అంతకుముందు జరిగినది అంతా చెప్పారు. వాకాటి ” కరెక్టే చేశాడుగా!” అన్నారు.
ఆంధ్ర ప్రభ ఆదివారం అనుబంధంలో వార ఫలాలు, వీక్లీలో మాలతీ చందూర్ ” ప్రమదావనం” వచ్చేవి. సమ్మె మొదలు కావటంతో అందరూ హడావిడిగా మద్రాస్ వచ్చారు. దానితో ఈ రెండు శీర్షికలకు సంబంధించిన మెటీరియల్ హైదారాబాద్ లోనే ఉండిపోయింది. ఆదివారం వస్తోంది. వారఫలాలు కావాలి. లేవు. ఏం చేయాలి? కిందా మీదా పడుతున్నారు. వాటిని అందించే ఆయనకు చెప్పి మళ్ళీ రాయించి తెప్పించుకునే వ్యవధి లేదు. ఏం చెయ్యాలి?
అప్పుడు నేను వాకాటి వారితో… ” సర్! ఒక మాట చెబుతాను. ఏమీ అనుకోకండి. ముందు గండం గట్టెక్కాలి కదా?” అన్నాను. ” చెప్పు” అన్నారు. ” మన లైబ్రరీ నుంచి సరిగ్గా ఏడాది క్రితం ఇదే డేట్ డైలీ తెప్పించండి. దానిలో ఉన్న వార ఫలాలు as it is గా వేసేయండి. అయితే వార ఫలాలు మొదలు పెట్టడానికి ముందు ఆ వారం ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి అనే గ్రహ సంచారం ఉంటుంది. అది మాత్రం తీసేయండి” అన్నాను. వెంటనే వాకాటి వారు ” తప్పు కదా?” అన్నారు. ” తప్పదు కదా?” అన్నాను నేను. కొంచెం సేపు ఆలోచించి “సరే. అలాగే చేద్దాం” అన్నారు వాకాటి. అలా రెండు వారాలు గడిపేశాం.
తప్పు తప్పే! అలా చేయకూడదు! నిజమే! అది పాఠకులను మోసం చేయడమే! మరి అలా ఎందుకు చేశాను? నాకు నేను సమాధానం చెప్పుకోవాలి కదా?
నిజానికి జ్యోతిష శాస్త్రంలో కొద్దిపాటి ప్రవేశం ఉన్న వాడు ఎవడైనా పత్రికలలో వచ్చే వార, మాస ఫలాలను నమ్మడు. మనకి 12 రాశులు, 27 నక్షత్రాలు, ఒక్కో నక్షత్రానికీ 4 పాదాలు చొప్పున 108 పాదాలు ఉన్నాయి. ఈ 108 పాదాలు, 27 నక్షత్రాల్లో ఇమిడి ఉంటాయి. అలాగే ఒక్కొక్క రాశిలో కొన్ని పాదాలతో కలిసిన కొన్ని నక్షత్రాలు ఇమిడి ఉంటాయి.
ఈ వార, మాస ఫలితాలు ఆ రాశిలోని ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయనుకోవటం పొరపాటు. ఒక్కొక్క నక్షత్ర పాదంలో కొన్ని లక్షల మంది జన్మిస్తారు. వాళ్ళ అందరి జన్మ జాతకాలు ఒకేలా ఉండవు. కనుక ఈ వార, మాస ఫలాలు స్థూలంగా ఆ వారంలో లేదా మాసంలో ఆయా రాశులలో గ్రహ సంచారానికి సంబంధించిన ఫలితాలు. కనుక ప్రతి రాశిలో, ప్రతి నక్షత్రంలో, ప్రతి నక్షత్ర పాదంలో పుట్టిన వారు అందరికీ వర్తిస్తాయి అనుకోవటం పొరపాటు. కేవలం అవి చదివే వారికి జస్ట్ ఒక ఊరట మాత్రమే. ఆ ఊరట అందించటం మాత్రమే ఈ శీర్షిక ప్రయోజనం. ఇది ఎవరూ గమనించరు. ఒక శీర్షిక ఎట్టి పరిస్థితులలోనూ ఆగ కూడదు. అంతే నేను అనుకున్నది.
ఇక మాలతీ చందూర్ రాసే ప్రమదా వనం విషయంలోనూ ఇదే ఇబ్బంది. ఆవిడ పంపిన స్క్రిప్ట్స్ హైదారాబాద్ లో ఉండిపోయాయి. పోనీ, ఆవిడ మద్రాసు లోనే ఉంటారు కదా? వేరే రాయించుకుందాం అంటే అప్పుడు చందూర్ గారు ఏదో టూర్ లో ఉన్నారు. అసలు రహస్యం ఏమిటంటే ఆ శీర్షికలో సమాధానాలు అందించేది మాలతి గారు కాదు, చందూర్ గారు! ఈ రహస్యం నాకు చెప్పినది వాకాటి వారే!
” ప్రమదావనం” ఉత్తర ప్రత్యుత్తరాల శీర్షిక. దానిలో ఒక pattern ఉంటుంది. పాఠకులు పంపిన నాలుగైదు ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. ఒక ప్రశ్న ఏదో ఒక పుస్తకం గురించి, ఒక ప్రశ్న ఏదో ఒక వ్యక్తిగత సమస్య గురించి, ఒక ప్రశ్న ఏదో ఒక సామాజిక సమస్య గురించి, ఒక ప్రశ్న ఆ ప్రశ్న పంపిన పాఠకుడు/ పాఠకురాలికి “ఆమె”తో గతంలో జరిగిన పర్సనల్ అనుభవం గురించి. ఇంతే! నా చిన్నప్పటి నుంచీ మా నాయనమ్మ కనకవల్లి గారు చదివేవారు. నేనూ చదివే వాడిని. కనుక ఈ శీర్షిక విషయంలో నాకు ” పరిపూర్ణ పరిజ్ఞానం” ఉంది.
మళ్ళీ ఒక ” చిలిపి” సలహా ఇచ్చా వాకాటి వారికి. అయితే ఇంతకుముందు లాగ పాతవి రిపీట్ చేయడానికి వీల్లేదు. తెలిసి పోతుంది. అందుకని ” సర్! ఈ రెండు వారాలు ప్రమదావనం నేనే రాసేస్తా. ఈ లోగా హైదారాబాద్ లో ఉన్న స్క్రిప్ట్స్ తెప్పించేసుకుందాం” అని.
” మీరు రాస్తారా? అదేం ఆషామాషీ అనుకున్నారా? డైరెక్ట్ గా పాఠకులతో వ్యవహారం” అన్నారు.
” సర్! పాఠకులు ప్రశ్నలు పంపిస్తారు. మాలతీ చందూర్ గారు సమాధానాలు ఇస్తారు. చూడండి” అన్నాను.
” సరే! రాయండి. చూద్దాం” అన్నారు.
Pattern తెలిసిందే కదా? నలుగురి పేర్లతో నాలుగు ప్రశ్నలు రాసుకుని ఆయనకు చూపించాను. ఆయన ఆ ప్రశ్నలు చూసి నవ్వేసి ” ప్రశ్నల వరకూ ఓకే. ఆన్సర్సే ప్రాబ్లెమ్” అన్నారు.
ఆ ప్రశ్నలు, సమాధానాలూ రాసి ఆయనకు ఇచ్చాను. ” ముందు నళినీ మోహన్ గారికి చూపించండి. ఆయన ఓకే అంటే అప్పుడు నేను చూసి, డిసైడ్ చేస్తాను” అన్నారు.
నళినీ మోహన్ గారు ఓకే చేశారు. వాకాటి వారూ చూసి ఓకే చేశారు. ” పరకాయ ప్రవేశం గురించి విన్నాం. మీరు పర ఆత్మ ప్రవేశం చేశారు!” అన్నారు. అలా రెండు వారాలు నేనే మాలతీ చందూర్ అయిపోయాను.
నిజానికి ఇవి “తప్పుడు పనులే”. పాఠకులను ” మోసం” చేయటమే. ఒప్పుకుంటాను… కానీ ఆ శీర్షికలు ఆగకూడదు… అంతే. అదొక్కటే ఉద్దేశ్యం. ఈ ” చిలిపి పనులు” వాకాటి వారికీ, నాకూ ఒక మంచి అనుబంధానికి దారి తీశాయి. ఆయన ఆంధ్ర ప్రభ వీక్లీ చూసినంత కాలం ఏదైనా టైమ్ కి రాదు అనుకుంటే ” చెయ్యి చేసుకుంటారా ఏమిటి?” అని జోక్ చేస్తూ ఉండేవారు.
“ఆ ముందు రోజు అక్కడే ఉన్నాను!” రేపు
Leave a comment