“ఆ ముందు రోజు అక్కడే ఉన్నాను”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 49

శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంత రూపకర్త శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారు. వారి జన్మ స్థలం తమిళనాడు లోని శ్రీ పెరంబుదూరు… భూతపురి … అని సంప్రదాయ నామం.

చిన్నప్పుడు నాలుగో తరగతిలో ఉండగా నన్ను పెంచిన వేంకటవల్లభా చార్యులు గారు తీసుకువెళ్ళారు. ఒక రోజంతా ఆ ఆలయంలోని శ్రీ ఆది కేశవ పెరుమాళ్ కు, అమ్మవారు యతిరాజనాథవల్లి తాయారు, శ్రీ రామానుజులకు జరిగిన అన్ని సేవలు చూశాం. మా నాయనమ్మ కనకవల్లి తాయారు తమ్ముడు చక్రపాణి గారు ఆ ఆలయ స్థానాచార్యులు కావటంతో సాయంత్రం జరిగే సేవలో నా సరదా కూడా తీరింది. అది పురప్పాడు… అంటే ఊరేగింపు. ఆలయంలోనే శ్రీ రామానుజుల విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఊరేగిస్తారు. ఆ ఊరేగింపునకు ముందు ఇద్దరు వెండి దండాలు పట్టుకుని నడుస్తారు. ఆ దండం పట్టుకుని తిరగాలని నా సరదా. వడ్డించేవాడు మనవాడేగా! ఆ వెండి దండం చేతికి అందించారు. నిజంగా మనం మోయలేనంత బరువే! కానీ సరదా తీరాలి కదా? అలాగే దానిని చేత పట్టి కుడి భుజాన్ని ఆనించుకుని ధరించి ఆ పల్లకి ముందు నడుస్తుంటే… ఏం చెప్పను? అప్పుడు ఏమీ తెలియదు… సరదా… బరువు తప్ప. కానీ అదే ఇప్పుడు తలుచుకుంటే…భగవద్రామానుజులకు ” దండధారి” ని అయాను కాదూ నేను!

అలాగే ఆ క్షేత్రం అంటే…ఇప్పటికీ…నాకున్న మరో వ్యామోహం అక్కడి ” కదంబ ప్రసాదం”. ఆ రోజు ఉదయం భగవద్ రామానుజులకు తిరుమంజనం…అదేనండీ అభిషేకం… జరిగింది. అప్పుడు శ్రీ వైష్ణవ స్వాములు ” తిరుమంజన కట్టియం” అనేది చదువుతారు. అది తమిళ భాషలో ఉంటుంది. అప్పటికే కాదు… ఇప్పటికీ ఆ భాష మనకి ఒంట బట్టలేదు. ఈ కట్టియం గురించి మా తాత ఒక కథ చెప్పేవారు. మా పెదనాన్న రాధాకృష్ణన్ గారిని కూడా చిన్నప్పుడు  అక్కడికి తీసుకువెళ్ళారుట. ఆయనా చిన్నవాడే. అక్కడ శ్రీ వైష్ణవ స్వాములు ఆ కట్టియం చదువుతూ ఉంటే ఈయన కూడా చాలా చిన్న స్వరంలో, పూర్తిగా వినపడకుండా గొంతు కలిపే వాడట! ఆయనకీ అప్పట్లో తమిళం రాదు. ఆయన ఆ భాషలో ఒక రహస్యం కనిపెట్టాడు ఆ వయసులోనే. అంతే… దానిని ఇంప్లిమెంట్ చేసేశాడు. ఆయన ఆ స్వాముల తో పాటు చదివిన పాఠం ఏమిట్రా అంటే… ఇదుగో… ఇదీ…

“తడి శనఘల్, పొడి శనఘల్, చెక్కు తీసిన చెరుకు ఘడల్”!

ఈ ” స్క్రిప్ట్” తరువాత నేను ఉపయోగించుకున్నాను. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ” శ్రీ కూరేశ చరితం” సీరియల్ రాస్తూన్నప్పుడు దానిలో కొన్ని పాశురాలు పెట్టాను. మన తెలుగు నటులకు అవి పలకటం అసాధ్యం. ఎలాగూ డబ్బింగ్ లో ఎవరి చేతనో చెప్పిస్తాం కానీ లిప్ సింక్ అవాలి కదా? నటుడు రాజేంద్ర ఒక పాశురం చదవాలి. కిందా మీదా పడుతున్నాడు. అప్పుడు ఈ ” స్క్రిప్ట్” చెప్పాను. దబాయించి చెప్పేశాడు. అలా మా పెదనాన్న కనిపెట్టిన ” స్క్రిప్ట్” నాకు ఉపయోగ పడింది. ఇక ప్రస్తుతానికి వస్తే …

ఆ “కదంబ ప్రసాద” రుచి ఎన్నాళ్ళు అయినా నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.

మద్రాసులోనే పని చేస్తున్నాను కాబట్టి ఒకరోజు సాయంత్రం ఆఫీస్ అయాక  బస్ ఎక్కి శ్రీ పెరంబుదూరు చెక్కేశాను  చిన్ననాటి స్మృతులను నెమరు వేసుకుంటూ. ఆ ” వెండి దండం” మళ్ళీ దొరకలేదు కానీ… ఆ కదంబ ప్రసాదంతో పాటు మరొక అద్భుత ప్రసాదం లభించింది. వేసవి కాలం… భగవద్ రామానుజుల మూర్తికి చందనం అద్దుతారు… వేసవి తాపం లేకుండా ఉండటానికి! ఆ చందనం దొరికింది! తృప్తిగా తిరిగి వచ్చాను.

ఆ మరునాడు…

అదే శ్రీ పెరంబుదూరులో రాజీవ్ గాంధీ హత్య జరిగింది! ఆ ముందు రోజు వెళ్ళాను కనుక సరిపోయింది. ఆ రోజు వెళ్ళి ఉంటే మరొక మూడు రోజులు అక్కడే ఇరుక్కు పోయే వాడిని.

” బంద్ లో పాన్ వేట!” రేపు…

శ్రీ రామానుజార్య దివ్యాజ్ఞా వర్ధతామభివర్థతామ్!

Leave a comment