స్వీయ అన్వేషణ – 50
మా పెదనాన్న, నాన్న, చిన్నాన్న అందరికీ పాన్ అలవాటు ఉంది. వాళ్ళకి ఎలా అలవాటు అయింది అనేది నాకు తెలియదు, కానీ … నాకు అలవాటు అయిన కథాక్రమం బెట్టిదనిన…
మా చిన్నాన్న తను ఉండే ఇంటి మీద క్రొత్తగా మొదటి అంతస్తు కట్టుకున్నాడు. మా చిన్నాన్న, ఆయన మామగారు, స్నేహితుడు ప్రకాశరావు అందరికీ పాన్ అలవాటు ఉంది. తమలపాకులు, వక్కపొడి, సున్నం, పొగాకు ఒక డబ్బాలో ఉండేవి. దానిని ” పట్టీ డబ్బా” అంటారు. విడిగా రత్నా జర్డా డబ్బా వుండేది. భోజనాలు అయిపోయాయి. అందరూ ఎవరి పాన్ వాళ్ళు వేసేసుకుని, పేకాట మొదలు పెట్టారు.
ప్రకాశ రావు చెల్లెళ్ళు, మా చిన్నాన్న మరదళ్ళు తమలపాకులకు సున్నం రాసుకుని, వక్కపొడి వేసుకుని, రత్నా డబ్బా రహస్యంగా తీసుకుని వెనుక గదిలోకి వెళ్లి, ఆ జర్థా వేసుకుని పాన్ వేసేసుకుంటున్నారు. మంచి నీళ్ళ కోసం లోపలికి వెళ్లిన నాకు ఈ ” ఓగాయిత్యం” కంట పడింది. ఆశ్చర్య పోయాను… ” మీరు ఈ పాన్…” అంటూంటే అందులో ఒకరు ” ఏం? నువ్వెప్పుడూ వేసుకోలేదా?” అని అడిగారు. ” లేదు” అన్నాను. ” భయమా?” అని రెట్టింపు. ” కళ్ళు తిరగవూ?” అన్నా. ” ఆడపిల్లలం మేమే వేసుకుంటున్నాం. అంత భయం ఏమిటి?” అని మరొకరి పొడుపు. ఆడ పిల్లలు అలా ఛాలెంజ్ చేస్తే ” ఇగో” హర్ట్ అయిపోదూ? ” భయమా? నాకా?” అన్నా. ” అయితే ఇదుగో” అంటూ ఒక ” తాంబూలం” తయారు చేసి చేతిలో పెట్టారు. లోపల్లోపల కొంచెం బెరుకుగానే ఉంది…కానీ ” మగాహంకారం” వెనక్కి తగ్గనిస్తుందా? వేసేసా!
అయ్యా! మొదటి సారి మాత్రమే నేను వేసుకున్నా. అప్పటి నుంచి అదే నన్ను వేసుకోవటం మొదలైంది. అలా ఆ మహత్తర స్త్రీ మూర్తుల ” మాదక కటాక్ష వీక్షణాల” వల్ల ఈ పాన్ అనే వ్యసనం నన్ను వదలకుండా పట్టుకుంది.
సరే! శ్రీ పెరంబుదూరు లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఆ వార్త రాగానే అప్పటికప్పుడు మొత్తం బంద్. స్వచ్ఛందంగా తమిళనాడు బంద్. మద్రాస్ సంగతి వేరే చెప్పేది ఏముంది?
భోజనం అయిపోయింది. పాన్ కావాలి. మన దగ్గర స్టాక్ లేదు. ఎలా? వెళ్లి తెచ్చుకోవాలి. బయలుదేరుతుంటే నళినీ మోహన్ గారు ” ఇప్పుడెక్కడికి?” అని అడిగారు. ” పాన్ తెచ్చుకు వస్తా సర్” అన్నా. ” ఏడిసినట్టుంది. మొత్తం బంద్. తెలియదా? ఇప్పుడక్కడ దొరుకుతుంది?” అన్నారు ఆయన. ” నేను తెస్తాగా?” అంటూ బయలుదేరా!
ఓ పావుగంట తరువాత మరునాటికి కూడా సరిపోయే స్టాక్ తో తిరిగి వచ్చా! నళినీ మోహన్ గారు ఎదురు చూస్తున్నారు. నన్ను చూడగానే ” వచ్చారా? బంద్ టైమ్ లో బయటకు వెళ్లారు. ఏమవుతుందో అని కంగారు పడుతున్నా” అన్నారు. ” ఇంతకీ దొరికాయా?” అని అడిగారు కుతూహలంగా. జేబులోంచి తీసి చూపించా. ఆయన ” ఎక్కడ దొరికించుకున్నారు?” అని అడిగారు ఆశ్చర్యంగా!
“సర్! బంద్ ఎందుకు జరుగుతోంది? రాజీవ్ గాంధీ హత్య వల్ల. రాజీవ్ గాంధీ ఎవరు? కాంగ్రెస్ నేత. ఇక్కడ కాంగ్రెస్ ఆఫీస్… సత్యమూర్తి భవన్ కదా? మరి కార్యకర్తలు అందరూ అక్కడే చేరతారు కదా? వాళ్లేమీ టీలు, సిగరెట్లు, కిళ్లీలు మానేసి కూచోరు కదా? సో, సత్యమూర్తి భవన్ ఎదురుగా వుండే టీ – పాన్ షాప్ లు తెరిచే ఉంటాయ్ వీళ్ళ కోసం. అక్కడికి పోయి తెచ్చేసుకున్నా” అన్నా. ” ఏం లాజిక్ అండీ! ” అంటూ నవ్వేశారు ఆయన. మరునాడు వాకాటి వారికి ఇదంతా చెప్పేశారు కూడా. ఆయన కూడా నవ్వేసి ” కాస్త జాగ్రత్తగా ఉండండి” అన్నారు.
” ఫలించిన జ్యోతిషం!” రేపు…
Leave a comment