స్వీయ అన్వేషణ – 51
1991 మే 18 న నేను మద్రాసులో ఆంధ్రప్రభ లో తాత్కాలిక ఉద్యోగిగా చేరాను. దాదాపు మూడు నెలలు అక్కడే పని చేశాం. ఆ మూడు నెలలూ పగటి పూట ఆఫీస్ పని, రాత్రి భోజనం అయాక కాసేపు బాతాఖానీ, తరువాత ఇంకొంచెంసేపు ఏదో ఒక పుస్తకం చదువుకోవటం, ఆ తరువాత అందరూ పడుకుని, సద్దు మణిగాక నా జపం చేసుకోవటం. డాక్టర్ ప్రసాదరాయ కులపతి చెప్పిన గణపతి మంత్రం ఉందిగా! అదే చేసేవాడిని.
మే నెలలో ఒకరోజు బాగా వాన పడుతోంది. ఆఫీస్ బాల్కనీ లో నిలబడి చూస్తున్నాం నేనూ, వాకాటి వారూ. ఎదురుగా అంతా ఖాళీ స్థలం, పెద్ద పెద్ద చెట్లు. కళ్ళ నిండా పచ్చదనం. ఆగకుండా కురుస్తున్న వాన బాల్కనీ నేల మీద బలంగా పడుతోంది. ” చూశారా? అంత పైనించి వస్తూంటే నేలను చేరనీయకుండా అడ్డం పడిందని వాన బాల్కనీ నేలను బాదేస్తోంది” అన్నారు వాకాటి వారు. కనిపించిన వాన, వినిపించిన వాన చప్పుడు రెండిటినీ కలిపేసి ఎంత బాగా చెప్పారు అనుకున్నా.
వాకాటి వారు ఆ వానలోకి చూస్తూ ” ఈ స్ట్రైక్ రెండు మూడు రోజులలో అయిపోతుంది. మనం అందరం హైదారాబాద్ వెళ్లిపోవచ్చు” అన్నారు. నాకు నవ్వు వచ్చింది. అది చూసి వాకాటి వారు కొంచెం హర్ట్ అయినట్టున్నారు… ” నేను ఊరికే అనటం లేదు. ఒక స్పిరిచ్యువల్ బేస్ తో చెబుతున్నా” అన్నారు. నేను సర్దుకున్నాను… ” అదేం లేదు సర్! హైదారాబాద్ వెళ్లిపోవచ్చు అన్నారు కదా? జస్ట్ సంతోషం… అంతే” అన్నాను.
రాత్రి భోజనం అయాక అందరం కుర్చీలు ఆరుబయట వేసుకుని కాసేపు కాలక్షేపం చేసేవాళ్ళం. ఆ రోజు ఉదయం వాకాటి వారు సమ్మె గురించి చెప్పిన మాటలు సెల్వరాజ్ కూడా విన్నాడు. అసలే అతగాడు ఫ్యామిలీ మ్యాన్. అప్పటికే హోమ్ సిక్ అయిపోయాడు. వాకాటి వారు అన్న మాట అతనికి చాలా ఆనందం కలిగించింది. అదే మాట అంటూ ” చివరకు ఎలాగో స్ట్రైక్ అయిపోతే చాలు. సార్ చెప్పారుగా? ఆయన చెప్పారు అంటే అయిపోతుంది” అన్నాడు
నాకు మళ్ళీ నవ్వు వచ్చింది. ” పొద్దున్న కూడా సార్ చెప్పినప్పుడు ఇలాగే నవ్వారు. ఇప్పుడూ నవ్వుతున్నారు. ఎందుకు సర్?” అని అడిగాడు.
” సర్ అనుకున్నట్టు స్ట్రైక్ ఇప్పుడప్పుడే కాదు. జులై వరకూ మనం ఇక్కడే” అన్నాను.
” ఊరుకోండి సార్! అపశకునం మాటలు మాట్లాడకండి” అన్నాడు కోపంగా. ” సరేలే… చూడు. జులై 10 వరకూ ఈ స్ట్రైక్ జరుగుతూనే ఉంటుంది” అన్నా.
మే గడచిపోయింది, జూన్ గడచిపోయింది. సమ్మె కొనసాగుతూనే ఉంది.
జులై వచ్చింది. ఆంధ్రప్రభ జనరల్ మేనేజర్ ఎ.సి. వేంకట కృష్ణన్ ( ఎ. సి. వి)వాకాటి వారితో ” మీ వాళ్ళని ఈ నెల 16న హైదారాబాద్ కి టికెట్స్ బుక్ చేసుకోమని చెప్పండి ” అన్నారు.
వాకాటి వారు ఈ విషయం అందరికీ చెప్పారు. ఆ రోజు సాయంత్రమే నళినీ మోహన్ గారు, కె.ఎల్. రెడ్డి, ఆంజనేయ శాస్త్రి వెళ్లి 16వ తేదీకి టికెట్స్ బుక్ చేసేసుకున్నారు.
సెల్వ రాజ్ ” మనకి కూడా చేసేసుకుందాం సర్” అన్నాడు.
” రేపు చేసుకుందాం” అన్నాను.
మరునాడు సెల్వరాజ్ మళ్ళీ అడిగాడు. ” 28వ తేదీకి చేసుకుందాం” అన్నాను.
” అదేవిటి సర్? ఎ సి వి 16కి బుక్ చేసుకోమన్నారు కదా?” అన్నాడు.
” నువ్వు చేసుకుంటే చేసుకో! నేను 28కి చేసుకుంటా” అన్నాను.
ఒక రోజు ఎ సి వి వాకాటి వారిని పిలిచి ” నేను చెప్పే వరకూ ఎవరినీ వెళ్లవద్దని చెప్పండి” అన్నారు. టికెట్స్ కేన్సిల్.
9వ తేదీ. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ అయిపోయాక ఆయన వాకాటి వారిని పిలిచి ” యూనియన్ తో టాక్స్ ఫెయిల్ అయ్యాయి. హైదారాబాద్, విజయవాడ ఎడిషన్లు మూసేస్తున్నాం. ఇక్కడ ఉండి పని చేసే వాళ్ళని ఉండమని చెప్పండి. మిగిలిన వాళ్ళని వెళ్ళిపొమ్మని చెప్పండి” అన్నారు.
వాకాటి వారు ఈ మాట చెప్పగానే అందరూ దిగాలుపడి పోయారు. సెల్వ రాజ్ మరీనూ. సమ్మె సంగతి ఎలా ఉన్నా అసలు ఎడిషన్సే మూసేస్తామని అంటే? ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పని చేయటం అతని కల! పోనీ మద్రాస్ లోనే ఉండి పని చేద్దామంటే కుటుంబం మొత్తం తరలిరావాలి. అది అయే పని కాదు. దానితో అతని దిగులుకి అంతే లేకుండా పోయింది.
ఆ రోజు రాత్రి సెల్వ రాజ్ ” ఇదేవిటి సర్? మీరు 10 వ తేదీకి స్ట్రైక్ అయిపోతుంది అన్నారు. ఇప్పుడు ఏకంగా మూసేస్తున్నారు” అన్నాడు.
” నేను చెప్పినది 10వ తేదీ. ఇవాళ ఇంకా 9వ తేదీ పూర్తి కాలేదు” అన్నాను.
అప్పుడే సెల్వరాజ్ ను అడిగాను ” 28 కి నేను బుక్ చేసుకుంటున్నాను. నీ సంగతి ఏమిటి?”
” అంటే మీరు ఇక్కడ జాయిన్ కారా?” అని అడిగాడు.
” నేనే కాదు… మనలో ఎవరూ ఇక్కడ జాయిన్ కారు. నీ ఇష్టం… నేనైతే 28కి బుక్ చేసుకుంటున్నా” అన్నా.
సెల్వ రాజ్ ఏమనుకున్నాడో.. ఏమో.. ” సరే” అన్నాడు. ఇద్దరం 28కి బుక్ చేసుకున్నాం. మిగిలిన వాళ్ళు తటపటాయించారు.
మరునాడు ఉదయం ప్రాంతీయ వార్తలలో సమ్మె విరమణ విషయం చెప్పారు! సెల్వ రాజ్ ఆశ్చర్యపోయాడు. ” ఎలా చెప్పారు సర్?” అని అడిగాడు. నవ్వేసి ఊరుకున్నాను.
ఆ రోజు సాయంత్రం వాకాటి వారు ” నేను మీ ఇద్దరి గురించి మాట్లాడాను. నేను ఇక్కడ మరో అయిదారు రోజులు ఉంటాను. మీకు పర్మనెంట్ అపాయింట్ మెంట్ ఆర్డర్లు తీసుకువస్తాను. ఒకటో తేదీ తరువాత ఒకసారి ఫోన్ చేసి ఆఫీస్ కి రండి ” అన్నారు.
సమ్మె కాలంలో అక్కడ పని చేసిన వారిలో నళినీ మోహన్, ఆంజనేయ శాస్త్రి, రెడ్డి లకు నెలవారీ జీతంతో పాటు ఇక్కడ వారానికి 750 రూపాయలు డి ఏ ఇచ్చారు. నేను, సెల్వ రాజ్ తాత్కాలిక ఉద్యోగులము మాత్రమే కనుక మాకు డి ఏ మాత్రమే వచ్చింది. వాకాటి వారికి ఇది కొంత బాధ కలిగించింది. ఆయన యాజమాన్యం తో మాట్లాడారు. మా ఇద్దరికీ 2000 చొప్పున రూపాయలు గౌరవ వేతనంగా ఇప్పించారు.
నాకు అప్పటికి వాచ్ లేదు. అప్పటికే జిడ్డు కృష్ణమూర్తి తలకెక్కి కూర్చున్నాడు. ఆ కథ తరువాత చెబుతాను. డబ్బులు చేతిలో పడ్డాయి. వాచ్ కొనుక్కుందాం అనుకుని వెళ్లా. టైటాన్ వాచ్ నచ్చింది. ఎంత అని అడిగితే 730 రూపాయలు అన్నాడు… రెండేళ్ళ గ్యారంటీ అని కూడా చెప్పాడు. లెక్క సరిపోయింది. ఏడాదికి 365 రోజులు, రెండేళ్ళకి 730 రోజులు. రెండేళ్ళ గ్యారంటీ. అంటే ఆ వాచ్ ఖరీదు “రోజుకు ఒక్క రూపాయి”. బాగుంది అనుకుని కొనుక్కున్నా. రెండేళ్లు కాదు… ఇప్పటికి 33 ఏళ్లు… జస్ట్ బ్యాటరీ మారిస్తే చాలు… పని చేస్తూనే ఉంది!
ఇంకా డబ్బులు ఉన్నాయి… బుక్ షాప్ తరువాతి మజిలీ. జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు మూడు కొనుగోలు. మరొక పుస్తకం పేరు గుర్తు లేదు… రష్యన్ సాహిత్య విమర్శకు సంబంధించినది. అది అనంతర కాలంలో నాకు చాలా పనికి వచ్చింది. అది ఎలా ఉపయోగించింది అనేది తరువాత చెబుతాను.
చివరకు చేతిలో మిగిలినది 800 !
చివరకి అందరం 28 కి బుక్ చేసుకున్నాం. రైల్ ఎక్కాం. సూళ్లూరుపేట వచ్చింది. సెల్వ రాజ్ చాలా హుషారుగా ఉన్నాడు. ఒకటి ఇంటికి వెడుతున్నాం, రెండు వాకాటి వారు అపాయింట్ మెంట్ లెటర్స్ తీసుకు వస్తానన్నారు.
” మొత్తం మీద నా కల తీరుతోంది. సార్ అపాయింట్ మెంట్ లెటర్స్ తీసుకు వస్తానన్నారు. నెక్స్ట్ మంత్ జాయిన్ అయిపోవటమే” అన్నాడు.
” కంగారు పడి పోకు. అదంత ఈజీ కాదు” అన్నాను.
” అదేమిటి సార్ చెప్పారుగా?” అన్నాడు.
“సెల్వ రాజూ! మన ఇద్దరం పర్మనెంట్ కావటానికి ఎంత లేదన్నా ఏడాదిన్నర పడుతుంది” అన్నాను
అలాగే జరిగింది. మేము హైదారాబాద్ వచ్చి, వాకాటి వారిని కలిశాక సెల్వరాజ్ కి అర్ధం అయింది అది. ఆ కథకు ముందు…
” జిడ్డు పట్టాడు!” రేపు…
Leave a comment