” జిడ్డు పట్టాడు!’

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 52

మద్రాస్ లో పని చేస్తున్న రోజులలో వాకాటి వారు అప్పుడప్పుడు హైదారాబాద్ వెళ్లి వచ్చేవారు. అలా తిరిగి వచ్చేటప్పుడు వేయించిన వడియాల వంటివి తెస్తూ ఉండేవారు అందరి కోసం… రాత్రి ఆ తమిళ భోజనంలోకి.

రాత్రి భోజనం, ఆదివారం భోజనం మేము ఉంటున్న ఉడ్ ల్యాండ్స్ లోనే. అసలు నాకు ఒక విషయం మాత్రం ఆశ్చర్యం… ఆ రెస్టారెంట్ ప్రారంభించిన రోజు దేశంలో ఉన్న క్యాబేజ్ అంతా కొనేసి, కూర వండేసి, ఏ కోల్డ్ స్టోరేజ్ లోనో పెట్టేసి ఉంటాడు. మేమున్న మూడు నెలల్లో ప్రతి రోజూ అదే కూర! ఆదివారం మాత్రం స్పెషల్! నన్ను పెంచిన మా చిన్న మామ్మను గుర్తు చేసేవాడు!

మా చిన్న మామ తమిళ ఆడపడుచు… శ్రీ పెరంబుదూరు లో పుట్టింది అని చెప్పాను కదా? ఆవిడ ఒక వేపుడు, ఒక పులుసు చేసేది. ఆ పులుసు చేసిన రోజు ఇంక మరోటి తినే వాణ్ణి కాదు. అదే ” సుండ కాయ”ల పులుసు. ఆ కాయలు ఎండబెట్టి వొరుగు చేస్తారు. అవి ప్రాణాల మీద విరక్తి పుట్టేటంత చేదు! కానీ ఆ పులుసు తగిలి చేదు కాస్తా వగరుగా రూపాంతరం చెంది, కించిత్ పులుపు, కించిత్ వగరు… అదొక రకమైన రుచి. దొరికితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా పెళ్లి అయిన తరువాత ఢిల్లీ వెళ్ళాను ఒకసారి. అప్పట్లో నా భార్య అక్కడ ఉద్యోగం చేస్తూ ఉండేది. ఆవిడ ఒకరోజు లోది రోడ్ లోని రామ మందిరానికి తీసుకువెళ్ళింది. అక్కడ దొరికాయి. వెంటనే కొనేసుకున్నా. నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయి. ఈ మధ్య నెట్ లో చూస్తూంటే మద్రాస్ లో ఉన్న “Ganapathy’s” లో కనిపించాయి. మా చిన్న మామ్మ అక్కడి నుంచే తెప్పించుకునేది. ఇంక ఆగేది ఏముంది? తెప్పించేశా ఒక అరకిలో!

ప్రస్తుతం… అలా వాకాటి వారు ఒకసారి హైదారాబాద్ వెళ్ళేటప్పుడు ఒక పుస్తకం నాకు ఇస్తూ… ” బ్రీఫ్ కేస్ లో చోటు లేదు. మీ దగ్గర ఉంచండి. వచ్చాక తీసుకుంటా” అన్నారు.

మద్రాస్ వచ్చేటప్పుడు తెచ్చుకున్న పుస్తకాలు చదవటం అయిపోయింది. చదవటానికి ఏమీ లేవు. సరే! వాకాటి వారు తిరిగి రావటానికి మూడు నాలుగు రోజులు ఎలాగూ పడుతుంది కదా? ఈ లోగా ఈ పుస్తకం చదివేద్దాం అని తెరిచా. ఆ పుస్తకం జిడ్డు కృష్ణమూర్తి ” The Wholeness of Life”! ( ఈ మధ్య వెలువడ్డ ప్రచురణకు ఈ పేరు మార్చారు).

జిడ్డు కృష్ణమూర్తి, ప్రఖ్యాత ఫిజిసిస్ట్ డేవిడ్ బామ్, ప్రముఖ సైక్రియాటిస్ట్ డేవిడ్ షీన్బర్గ్… ఈ ముగ్గురి మధ్య జరిగిన చర్చ ఈ పుస్తకం.

అప్పటి వరకూ ఏ పుస్తకం అయినా ఏకధాటిగా చదివేవాణ్ణి. కానీ… ఈ పుస్తకం లో ప్రతి పేజీ నన్ను నిలబెట్టేసింది! ప్రతి ప్రశ్న, ప్రతి జవాబు… నాలోకి నన్ను తోసేసింది! ప్రతి పదమూ నన్ను నిలదీసింది! అర్థం చేసుకుంటూ, జీర్ణించుకుంటూ చదివేసరికి పట్టుమని యాభై పేజీలు కూడా పూర్తి కాలేదు… కానీ వాకాటి వారు తిరిగి వచ్చేశారు. పుస్తకం అడిగారు… ” సర్! చదువుతున్నా” అన్నా. “సరే! చదివాక ఇవ్వండి” అన్నారు. మద్రాస్ నుంచి వచ్చేసేటప్పుడు నేను కొన్న మూడు పుస్తకాలలో అది కూడా ఒకటి!

ఆ పుస్తకం ప్రభావం నా మీద చాలా పడింది. ముఖ్యంగా రెండు విషయాలు నన్ను ” క్రొత్త నేను”  ను చేశాయి.

ఒకటి “ఇమేజ్ బిల్డింగ్”, రెండు ” ఇమేజ్ బ్రేకింగ్! ” నీ గురించి నువ్వు ఒక ఇమేజ్ తయారు చేసుకోవటం, అలాగే ఇతరుల గురించి ఒక ఇమేజ్ ఏర్పరచుకోవడం. అక్కడి నుంచి ఇద్దరి మధ్య జరిగే వ్యవహారం అంతా ఆ ఇమేజ్ ల మధ్యనే జరుగుతుంది. అంతే కానీ ఇద్దరు ‘ మనుష్యుల మధ్య కాదు ‘.

ఇదీ సిద్ధాంతం! నిజం కదూ? ” నేను మంచి వాణ్ణి” (నీ గురించి నువ్వు ఏర్పరచుకున్న ఇమేజ్). ” వాడు పనికిరాని వాడు” ( మరొకడి గురించి నువ్వు ఏర్పరచుకున్న ఇమేజ్). ఇప్పుడు చెప్పండి… వ్యవహారం అంతా ఈ ” ఇమేజ్” ల మధ్యనే కదా?

ఇది తలకెక్కటానికి కొంత టైమ్ పడుతుంది. కానీ ఒక్కసారి ఇది తలకెక్కితే అంతా “క్లారిటీ”నే!

ఆ రెండు మాటలూ నాపైన చాలా ప్రభావం చూపించాయి. ఇమేజ్ బిల్డింగ్… నా గురించి నేను ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం, ఇతరుల గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం… బ్రద్దలు కొట్టుకోవటానికి …  అదే… ఇమేజ్ బ్రేకింగ్ కి చాలా కాలం పట్టింది!

ఆ ప్రభావంతో వచ్చినదే ” సాక్షాత్కారం” కథ! ఆంధ్ర ప్రభలో ప్రచురితం అయింది. ఆ కథ చదివి అబ్బూరి ఛాయాదేవి గారు ” నీకు జిడ్డు పట్టాడు” అన్నారు! ఈ కథ నాకు ఒక ఆత్మీయ మిత్రుడిని కూడా సంపాదించి పెట్టింది. ఇద్దరికీ అసలు పరిచయమే లేదు అంతకుముందు… ఒకరినొకరం చూసినదీ లేదు. నేను హైదారాబాద్ లో… అతను విశాఖ పట్టణంలో.  ఆ కథ ప్రచురితం అయినప్పుడు చదివి, అతను ఆ కథకు బొమ్మ వేసి పోస్టులో పంపాడు! అతడే ఇప్పుడు ప్రఖ్యాత చిత్రకారుడు ” కూచి”!

ఇక ఇప్పుడు నా గురించి నాకు ఎలాటి ” ఇమేజ్” లేదు! ఎదుటి వాళ్ళ గురించి కూడా ” ఇమేజ్” లేదు! కేవలం తటస్థత! అంతే!

జాగ్రత్త! జిడ్డు కృష్ణమూర్తి జోలికి పోకండి! నన్ను పట్టుకున్నట్టే మిమ్మల్నీ ” జిడ్డు (లా) పట్టుకుంటుంటాడు!”

” పార్థ సారథీ! పారి ఫో!” రేపు…


Leave a comment