స్వీయ అన్వేషణ – 53
మద్రాసులో ఉన్నప్పుడే శ్రీపార్థసారథి కోవెలకు వెళ్ళాను ఒక సాయంత్రం. ఆ కోవెల నా చిన్నప్పటి అపురూప అనుభవం.
నాకు చిన్నప్పుడు ఎప్పుడు చూసినా 99 డిగ్రీల టెంపరేచర్ ఉండేది! నార్మల్ కన్నా ఎక్కువే కదా! అది నన్ను పెంచిన వేంకట వల్లభాచార్యులు గారికి ఒక ఛాలెంజ్ అయిపోయింది. ” ఎలాగైనా వీడి టెంపరేచర్ నార్మల్ కి దించాలి” అని ఆయన కంకణం కట్టుకున్నాడు. అందుకని నన్ను మద్రాస్ తీసుకువచ్చారు ట్రీట్మెంట్ కోసం. ఒకటి కాదు రెండు చికిత్సలు… ఏక కాలంలో! ఉదయం డాక్టర్ మాత్యూ దగ్గర అలోపతి వైద్యం, సాయంత్రం శ్రీ అగస్త్యాశ్రమం లో డాక్టర్ నరసింహారావు గారి హోమియోపతి వైద్యం.
ఒక రోజు సాయంత్రం ఆయన నన్ను శ్రీ పార్థసారథి స్వామి కోవెలకు తీసుకువెళ్ళారు. చాలా రద్దీగా ఉంది. లోపలికి వెడుతున్న కొద్దీ రద్దీ ఎక్కువైంది. నాకు ఎదురుగా స్వామి కనపడటం లేదు. మా తాత నన్ను ఎత్తుకున్నాడు. ఎదురుగా చూశాను. అంతే! కళ్ళు త్రిప్పుకోలేక పోయాను… అలా చూస్తూనే ఉండి పోయాను.
ఎదురుగా గర్భాలయం… నూనె దీపాల మసక వెలుతురు… అటూ ఇటూ గుప్పేడేసి అగరవత్తులు… వాటి ధూమం… ఆ మసక వెలుతురులో… ఆ ధూమపు పొరల మధ్య… మబ్బుల మధ్య నుంచి దిగి వస్తున్నట్టు స్వామి! అప్పటి నుంచీ శ్రీ పార్థ సారథి అనే పేరు వింటే అదే దృశ్యం కళ్ళ ముందు కదిలేది! అదే అనుభవం మళ్ళీ మళ్ళీ మనసు పొరలను చీల్చుకుని ఎదుట నిలిచేది! అదే అనుభవం కోసం… ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ ఆ కోవెల ముందు నిలిచాను.
విద్యుత్ దీప కాంతులతో వెలుగుతోంది ప్రాంగణం. ఎత్తైన ఆ రాతి స్తంభాల మంటపం లోనుంచి ముందుకు నడుస్తుంటే కోవెల లోనికి వెడుతున్నట్టు లేదు… సాక్షాత్తు శ్రీ కృష్ణ మందిరం లోనికి వెడుతున్నట్టుంది. అలా ఏదో కలలో లాగ లోపలికి వెడితే…
నా కల… చెదిరిపోయింది! నా చిన్ననాటి అనుభవం ముక్కలై పోయింది! ఆనాటి నీలి మేఘాల మధ్య నుంచి దిగి వస్తున్న పార్థ సారథి కనపడలేదు!
అక్కడ … ఆ స్థానంలో… ఎవరో నిలబడి ఉన్నారు! వేపర్ లైట్ల కాంతి గర్భాలయాన్ని వేడెక్కిస్తోంది! తైల దీపాలు వెలవెల బోతున్నాయి! ధూమ మేఘాలు లేవు!
అక్కడ నా పార్థ సారథి స్థానంలో ఒక విగ్రహం ఉంది! దానికి వెలవెల బోతున్న ఒక ఇత్తడి కవచం ఉంది! ఆ కవచం పైన ఒక గొలుసుతో వ్రేలాడేసిన లక్ష్మీ పతకం ఉంది! ఆ కవచం లోపలి నుండి బయటకు వచ్చి బొద్దింకలు రెండు ఆ విగ్రహం మీద యధేచ్చగా విహరిస్తున్నాయి! అర్చకుడు లేడు!
చూశాను! దీని కోసమా ఆతృతగా వచ్చినది? దీని కోసమా ఇన్నేళ్లు వేచి వేచి వచ్చినది? దీని కోసమా ప్రాణాలు కళ్ళలో పెట్టుకొని వచ్చినది? బొద్దింకలు ప్రాకుతున్న విగ్రహాన్ని చూడటానికా ఇక్కడికి వచ్చినది?
ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేక పోయాను… గబగబా నడుచుకుంటూ ” పార్థ సారథీ! పారిఫో!’ అని గొణుక్కుంటూ… పారిపోయి వచ్చేశాను! అదే పేరుతో వ్రాసిన కథ ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురితం అయింది.
” చెప్పినదే జరిగింది!” రేపు…
Leave a comment