స్వీయ అన్వేషణ – 54
1991 జులై 28 న బయలుదేరి హైదారాబాద్ వచ్చేశాము. వాకాటి వారు ఆగస్టు 5న ఫోన్ చేయమన్నారు.
నేను మద్రాస్ లో చేరటానికి ముందు మా చిన్న మామ్మ మరణించటం వల్ల రాజమండ్రి వెళ్లి అక్కడనుంచి మద్రాసు వెళ్ళిపోయాను అని చెప్పాను కదా? వాకాటి వారికి ఫోన్ చేయటానికి ఎలాగూ టైమ్ ఉంది కాబట్టి ఒకసారి రాజమండ్రి వెళ్లి వద్దామని అనుకుని వెళ్ళాను.
ఆగస్టు 5వ తేదీ ఉదయం తిరిగి వచ్చి, సెల్వ రాజ్ కి ఫోన్ చేసి, ఇద్దరం కలిసి వాకాటి వారికి ఫోన్ చేశాము. ఆయన ” ఒకసారి ఆఫీస్ కి రండి. మాట్లాడాలి!” అన్నారు. వెళ్లాం. ముందు ఆయన సెల్వ రాజ్ ను పిలిచారు.
అప్పుడు వాకాటి వారు అతనితో ” ఒకసారి మీరు మేనేజర్ మణియన్ ను కలవాలి. ఇంటర్వ్యూ ఉంటుంది” అని చెప్పి, మణియన్ కి ఫోన్ చేసి, అతడిని పంపారు. తరువాత నన్ను పిలిచి అదే విషయం చెప్పారు. నాకు అర్థం కాలేదు. మద్రాస్ నుంచి తిరిగి వచ్చే ముందు ఆయన ” మీ ఇద్దరి గురించి మేనేజ్ మెంట్ తో మాట్లాడాను. పర్మనెంట్ ఆర్డర్లు తీసుకువస్తాను” అని కదా చెప్పారు? ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూలు ఏమిటి?
” సర్! ఇంటర్వ్యూ ఏమిటి? మద్రాస్ లో సమ్మె కాలంలో దాదాపు మూడు నెలలు పని చేశాము. మా పని ఏమిటో, ఎలా చేశామో తెలిసిందే కదా? ఈ ఇంటర్వ్యూ ఏమిటి మళ్ళీ?” అని అడిగాను.
ఆయన ” జస్ట్ ఫార్మలిటీ. మణియన్ మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు కదా? అందుకని” అన్నారు.
సెల్వ రాజ్ మేనేజర్ని కలిసి వచ్చాడు. అతని ముఖం వాడిపోయి ఉంది. సరే… తరువాత నా వంతు. వెళ్లి కలిశాను.
అప్పుడు మేనేజర్ నాతో చెప్పిన విషయం ఇదీ… ” చూడండి. మీకు ఇచ్చేది పర్మనెంట్ జాబ్ కాదు. ఒక ఏడాది కాల వ్యవధితో కాంట్రాక్ట్ జాబ్ మాత్రమే. మీకు నెలకు వచ్చే జీతం కేవలం మూడు వేలే. ఆలోచించుకుని రెండు మూడు రోజులలో చెప్పండి”. ఇదీ ఇంటర్వ్యూ రహస్యం. పర్మనెంట్ ఆర్డర్లు బదులు కాంట్రాక్ట్ ఆర్డర్స్!
వాకాటి వారిని కలిసి విషయం చెప్పాను.
ఆయన నాకు చెప్పినది ఇదీ… ” ఒప్పుకోండి. చేరిపోండి. ఇప్పటి నుంచీ అన్నీ కాంట్రాక్ట్ జాబ్స్ క్రింద మాత్రమే తీసుకోవాలని మేనేజ్ మెంట్ నిర్ణయం. అదీ కాక నా ఆలోచన వేరు. మిమ్మల్ని అసిస్టెంట్ ఎడిటర్ గా చేసుకోవాలని నా ఆలోచన. ఆ స్టేజ్ లో ఎలాగూ కాంట్రాక్ట్ జాబ్స్ మాత్రమే ఉంటాయి. సో, జాయిన్ అవటమే బెటర్. నేను ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాను” .
ఎలాగూ వాకాటి వారితో పని చేయటంలో ఉన్న స్వేచ్ఛను మూడు నెలలు చూశాను. ఆయన ఉద్యోగులతో వ్యవహరించే తీరూ చూశాను. తప్పుడు సలహాలు ఇవ్వరనే నమ్మకమూ ఉంది. సో, చేరాలనే నిర్ణయించుకున్నాను.
బయట సెల్వ రాజ్ వెయిట్ చేస్తున్నాడు. వాకాటి వారితో మాట్లాడి బయటకు వచ్చాక ” సార్ ఏమన్నారు?” అని అడిగాడు. చెప్పాను. ” మరి మీరు జాయిన్ అవుతారా?” అని అడిగాడు. ” నా సంగతి అలా ఉంచు, నువ్వేం చేస్తావ్?” అని అడిగాను. ” కాంట్రాక్ట్… అదీ ఒక్క ఏడాది. తరువాత పొమ్మంటే ఎక్కడికి పోతాం సర్? మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవాలి కదా?” అన్నాడు. నాకు నవ్వొచ్చింది. అతనికి ఆ నవ్వు చూసి కోపం వచ్చింది. ” నవ్వకండి సర్! పర్మనెంట్ ఆర్డర్స్ అని చెప్పి ఇప్పుడు కాంట్రాక్ట్ అంటున్నారు. మోసం కదా? నవ్వుతారేవిటి?” అన్నాడు.
” సెల్వ రాజ్! ఇప్పుడు నీకు ఉద్యోగం కావాలి. నా సంగతి వదిలేయ్. ఉద్యోగం వుంటే చేస్తా. లేకపోతే రాజమండ్రి తిరిగి వెళ్ళిపోతా. నీ సంగతి అలా కాదు. ఒక ఫ్యామిలీ ఉంది. అవసరాలున్నాయ్. నన్నడిగితే చేరిపోవటం బెటర్. అంతగా అయితే చేరిపోయి ఇంకో జాబ్ వెతుక్కో!” అన్నాను. అతనూ కన్విన్స్ అయాడు. ” మరి మీ సంగతి ఏమిటి?” అని అడిగాడు. ” నేను జాయిన్ అవుతున్నా” అన్నాను.
అలా నేనూ, సెల్వ రాజ్ ఆంధ్ర ప్రభ వీక్లీలో హైదారాబాద్ లో చేరాం. మేము ఆంధ్ర ప్రభ వీక్లీలో పర్మనెంట్ కావటానికి ఏడాదిన్నర పట్టింది! ఆ రోజు రైలులో చెప్పిందే జరిగింది!
అప్పుడు మొదలైంది అసలు సిసలు నరకం!
ఆఫీస్ లో చేరగానే వాకాటి వారు 110 నవలల స్క్రిప్ట్స్ నా మొహాన కొట్టారు… ” ఇవి దీపావళి నవలల పోటీకి వచ్చిన స్క్రిప్ట్స్. వీటిలో నుంచి పది నవలలు ఎంపిక చేయాలి మీరు. మీరు రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్స్ ఎప్పటికప్పుడు నాకు ఇవ్వాలి. వాటిని నేను కూడా చదివి, డిసైడ్ చేస్తాను.” అన్నారు. అంటే నా జడ్జిమెంట్ మీద ఆయన స్క్రూటినీ! కరెక్టే కదా? ఎడిటర్ గా అది ఆయన బాధ్యత.
చదవటం మొదలు పెట్టేసరికి చుక్కలు చూపించారు ఆ ” రచయితలు”. కొన్ని నరక సదృశాలు! కొన్ని పరమ కామెడీ! కొన్ని అసలు ముట్టుకోవటానికి కూడా వీలు లేని “కాగితాల కట్టలు”! వాటిలో నుంచి పది నవలలు ఎంపిక చేయాలి!
కొన్ని మచ్చుకి…
ప్రతి నవలకు ” ఇది నా స్వీయ రచన. అనువాదం కానీ, అనుసరణ కానీ కాదు” అనే హామీ పత్రం ఉండాలి కదా? ఒక హామీ పత్రం మీద ఆ గ్రామ సర్పంచ్ రెవెన్యూ స్టాంప్ అంటించి దాని మీద సంతకం చేశాడు… అటెస్టేషన్ అన్న మాట! ఆ నవల రాసిన వాడికి సరే… రెవెన్యూ స్టాంప్ ఎక్కడ అతికించాలి? అనే కనీస జ్ఞానం లేని సర్పంచ్ ఏలుబడిలో ఆ గ్రామం పరిస్థితి తలుచుకుంటే నవ్వాలో, ఏడవాలో తెలియలేదు!
మరొక ఆణిముత్యం… ఒక నవలలో హీరో, హీరోయిన్ ఉంటారు కదా? ఆ రచయిత రాసిన ఒక సన్నివేశం…” విప్పుడు వీరో, వీరోయిన్ డూయెట్టు”!
ఇలా నేను చేరిన నెల రోజులూ నరకం అనుభవించాను. మొత్తం మీద పది నవలలు ఎంపిక చేశాను. నేను రిజెక్ట్ చేసిన మిగిలిన నవలల్ని వాకాటి వారు కూడా రిజెక్ట్ చేయటం నాలో ధైర్యాన్ని పెంచింది. ” ఎస్, నా జడ్జ్మెంట్ కరెక్ట్!”.
ఆంధ్రప్రభ డైలీ, వీక్లీ రెండిటికీ పొత్తూరి వేంకటేశ్వర రావు గారు ఎడిటర్ గా ఉండేవారు. సమ్మె కాలంలోనే ఆయన రిటైర్ అయిపోయారు. నేను ఆంధ్ర పత్రికలో ఉన్న కాలంలోనే ఆయనతో పరిచయం ఏర్పడింది. డాక్టర్ ప్రసాదరాయ కులపతి, ఆయనా బాల్య స్నేహితులు. నా మిత్రుడు వివేకానందం కూడా ఆయనకు చిర పరిచితుడు. వీళ్ళ ఇద్దరి ద్వారా ఆయన బాగా పరిచయం అయ్యారు. ఆయన ఎడిటర్, వాకాటి వారు డిప్యూటి ఎడిటర్ వీక్లీకి. ఆయన సమ్మె కాలంలోనే రిటైర్ అయినా వాకాటి వారిని ఎడిటర్ ను చేయలేదు యాజమాన్యం. ఆంధ్ర ప్రభ డైలీకి మాత్రం వాసుదేవ దీక్షితులు గారిని ఎడిటర్ ను చేసింది. వాకాటి వారు వీక్లీలో ఉన్నంత కాలమూ డిప్యూటీ ఎడిటర్ గానే ఉండి పోయారు!
నేను చేరాక వాకాటి వారు ఒక సంగతి చెప్పారు… ” మిమ్మల్ని తీసుకుంటానని పొత్తూరి వారికి చెప్పాను. ‘ఆయన బాగా ఆలోచించి తీసుకోండి. అతను నాకు పరిచయమే. ఇండిపెండెంట్. పైగా మొండివాడు. తీసుకోవటం ఈజీనే. తరువాత వదలించుకోవటం కష్టం ‘ అన్నారు”అని!
తరువాత ఎన్నో ఏళ్లకు నేను ఎస్ వి బి సి లో పొత్తూరి వారితో కలసి ” ధర్మ క్షేత్రం” అనే చర్చా కార్యక్రమం చేశాను. అప్పుడు ఆయన నాకు ” బ్రదర్! వాకాటి వారు నిన్ను తీసుకుంటాను అన్నప్పుడు ఇలా చెప్పాను” అని అవే మాటలు నాకు మళ్ళీ చెప్పారు. ” మీరు చెప్పినది కరెక్టే కదా సర్!” అని నేను అంటే ” అందుకే కదా అలా చెప్పాను!” అని నవ్వేశారు.
” వాకాటి వారి పాఠాలు!” రేపు…
Leave a comment