స్వీయ అన్వేషణ – 55
” మీరు చదివిన తెలుగు, సంస్కృతం చాలు. ఒక వీక్లీ జర్నలిస్టుకు కావల్సిన దాని కన్నా ఎక్కువే చదివారు ఆ రెండూ! మీరు ఇంక ఇంగ్లీషు ఫిక్షన్, నాన్ ఫిక్షన్ చదవాలి”.
ఇదీ వాకాటి వారి మొదటి పాఠం. అంతే కాదు… ఆయన దగ్గర ఉన్న ఆ పుస్తకాలు నాకు ఇచ్చి చదివించారు. దానిలో కూడా ఒక ప్లానింగ్! పుస్తకం నాకు ఇచ్చిన తేదీ నోట్ చేసుకుని, దానిని చదవటం ఎప్పటికి పూర్తి చేయాలో ఆ తేదీ కూడా నిర్ణయించి, అదీ నోట్ చేసుకునేవారు. బద్దకించి, చదివేశాను అని తిరిగి ఇవ్వటానికి లేదు. ఆ పుస్తకం మీద చర్చ పెట్టేవారు. నాకు ఎంతవరకూ అర్థం అయింది అనేది తెలుసుకునేవారు. నేను చెప్పిన దానికి క్రొత్త కోణాలు జత చేసేవారు. అలా ఇంగ్లీష్ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ ప్రపంచంలోకి నన్ను నడిపించారు. అంతకు ముందు అంతా ఇంగ్లీష్ ఫిక్షన్ లో చదివినవి అన్నీ థ్రిల్లర్, స్పై, డిటెక్టివ్ నవలలు.
ఆయన నాకు మొట్టమొదట పరిచయం చేసినది మిలన్ కుందేరా ” The Unbearable Lightness of Being”. దాని మీద నాలుగైదు రోజులు మాట్లాడుకున్నాం.
తరువాత ఇలాగే ఎన్నో, ఎందరినో పరిచయం చేశారు.
ఆయన చెప్పిన మరొక మాట నాకు భగవద్గీత తో సమానం… ” ఆశ లేని వాడికి భయం లేదు!”. నిజం కదా? ఏదైనా ఆశిస్తే అది దక్కుతుందా, లేదా, దక్కినా నిలబడుతుందా, లేదా… అన్నీ భయాలే కదా?
” వీక్లీ జర్నలిస్టు కి డెప్త్ కన్నా విడ్త్ అవసరం”! ఒకే అంశంలో ఎంత లోతైన అధ్యయనం అయినా చేయవచ్చు. కానీ అనేక అంశాలు, సబ్జెక్ట్స్ తో పరిచయం ఉండాలి. డైలీ జర్నలిస్టు ఒక అంశాన్ని స్పెషలైజ్ చేయవచ్చు. ఆ అంశంలో ఎంత ప్రగాఢమైన అధ్యయనం చేస్తే అంత మంచిది. ఉదాహరణకు రాజకీయాలు, వాణిజ్యం, క్రీడలు, సినిమాలు, నేరాలు, న్యాయం – చట్టాలు… ఇలా ఒక్కొక్క అంశంలో ఒక్కొకరు స్పెషలిస్ట్. కానీ వీక్లీ జర్నలిస్టుకు అలా ఒక అంశానికి పరిమితం కావటం సాధ్యం కాదు. కథ, కవిత, వ్యాసం, విమర్శ, సినిమా, రాజకీయం… అన్నీ తెలియాలి. అన్నిటిలో పరిచయం ఉండాలి.
వీక్లీ జర్నలిజం లో ఆయన చెప్పిన మరొక పాఠం… సంపాదకుడికి కానీ, ఉప సంపాదకులకు కానీ వారి వీక్లీ ఏ ఏ అంశాలతో ఉంటుందో, ఆ అంశాలు అన్నీ కూలంకషంగా తెలియాలి అని ఏమీ లేదు. కానీ, ఆయా అంశాలపై ఎవరు సాధికారికంగా వ్రాయగలరో తెలియాలి. వారితో ప్రగాఢమైన పరిచయాలు ఉండాలి. ఏ అంశంపై రచన కావలసి వచ్చినా ఒక్క ఫోన్ కాల్ తో వారి దగ్గర నుంచి సకాలంలో రచన తెప్పించుకో గలగాలి. ” Relations play a key role in the success of an Editor!”
వాకాటి వారు ఆంధ్రప్రభ వీక్లీ చూస్తున్న కాలంలో ఆఫీస్ కి మధురాంతకం రాజారాం, ఆర్. ఎస్. సుదర్శనం, ముళ్ళపూడి వెంకట రమణ, ఆది శంకరాచార్య – రామానుజాచర్య – భగవద్గీత వంటి మహత్తర చిత్రాలు నిర్మించిన జీ. వి. అయ్యర్ వంటి మహామహులు వచ్చేవారు. వారందరినీ ఆయనే నాకు పరిచయం చేశారు… ” నా దగ్గర పని చేస్తున్నాడు” అని కాదు… ” నాతో పని చేస్తున్నాడు!” అని! ఆ రెండిటికీ ఎంత తేడా! ఈ భావన నా తరువాతి ఉద్యోగాలలో ఎంతో మందిని ఆత్మీయులను తెచ్చిపెట్టింది.
మరొక గొప్ప పాఠం… ” జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చే రోజే రాజీనామా లెటర్ జేబులో పెట్టుకో!” శుభమా అని ఉద్యోగంలో చేరుతూ రాజీనామా లెటర్ రెడీ చేసుకోవటం ఏమిటి? అనిపిస్తుంది. కానీ, వదలి వెళ్ళిపోయేటప్పుడు మానసికంగా ఎంత సిద్ధంగా ఉంటాం? వదిలేశాం అనే బాధే ఉండదు కాదు కదా? ఇది కూడా నా తరువాతి ఉద్యోగాలు ఎంతో ప్రశాంతంగా వదలి వేయటానికి ఎంత ఉపయోగపడింది అనేది నాకు మాత్రమే తెలుసు!
” సంపాదకుడిగా వాకాటి వారు!” రేపు…
Leave a comment