” జయప్రభా ? వద్దు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 59

ఆంధ్ర ప్రభ వీక్లీలో ఎన్నో కథలు వచ్చేవి. వాటిలో “చేయి తిరిగిన రచయితలు” మాత్రమే కాక ” చేయి తిప్పుకుంటున్న రచయితలు”, అలా “తిప్పుకోవటానికి ప్రయత్నం” చేస్తున్న ” రచయితలు” కూడా ఉన్నారు సహజంగానే. గుంటూరు నుంచి ఒక అమ్మాయి ( అప్పట్లో ఇంటర్ విద్యార్థిని) మొదట్లో వీక్లీకి ” ఉత్తరాలు” వ్రాసేది. ఒక ఏడాది తరువాత కథలు మొదలు పెట్టింది. తరువాతి ఏడాది ఏకంగా ఒక నవలే వ్రాసి పంపేసింది! ఉత్సాహం మెచ్చుకోదగినదే. కానీ దానికి తగిన అధ్యయనం ఉండాలి కదా?

అదలా ఉంచి చాలా కథలు వచ్చేవి. వాటిలో చాలా చాలా బాగున్న కథలను ఎంపిక చేసి, బాపూ బొమ్మతో సెంటర్ స్ప్రెడ్ లో వేయాలి. దానికి “వారం వారం కథా ప్రభ” అనే ప్రత్యేక శీర్షిక పెట్టాలి. ఇదీ వాకాటి వారి ప్రయోగం.

ఆ కథల ప్రచురణ మొదలైంది. ముందుగా పది కథలను ఎంపిక చేసి బాపూ గారికి పంపి బొమ్మలు వేయించి తెప్పించారు. అయిదు కథలు అయిపోగానే మరో అయిదు కథలు బొమ్మల కోసం పంపేవారు. కథా ప్రభ సాగుతోంది.

ఆ సమయంలో దీపావళి కథల పోటీ పెట్టారు. కథల ఎంపిక నాది. పది కథలు ఎంపిక చేశాను. వాటిలో జయప్రభ వ్రాసిన కథ ” రస ఝరీ యోగం” కూడా ఒకటి. న్యాయ నిర్ణేతలు అబ్బూరి ఛాయాదేవి, మధురాంతకం రాజారామ్.

జయప్రభ కథ చూసి ఇద్దరూ ఇబ్బంది పడ్డారు. “అది వద్దు” అన్నారు. వారిద్దరూ, వాకాటి వారూ, నేనూ కూర్చున్నాం. ” ఆ కథ బాగుంది కదా?” అని నా ప్రశ్న. వాకాటి వారి సమర్థన. రాజారామ్ గారు ఒప్పుకోలేదు. ఛాయాదేవి గారూ ఒప్పుకోలేదు. ” ఎందుకు?” అని అడిగాను. రాజారామ్ గారు ఒకటే అన్నారు… ” మేము న్యాయ నిర్ణేతలుగా ఉండగా ఆమె కథను బహుమతికి ఎలా ఎంపిక చేస్తాం? అలా చేస్తే రేపు మమ్మల్ని తిడతారు!”

“అలా అని మంచి కథను ఎలా తీసేస్తాం?” వాకాటి వారి ప్రశ్న. ” ఒక పని చేయండి. ఆ కథకు బహుమతి ఇవ్వాలి అనుకుంటే మేము ఇద్దరం కాకుండా వేరే న్యాయ నిర్ణేతలను పెట్టుకోండి” అన్నారు ఇద్దరూ! చేసేది ఏముంది? జయప్రభ కథ పోటీ నుంచీ పక్కకి తప్పుకుంది.

అలా అని ఆ కథని మేము వదులుకోలేదు. సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు. కానీ మంచి కథను ఎలా వదిలేస్తాం? ఆ కథను బాపూ గారికి పంపాము. నిజానికి బాపూ గారు ఆ కథకు బొమ్మ వేస్తారా, లేదా అని కూడా మాకు అనుమానమే! చివరకు బాపూ బొమ్మ వచ్చింది. ఆ కథను ” కథా ప్రభ”లో ప్రచురించి తృప్తి పడ్డాం.

కథకుడు కాలువ మల్లయ్య ఒక కథ పంపారు. దానిని కథా ప్రభలో ప్రచురించాలని నిర్ణయించుకున్నాం. బాపూ బొమ్మ కూడా వచ్చింది. అయితే కథా ప్రభలో ప్రచురించే కథలలో ఆ కథ ” ఇన్ క్యూ”. రెండు నెలలు అయింది. ఆ కథ కన్నా ముందు వచ్చిన కథలు ఇంకా అచ్చు అవుతున్నాయి. మల్లయ్య గారికి ఆలస్యం అసహనం కలిగించిందేమో అదే కథను ఆంధ్ర ప్రభ డైలీ ఆదివారం అనుబంధానికి పంపారు. అది ఆ అనుబంధంలో ప్రచురితం అయిపోయింది. ఆ కథకు బాపూ గారు వేసిన బొమ్మ మా దగ్గర మిగిలిపోయింది. ఆ బొమ్మను ఏం చేయాలి?

అప్పుడు నేను వాకాటి వారితో చెప్పాను… ” సర్! బాపూ గారు నా మొదటి కథకు బొమ్మ వేశారు. ఇప్పుడు బాపూ గారి బొమ్మ ఉంది కానీ దానికి కథ లేదు. మీరు ఒప్పుకుంటే ఈ బాపూ బొమ్మకు నేను కథ వ్రాస్తాను!”

కథకు బొమ్మ ఓకే! బొమ్మకు కథ! రివర్స్ గేర్! వాకాటి వారు ఒక్క క్షణం ఆలోచించి ” రాయండి. కానీ ఆ బొమ్మకు తగ్గట్టు ఉంటేనే వేస్తా. లేకపోతే లేదు. ముందే చెబుతున్నా” అన్నారు. ఒక రకంగా ఛాలెంజ్ అది! కథ వ్రాసి వాకాటి వారిని మెప్పించాలి! బాపూ బొమ్మకు నా కథ అచ్చు కావాలి!

అలా వ్రాయగా వచ్చినదే ” పొగడ పూదండ” కథ. అది అచ్చు అయాక వాకాటి వారికి బాపూ గారు ఫోన్ చేసి ” ఈ కథకు కాదే నేను ఆ బొమ్మ వేసినది? అది వేరే కథ కదా?” అని అడిగారు. అప్పుడు వాకాటి వారు జరిగినది అంతా చెప్పి ” వల్లభుడి మొదటి కథకి మీరు బొమ్మ వేశారు. ఇప్పుడు మీ బొమ్మకి అతను కథ రాశాడు. లెక్క సరిపోయింది” అన్నారు. ” ఆ కథ నాకు, రమణకి నచ్చిందని చెప్పండి” అన్నారు బాపూ గారు. ఈ విషయం వాకాటి వారు నాకు చెప్పారు. చాలదా? బాపూ గారి ఋణం తీర్చుకునే అవకాశం ఎంత మందికి వస్తుంది? ఆ అదృష్టం నాకు దక్కింది! కానీ ఆ కథ ఇప్పుడు నా దగ్గర లేదు! వెతికి తెచ్చుకోవాలి! తెచ్చుకుంటా!

” సి.నా.రె. తో తగవు” రేపు…


Leave a comment