స్వీయ అన్వేషణ – 60
డాక్టర్ సి. నారాయణ రెడ్డి జ్ఞాన పీఠ పురస్కార ” గ్రహీత”! హైదారాబాద్ లోని యువభారతి సంస్థ ప్రతి ఏడాది వార్షిక ” లహరి” కార్యక్రమాలు నిర్వహించేవారు. 1991 లో వారు ” తెలుగు కవిత – లయాత్మకత” అనే అంశంపై ఈ లహరీ కార్యక్రమాలు నిర్వహించారు. వక్త సి. నారాయణ రెడ్డి. ఆయన అప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు కూడా! అప్పటికే ఆయన జ్ఞాన పీఠ పురస్కార ” గ్రహీత”.
ఈ ప్రసంగ పరంపరలో రెండవది ” పద్య కవిత – లయాత్మకత”. దానిలో ఆయన కొన్ని ” అపూర్వ” సిద్ధాంతాలు ప్రకటించారు. 1. ఇదివరకే పండితులు అంగీకరించినట్టు పద్యం కన్నా పాట ముందు పుట్టింది. 2. మాత్రా ఛందస్సులే మొదట ఉండేవి. 3. పండితుల ధీ శక్తి ప్రదర్శన రూపంగా ” హృదయ ధర్మా”నికి చోటు లేని అక్షర గణ ఛందస్సులు ఏర్పడ్డాయి. 4.అక్షర గణ ఛందస్సుల వల్ల చెవికి ఇంపైన లయ దెబ్బ తింటుంది. 5. ఒక్క అక్షరం నుంచి 26 అక్షరాల వరకూ సాగిన వృత్త ప్రస్తారంలో ” యతి” స్థానం వల్ల అక్కడి వరకూ ఊపిరి బిగబట్టి చదవ వలసి వస్తుంది. 6. అదే మాత్రా చబ్దస్సులలో ఒక మాత్ర పెంచటం వల్ల లయ సాధ్యం అవుతుంది. 7. అలాటి లయను సాధించటానికి కొన్ని మార్పులు చేస్తే తప్పేమిటి? 8.తెలుగులో బాగా ప్రాచుర్యంలో ఉన్న పాతిక పద్యాలు ( ఛందస్సులు) తప్ప మిగిలినవి అనవసరం.
ఇవీ ఆయన ప్రకటనలు! లయ, తాళం, యతి, విరామం అనే వాటికి అర్థాలు తెలిసిన వాళ్ళు మాట్లాడే మాటలు కావు ఇవి! నాకు ఈ ప్రతిపాదనలు విని ఒళ్ళు మండిపోయింది. ఆయన సిద్ధాంతం అంతా ” అక్షర గణ చందస్సులలో నిర్మించిన పద్యం తాళం వేస్తూ పాడటానికి అనుకూలంగా లేదు!” అనేది. పద్యంలో ” యతి” స్థానం ఎక్కడ ఉందో అక్కడి వరకూ ” ఊపిరి బిగబట్టి” చదవమని ఎవడు చెప్పాడు ఈయనకి? అంత అజ్ఞానమా?!
పద్యంలో ” యతి”, ” విరామం” అని రెండు ఉన్నాయి. వీటిని లాస్ పర్యాయ పదాలుగా వాడేయటంతో ఈ ఇబ్బంది వచ్చింది. నిజానికి ఈ రెండూ ఒకటి కానే కావు! భరతుడు ఈ రెండిటికీ ఖచ్చితమైన తేడాను స్పష్టంగా చెప్పాడు నాట్య శాస్త్రంలో. ” ఒక నిర్ణయించిన స్థానంలో పద విచ్చేదం చేయటం యతి”. కాగా ” అర్థం ఎక్కడ సమాప్తం అవుతుందో అది విరామం”. స్పష్టంగా ఉంది కదా? యతికి ఒక నిర్ణీత స్థానం ఉంటుంది. విరామానికి అలా నిర్ణీత స్థానం ఉండదు. అందువల్ల ” ఎక్కడో 13వ స్థానంలో యతి ఉంటే అక్కడ దాకా గుక్క తిప్పుకోకుండా చదవాలా?” అని ప్రశ్నించటం తగదు.
పైగా సంస్కృతంలో యతి స్థానంలో పద విచ్చేదం జరుగుతుంది. అంతే ఒక పదం ముగిసిపోయి, మరొక పదం ప్రారంభం అవుతుంది. తెలుగులో “యతి” అలా కాదు. దానికి ” వడి”, ” వళి” అని రెండు పేర్లు ఉన్నాయి. ” వళి రాద్యం” అని వాగనుశాసనుడైన నన్నయ భట్టారకుడు నిర్దేశించారు. అంటే పద్య పాదంలోని మొదటి అక్షరమే వడి లేదా వళి. అంతే కాదు సంస్కృతంలో యతి స్థానానికి తరువాతి స్థానం తెలుగులో వడి లేదా వళి. మరి మొదటి స్థానం వడి లేదా యతి అయితే నిర్ణీత స్థానంలో ఉన్న దానిని ఏమనాలి? మొదటి స్థానంలో ఉన్న అక్షరంతో సమానమైన లేదా దానితో మైత్రి కలిగిన అక్షరాన్ని అక్కడ ఉంచాలి. అందుకే మనకి ” యతి మైత్రి” అనే మాట వచ్చింది. కనుక ఎక్కడో యతి ఉంటే అక్కడిదాకా ” ఊపిరి బిగపట్టి చదవాలా?” అనే ప్రశ్నే లేదు. ఎందుకు? పద్యపాదంలో మొదటి అక్షరమే యతి కనుక! ఆ నిర్ణీత స్థానంలో ఉండేది దీనితో మైత్రి కలది మాత్రమే?
అంతే కాదు ఏ పద్యం పాడాలి? ఏ పద్యం చదవాలి? అనే విషయాలను అభినవ గుప్తపాదులు చాలా స్పష్టంగా చెప్పారు. ” కేషాంచిత్ దోదక తోటకాదీనాం గీయమానతయా శోభాతిశయో భవతి, శ్లోక స్రగ్ధరాదీనాం తు పాఠ మాత్రతయా”. మాత్రా ఛందస్సులకు గానం వల్ల, అక్షర గణ ఛందస్సులను పఠనం వల్ల శోభ చేకూరుతుంది అని అర్థం! “అలా కాదూ! నేను పద్యాలు పాడతానూ! కానీ అవి తాళమునకు ఒదుగుట లేదూ!” అనటం కన్నా అజ్ఞానం ఉంటుందా?
యతి, విరామాల తేడా పక్కన పెట్టేయడం, తన ” దరువు”లకు పద్యాలు ఒదగటం లేదనటం, అందువల్ల ” పద్య విద్యలో లయ లేదు” అని తీర్మానించడం ” పద్య విద్యా హత్యకు చేసే కుట్ర” కాక మరొకటి కాదు.
నన్నయ గారి ” రాజ కులైక భూషణుడు…” అనే పద్యాన్ని అక్షర గణాల ప్రకారం విరిచి ” రాజకు – లైకభూ – షణుడు” అని అవహేళన చేయటం నాకు చాలా కోపాన్ని తెప్పించింది. అలా గణాలు విరిచి చదవాలి అనే సూత్రం, నియమం ఎక్కడున్నాయి? లేవు కదా?
అంతేకాదు… తిక్కన గారు స్త్రీపర్వంలో అనేక రకాల విశేషమైన ఛందస్సులు వాడారు. ఎందుకు? ఈ ” జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత” చెప్పిన కారణం ఏమిటో తెలుసా? ” అక్కడి విషయం డ్రై గా ఉంటుంది కనుక పాఠకుడిని ఆకర్షించటానికి విశేష ఛందస్సులు వాడాడు” ట! స్త్రీ పర్వం ” డ్రై” గా ఉంటుందా? అసలు భారతం చదివాడా ఈ పెద్దమనిషి! హృదయ విదారక ఘట్టాలతో నిండిన స్త్రీ పర్వం డ్రై గా ఉంటుంది అనటం ” గుండె తడి లేని ఎడారి” పలికే మాట!
పద్య కవితలో లయాత్మకత అంటే పద్యకవులు వివిధ ఛందస్సులలో ఏ విధంగా లయను సాధించారో చెప్పాలి కానీ, తన లయ అంటే నట్టువాంగంలో కొట్టే తాళం దెబ్బలు అనుకుంటే ఎట్లా?
అందుకే విశ్వనాథ వారు ఆయన గురించి చెప్పిన మాటను గుర్తు తెచ్చుకోండి.
ఈ పద్య విద్యా హననం గురించి నేను ” పద్యానికి తాళం (ట)!” అని ఆంధ్రప్రభ డైలీ ఆదివారం సంచికలో వ్రాశాను (1991 డిసెంబర్ 1).
మనం మాట్లాడిన లేదా ప్రతిపాదించిన అంశంపై విమర్శ వస్తే ఏం చేయాలి? సహేతుకంగా సమాధానం చెప్పాలి? కానీ ఆయన ఆ మార్గాన్ని ఎంచుకోలేదు! ఎంచుకున్నా చేసేదీ, చెప్పేదీ ఏమీ లేదు. నేను శాస్త్ర ప్రమాణాలు చూపించాను. వాటిని కాదనే ” సత్తా” ఉండాలి కదా?
నేను ఆంధ్ర పత్రికలో ఉన్న రోజులలోనే ” తెలుగు దినపత్రికలు – ప్రామాణిక భాష” అనే అంశంపై పరిశోధనకు (ఉస్మానియా విశ్వవిద్యాలయంలో) దిగాను పి హెచ్ డి తెచ్చుకుందామని. నాకు పరిశోధనలో పర్యవేక్షకులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు.
ఆ విషయం తెలుసుకున్న సి. నారాయణ రెడ్డి గారు ఆయనను పిలిచి నా గురించి మాట్లాడారు. ” నీ దగ్గర పి హెచ్ డి చేస్తున్నాట్ట కదా? కాస్త చెప్పు” అని చెప్పారు. ఆయన ” వల్లభాచార్యులు మంచివాడు, పండితుడు” అన్నారు. ” అయితే అతని మంచితనం, పాండిత్యం అంతా నా మీద చూపిస్తాడా?” అని నారాయణ రెడ్డి గారు రెట్టించారు. ఈయన ఏమీ మాట్లాడలేక పోయారు. ఈ సంఘటన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారే స్వయంగా ఒక పత్రికలో వ్రాశారు.
అంతే కాదు… ఆంధ్రప్రభ యాజమాన్యానికి కూడా నా మీద ఫిర్యాదు చేశారు! “వాడెవడో పనిగట్టుకుని నా మీద విమర్శలు చేస్తున్నాడు!” అని. అయితే అది ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థ! యాజమాన్యం ఒకటే చెప్పింది… ” మాకు స్థానికంగా ఎడిటర్లు ఉన్నారు. వాటి విజ్ఞత, నిర్ణయాల మీద మాకు నమ్మకం ఉంది. వారు ప్రచురించారు అంటే అందులో విషయం లేకుండా చేయరు. మీకు ఇబ్బంది కలిగితే మీరు ఆ విమర్శకు ‘ రిజాయిండర్ ‘ పంపండి. ఆ విమర్శ ఎంత ప్రముఖంగా వేశారో మీ రిజాయిండర్ కూడా అంతే ప్రముఖంగా వేయమని ఎడిటర్ కు చెబుతాము!”
ఎంత గొప్ప అవకాశం? ఆయన ” జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత!” నేను ఒక వీక్లీలో కేవలం ఒక సబ్ ఎడిటర్ ను మాత్రమే! సరైన జవాబు చెప్పి నా వంటి ” అల్ప జీవి” నోరు మూయించాలి కదా? అబ్బే! గప్ చుప్! జవాబు ఉంటే కదా చెప్పటానికి?
” పెద్దవాళ్ళని విమర్శించి పేరు తెచ్చుకోవడానికి” అనీ, ” అయినా వాడు ఎవడు అంతటి మనిషిని విమర్శించడానికి” అనీ, ” ఒళ్ళు పొగరు” అనీ ఆయన శిష్య బృందం ” గొణుక్కుంది ” కానీ ఇన్నేళ్ళ తరువాత కూడా ఒక్కడూ నా విమర్శకు సమాధానం చెప్పలేదు!
” నేను కాబట్టే వేశా!” రేపు…
Leave a comment