” నేను కాబట్టే వేశా!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 61

సి నా రె కి ఒక అలవాటు ఉంది. తప్పనిసరిగా ఏడాదికి కనీసం ఒక కవితా సంపుటి వేయాలి! ఒకప్పుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు తన ఒక కవితా సంపుటిని ఆయనకు పంపిస్తూ ” ప్రతి వర్ష వసంతోదయంలా ఏడాదికొక పుస్తకం వేసే సి నా రె కి ” అని వ్రాసి పంపారు!   మా గురువు గారు శరభయ్య గారి పద్యాలను సుబ్బారావు గారు ” చైతన్య కవిత” లో ప్రత్యేకంగా వేశారు. దాని సమీక్షకు డైలీలోని కల్లూరి భాస్కరం గారు నాకు ఇచ్చారు. ” ఒక రోజు పద్యం వ్రాయక ఊపిరాడని శ్వాస కోశ వ్యాధులు ఏవీ లేని కారణంగా శరభయ్య గారు వ్రాసినది చాలా తక్కువ” అని ఆ సమీక్ష మొదలు పెట్టాను. దాదాపుగా ” ఇవాళ ఊపిరాడటం లేదు, ఓహో ఇవాళ కవిత రాయలేదు” ( యథాతథంగా ఇవే మాటలు కావు… కానీ అభిప్రాయం అదే) అన్న సి నా రె ను ఉద్దేశించానని భాస్కరం గారికి అర్థం అయిపోయి, ఆ సమీక్ష వేయలేదు.

సి నా రె జ్ఞానపీఠ పురస్కారం తెచ్చుకున్నప్పుడు ఆంధ్ర పత్రికలో ” తళతళలాడే కవి” అని విశ్వనాథ వారు అన్న మాటలతో వ్యాసం వ్రాశాను అని చెప్పాను కదా? అప్పుడు ఆయన అందుబాటులో ఉన్న తన కవితా సంపుటులు నాకు ఇచ్చారు. శ్రద్ధగా చదివాను. ఒక రహస్యం నాకు అర్థం అయింది. అదేమిటి అనేది తరువాత చెబుతాను.

సి నా రె కవితా సంపుటి ఒకటి సమీక్షకు వచ్చింది ఆంధ్రప్రభ వీక్లీకి. అప్పుడు వీక్లీకి నేతృత్వం వహిస్తున్నది వాకాటి వారు. ఆ కవితా సంపుటి సమీక్షకు నాకే ఇచ్చారు వాకాటి. చదివా. సి నా రె మొదటి కవితా సంపుటి నుంచి అప్పటి వరకూ వచ్చిన ” మట్టి మనిషి ఆకాశం” వరకూ ఒక థీమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఆకాశం బీజ దాత, నేల ఆద్య మాత, వాటి సృష్టి మనిషి. ఇదే థీమ్! ఇదే రహస్యం! అదే సమీక్షలో వ్రాశాను ఆయన కవితా సంపుటులు అన్నీ ప్రోగేసి, వాటి నుంచి ఉదాహరణలు చూపిస్తూ మరీనూ! చివరలో ఒక మాట కూడా అన్నాను ” ఇదే మరొక కవి చేస్తే భావ దారిద్ర్యం అంటారు” అని.

సి నా రె గారు వాకాటి వారికి ఫోన్ చేశారు… ” మీరు ఉండగా ఇలాటి సమీక్ష వేస్తారా?” అని.

” నేను ఉన్నాను కాబట్టి వేశా!” అని వాకాటి వారి జవాబు!

ఇలాటి సంపాదకులతో పని చేయటం నా అదృష్టం కాక మరేమిటి?

అలాగే ” విశ్వంభర” మీద ” దండమయా విశ్వంభర” అని ఒక వ్యాసం వ్రాసి ఆంధ్రప్రభ డైలీకి ఇచ్చా.  డైలీ ఎడిటర్ వాసుదేవ దీక్షితులు గారు పిలిచారు. ” వద్దు. ఇప్పటికే సి నా రె తో మీకు గొడవ. ఇది వేసి ఆ గొడవ ఎందుకు పెంచుకుంటారు? వద్దు” అంటూ ఆ కాగితాలు చించేశారు. ” అదేమిటి సర్? అలా చించేదారు? మీరు వేయకపోతే రిటర్న్ చేయొచ్చుగా?” అని అడిగా. ఆయన నవ్వేసి ” మీకు రిటర్న్ చేస్తే ఇంకో పత్రికకు పంపిస్తారు. లేదంటే పాంఫ్లెట్స్ వేసి పంచుతారు. మీ మంచి కోసమే ఆ పని చేశా” అన్నారు దీక్షితులు గారు! అదీ తేడా!

” నిన్ను చం…స్తా అన్నాడు!” రేపు…


Leave a comment