” నిన్ను చం…స్తా అన్నాడు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 62

చావా శివకోటి… మంచి రచయిత. ఖమ్మం వాసి. ఆయన వ్రాసిన ఒక నవల ఆంధ్రప్రభ వీక్లీలో ప్రచురణకు ఎంపిక అయినప్పుడు పరిచయం. వాకాటి వారికీ, నాకూ ఆప్తుడుగా మారాడు.

ఖమ్మం అనగానే గుర్తుకు వచ్చే ఇద్దరూ మహనీయులు… దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్య. ఇద్దరికీ శివకోటి శిష్యుడే. దాశరథి కృష్ణమాచార్య తో నాకు పెద్దగా పరిచయం లేదు. యువభారతి నిర్వహించిన ఒక కవి సమ్మేళనంలో ” నిశాగంధము” అనే శీర్షికతో కొన్ని పద్యాలు చదివాను. దాశరథి కృష్ణమాచార్యులు గారు అధ్యక్షుడు. ఆ పద్యాలు విని ఆయన చాలా అభినందించారు. ఆయన ప్రసంగంలో వాటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. విశ్వనాథ వారి చేత ” పద్య శిల్పి” అనిపించుకున్న దాశరథి కృష్ణమాచార్యులు గారు చేసిన ఆ ప్రశంస చాలదూ!

ఆ “నిశాగంధము” పద్యాల వెనుక ఒక కథ ఉంది. శశికపూర్ సంస్కృత ” మృచ్ఛకటికం” నాటకం ఆధారంగా ” ఉత్సవ్” అనే సినిమా తీశారు. ఆ నాటకం అంటే నాకు ఇష్టం కాబట్టి ఒకరోజు నేనూ, నా మిత్రుడు సుధీంద్ర తీర్థ వెళ్లాం సెకండ్ షోకి. జమృద్ ధియేటర్. ఆ సినిమాలో నాటకంలో లేని వాత్స్యాయనుడి పాత్ర పెట్టారు. కొన్ని సీన్స్ దగ్గర ప్రేక్షకులు అల్లరి అల్లరి, అరుపులు, కేకలు. చిరాకు పుట్టింది. సినిమా చూస్తున్నట్టు లేదు. అందుకని మరునాడు ఉదయమే సంగీత్ ధియేటర్ లో మార్నింగ్ షోకి మళ్ళీ వెళ్లాం. ప్రశాంతంగా చూశాం. ఆ సినిమాలో ఒక పాట ఉంది. ” సాంజ్ ఢలే…” దానిలో ఒక చోట ” నిశి గంధా కె సుర్ మే” అనే ప్రయోగం ఉంటుంది. అది నన్ను బాగా పట్టేసింది. ఆ పదం నుండి పుట్టిన పద్యాలే “నిశాగంధము”!

దాశరథి రంగాచార్య తో నాకు అప్పటికి పరిచయం లేదు.

చావా శివకోటి ఒకసారి ఖమ్మంలో దాశరథి కృష్ణమాచార్యులు గారి జయంతి సభ నిర్వహించారు. దానికి ముఖ్య అతిథి దాశరథి రంగాచార్య గారు. ఆ సభలో దాశరథి కృష్ణమాచార్యులు గారి గురించి ప్రసంగించమని నన్ను అడిగాడు శివకోటి. ఒప్పుకున్నాను.

కానీ మనం “బద్ధక సమ్రాట్టు”లము కదా? “ఆ… ఎవడు పోతాడు ఆ బస్సుల్లో పడి ఖమ్మం వరకూ?” అని ఆ రోజు ఉదయమే శివకోటికి ” నేను రావటం లేదు!” అని టెలిగ్రాం ఇచ్చేశాను.

కానీ లోపల ఏదో తొలిచేస్తూనే ఉంది. ఖమ్మం శివాలయంలో సభ. ఆ మాట నన్ను నిలబడనివ్వటం లేదు! ఎందుకు? దాశరథి రంగాచార్య గారి కథ ఒకటి చదివాను. ఆ శివాలయం, దానిలో పెద్ద రావి చెట్టు, ఆ రావి చెట్టు చుట్టూ పెద్ద అరుగు, ఎదురుగా శివుడు… ఆ కథ, ఈ దృశ్యం, ఆ దృశ్యం వెనుక ఉన్న ఆత్మీయ భావన నన్ను నిలబడనివ్వ లేదు!

వాకాటి వారికి చెప్పేసి, హాఫ్ డే లీవ్ పెట్టేసి, బస్సెక్కేశాను. సాయంత్రం ఆరు గంటలకు సభ. సరిగ్గా 5.50 కి అక్కడ ఉన్నాను. శివకోటి చూశాడు… ” నిన్ను చంపేస్తాను! ఎంత కంగారు పెట్టేశావ్? సభ అభాసు పాలు అయిపోతుందని భయపడ్డా. ఇలా వచ్చేవాడివి, అలా పొద్దున్నే టెలిగ్రాం ఏమిటి? నిన్ను చంపేయాలి!” అంటూ కౌగలించుకున్నాడు. రంగాచార్య గారికి పరిచయం చేశాడు. ఆయన మామూలుగా పలకరించి ఊరుకున్నారు.

సభ మొదలైంది. రంగాచార్య గారు తన అన్నగారు కృష్ణమాచార్య తో అనుబంధాన్ని గురించి ప్రసంగించారు. తరువాత నేను.

నా ప్రసంగం విశ్వనాథ వారి మాటల తో మొదలు పెట్టాను. విశ్వనాథ వారు ” ఆధునిక యుగము” అనే రేడియో నాటిక లో దాశరథి గురించి చెప్పిన మాటలు గతంలో చెప్పాను. ఆ నాటకంలో సి. నారాయణ రెడ్డిని ” “తళతళలాడే కవి” అన్న తరువాత ” దాశరథి అని మరి యొకడున్నాడు” అంటాడు ఒక పాత్ర. రెండవ పాత్ర ” ఆతని గురించి నీవేమి చెప్పవలదు. ఆతని శిల్పి పద్యములు చదువుము” అంటాడు.

తేడా గమనించారా? నారాయణ రెడ్డి ” తళతళలాడే కవి!”. “దాశరథి గురించి చెప్పక్కరలేదు. శిల్పి పద్యాలు చదువు” అంటే దాశరథి ” శిల్పి!”  ఒక శిల్పి తన శిల్పాన్ని ఎంత సుందరంగా చెక్కుతాడో, దాశరథి తన పద్యాన్ని అంత అందంగా మలుస్తాడు. అదీ తేడా!

ఈ వివరణతో నా ప్రసంగం మొదలయ్యే సరికి అప్పటివరకూ పెద్దగా పట్టించుకోని  రంగాచార్య గారు ” అటెన్షన్”లోకి వచ్చారు! శ్రద్ధగా వినటం మొదలు పెట్టారు!

నా దగ్గర దాశరథి కవితల సంకలనం ఒకటి ఉంది. దానిలో పద్య – వచన కవితలు రెండూ ఉన్నాయి. నేను ఆ రెండింటి నుంచీ శీర్షికలు తీసుకోకుండా, అనేక కవితల నుంచి విడివిడి పద్యాలు ఎంపిక చేసుకొని, వాటిని ఒక క్రమంలో కూర్చి దాశరథి కృష్ణమాచార్యులు గారి ” కవితా వ్యక్తిత్వా”న్ని వివరించాను.

రంగాచార్య గారు చివరలో ఒక మాట అన్నారు… అది నాకు ఆయన ఇచ్చిన సర్టిఫికెట్! ” మా అన్నయ్యని మేము ఎవ్వరమూ ఈ ఏంగిల్ లో ఎప్పుడూ చూడలేదు. మా అన్నయ్యని నువ్వు మాకే కొత్తగా చూపించావ్!” ఒక తమ్ముడు, అందులోనూ ” భావుకుడు” అయిన ఒక మహా రచయిత అన్న ఈ మాటల కన్నా గొప్ప “సాహిత్య పురస్కారం” ఏముంటుంది కనుక నాకు?

రాత్రి భోజనాలు…శివకోటి ఆతిథ్యం అందరికీ. భోజనాల దగ్గర ” ఇలారా!” అంటూ పక్కన కూచోబెట్టుకుని, కబుర్లు చెబుతూ కొసరి కొసరి తినిపించారు రంగాచార్య.

భోజనాలు అయిపోయాయి. రాత్రి అక్కడే నా బస. అందరం విశ్రాంతిగా కూచున్నాం. ఉన్నట్టుండి రంగాచార్య గారు ” వల్లభా! ఆ పద్యాలు మళ్ళీ చదువు” అని అడిగారు. కాదనేది ఏముంటుంది? మళ్ళీ మరో గంట దాశరథి పద్యాలతో గడచిపోయింది.

” నేనూ హైదారాబాద్ లోనే ఉండేది. వీలైనప్పుడల్లా వస్తూ ఉండు” అన్నారు రంగాచార్య. ఆనాటి నుంచి ఎన్నిసార్లు ఆయనను కలిశానో, ఎంత జ్ఞానామృతాన్ని ఆస్వాదించానో!

అనంతర కాలంలో నేను “భక్తి టివీ” లో చీఫ్ కాపీ ఎడిటర్ గా పని చేస్తున్నప్పుడు రంగాచార్య గారితో ” తిరుప్పావై” కార్యక్రమం చేసే మహత్తర అవకాశం లభించింది కూడా!

చావా శివకోటి స్నేహం, రంగాచార్య గారి ఆప్యాయత… ఆజన్మాంతం మరచిపోలేనివి!

” వాకాటి వారికి మూడు దెబ్బలు”! రేపు…


Leave a comment