స్వీయ అన్వేషణ – 63
వాకాటి వారి వంటి వ్యక్తికి కూడా దెబ్బలు తగులుతాయి.
అయోధ్య ఉద్యమం క్రమంగా బాగా ఊపందుకుంటున్న రోజులు. వాకాటి వారు “అసలు అయోధ్య ఏమిటి? ఎందుకు దాని కోసం ఉద్యమం చేయాలి? హిందువుల ఎదుట ఏ ఏ అంశాలున్నాయి?” ఇవన్నీ పాఠకులకు తెలియచేయాలి అనుకున్నారు. దానితో పాటుగా వీక్లీ సర్క్యులేషన్ దృష్టి ఉండనే ఉంది. ఆ ఉద్యమం నడుపుతున్న సంస్థలు వీక్లీ కొనుగోళ్లకు సహకరిస్తాయని ఆయన భావించారు. ” ఏక క్రియా ద్వర్ధ్య కరీ”. Two Birds at One Shot.
ఈ ప్రస్తావన వచ్చినప్పుడు చాలా చర్చ జరిగింది. అసలు అయోధ్య అంశం తీసుకోవాలా? వద్దా? ఒకవేళ అనుకున్నట్టు తీసుకుంటే వీక్లీ సర్క్యులేషన్ కు దోహదం అవుతుందా? లేదా?
“అయోధ్య అంశం, దాని నేపథ్యం పాఠకులకు తెలియజేయటం వరకూ ఓకే ! కానీ అది సర్క్యులేషన్ కు దోహదం అవుతుంది అనే మాటలో నాకు నమ్మకం లేదు. చివరికి మనం పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ జిరాక్స్ కాపీలు తీసి పంచుకుంటారు కానీ కొనరు ” అని నేను అన్నాను. ఆ సంస్థలతో నాకున్న అనుభవాలు అలాంటివి మరి! చివరికి అదే జరిగింది! సర్క్యులేషన్ పెరగలేదు! ఇది వాకాటి వారి నమ్మకానికి తగిలిన మొదటి దెబ్బ!
ఆంధ్ర ప్రభ వీక్లీలో వాకాటి వారి కాంట్రాక్ట్ టర్మ్ మరి కొన్ని నెలల్లో పూర్తి కావస్తోంది. సర్క్యులేషన్ పెరగాలి. తద్వారా టర్మ్ పొడిగింపు రావచ్చు. ఏమి చేయాలి? ఏదో క్రొత్తగా చేయాలి. అప్పుడు వాకాటి వారు ఒక జపాన్ నవల తీశారు. అది ప్రచురితం అయినప్పుడు అప్పటి వరకూ సాంప్రదాయికంగా ఉన్న జపాన్ సమాజం ఒక్కసారి కుదుపునకు లోనైంది! ఒక రకంగా అది ఆ సమాజంలో భూకంపం సృష్టించింది. అదే ” The Key!” నవల. సంక్లిష్టమైన దాంపత్య శృంగార అంశం. ఇప్పటికీ నూటికి తొంభై తొమ్మిది మంది అంగీకరించరు! ఆ నవలను తెలుగులోకి అడాప్ట్ చేయమని నా చేతికి ఇచ్చారు వాకాటి వారు.
ఆ నవల పూర్తిగా చదివాక నేను ఆయనతో ” వద్దు సర్! మన పాఠకులు దీనిని ఒప్పుకోరు. ఇబ్బంది పడతాం” అన్నాను. దానికి వాకాటి వారు ఒకటే ఎదురు ప్రశ్న వేశారు నాకు ” ఏం? నాకు ఎక్స్టెన్షన్ రావటం నీకు ఇష్టం లేదా?” ఇంక నేను మారు మాట్లాడలేదు. ” చేస్తాను సర్! కానీ నా పేరుతో కాదు! అలా అయితే చేస్తా!” అన్నాను. ” “ఫణికృష్ణ” పేరుతో ఆ ప్రచురణ మొదలైంది. అదే ” కెమెరా” సీరియల్! అలాటి కథకు బొమ్మలు వేయడంలో సిద్ధహస్తుడు చిత్రకారుడు చంద్ర. అతనికి ఆ పని అప్పగించారు వాకాటి వారు. సీరియల్ ప్రచురణ సాగుతున్న కొద్దీ పాఠకుల వ్యతిరేకత పెరగటం మొదలైంది. కేవలం నలుగురైదుగురు మాత్రమే సమర్థించారు కానీ అత్యధికులు వ్యతిరేకించారు. రోజుకు వంద ఉత్తరాలు వస్తే తొంభై ఉత్తరాలు వ్యతిరేకమే. నా భయమే నిజమైంది! మొదలు పెట్టాక ఆపలేము! చివరికి ఆ సీరియల్ మీద ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఆ ఫిర్యాదులు కథనం మీద కాక ఆ సీరియల్ కి వేసిన బొమ్మల మీద! ” The Key” నవలను అడాప్ట్ చేయటంలో భాష విషయంలో అంత జాగ్రత్త పడ్డాను. ఆ సీరియల్ విషయం వాకాటి వారి నమ్మకానికి తగిలిన రెండవ దెబ్బ!
వాకాటి వారి కాంట్రాక్ట్ టర్మ్ ముగిసే కాలం దగ్గరపడుతోంది. ఆయన జనరల్ మేనేజర్ ఎ.సి. వేంకట కృష్ణన్ ( ఎ.సి.వి.)ను కలిశారు. విషయం అడిగారు. “టర్మ్ పొడిగించే ఉద్దేశ్యం లేకపోతే రెండు మూడు నెలల ముందే చెప్పండి. నేను మరోటి చూసుకోవాలి కదా?” అని చెప్పారు. ” అబ్బే! అలాటిదేవీ లేదు. ఉంటే నేనే మీ ఇంటికి వచ్చి ముందుగా చెబుతాను” అన్నారు ఏ సి వి. వాకాటి వారు ఈ విషయం నాకు చెప్పారు. నేను ” నమ్మొద్దు సర్! ముందుగానే జాగ్రత్త పడండి” అని చెప్పాను. ” ఎ సి వి చెప్పారు. నాకు నమ్మకం ఉంది” అన్నారు వాకాటి వారు. నేనేమి అంటాను? ఊరుకున్నాను. చివరకి ఎ సి వి వచ్చి చెప్పలేదు కానీ వాకాటి వారి టర్మ్ ముగిసిపోయింది. ఆయన వెళ్లి ఆ పెద్దమనిషిని అడిగారు. ఆయన ” వేరే కొత్త వారిని ఎడిటర్ గా తీసుకుంటున్నాము. డెసిషన్ అయిపోయింది. పోనీ, ఒక పని చేయండి. మీకు వేరే ఉద్యోగం దొరికే వరకూ ఎప్పటిలాగానే డిప్యూటీ ఎడిటర్ గా కంటిన్యూ అవండి” అని చెప్పారు. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది?
పొత్తూరి వారు రిటైర్ కాగానే డైలీకి వాసుదేవ దీక్షితులు గారిని “ఎడిటర్” చేసిన యాజమాన్యం వాకాటి వారిని మాత్రం ” డిప్యూటీ ఎడిటర్” గానే ఉంచేసింది చివరివరకూ. పైగా కొత్తగా ఒక ” ఎడిటర్”ను నియమిస్తూ వాకాటి వారిని ఆ వ్యక్తి క్రింద ” డిప్యూటీ ఎడిటర్” గా కంటిన్యూ కమ్మని అనటం కన్నా అవమానం ఏముంటుంది? వాకాటి వారు అంగీకరించ లేదు. అలా ఆంధ్రప్రభ వీక్లీ ఒక ప్రతిభావంతుడైన వ్యక్తిని కోల్పోయింది. ఇది వాకాటి వారి నమ్మకానికి తగిలిన మూడవ, చివరి దెబ్బ! అంతేకాదు, ఆంధ్రప్రభ వీక్లీ పతనానికి మొదటి అడుగు కూడా!
” వాకాటి వారూ – నేనూ” రేపు…

Leave a comment