స్వీయ అన్వేషణ – 64
వాకాటి వారిలో మరొక గొప్ప లక్షణం ఆయన ఆంధ్రప్రభ వీక్లీలో ఎదుర్కొన్న అబద్ధాలు, అవమానాలు అన్నిటినీ ఆయన చిరునవ్వుతో, హుందాగా ఎదుర్కొన్నారు. ఏ సందర్భంలోనూ తన నిజాయితీని కోల్పోలేదు. ధైర్యాన్ని వదులుకోనూ లేదు. అది ఆయన వ్యక్తిత్వం. దానివల్ల ఆయన ఆత్మీయంగా భావించిన కొందరు దూరం అయిపోయినా సరే!
నా అదృష్టం ఏమిటంటే నేను ఎక్కడ పని చేసినా నా పై అధికారి నాతో “అధికారి”లా ప్రవర్తించలేదు. వారితో ఒక ఆత్మీయ అనుబంధమే ఏర్పడింది. కొన్ని సందర్భాలలో కొందరు దానిని ” అలుసు” గా తీసుకున్నవారూ లేకపోలేదు. వాకాటి వారు అలా చేయలేదు.
నన్ను ఆంధ్రప్రభ వీక్లీలోకి తీసుకునేటప్పుడు ఆయనకు ఒక ఉద్దేశ్యం ఉంది. పొత్తూరి వారు ” జాగ్రత్త! అతడు మొండివాడు, స్వతంత్రుడు. ఒకసారి తీసుకుంటే వదిలించుకోవటం కష్టం” అని చెప్పినా నన్ను ఎంపిక చేసుకున్నారు!
నేను చేరేటప్పుడు కాంట్రాక్ట్ జాబ్ అంటే నన్ను చేరమనే సలహా ఇచ్చారు. తాను ఎడిటర్ గా, నేను అసిస్టెంట్ ఎడిటర్ గా వీక్లీ నడపాలని ఆయన కోరిక. అదే నాకు చెప్పారు.
ఒక సందర్భంలో జనరల్ మేనేజర్ ఎ సి వి ” వర్క్ లోడ్ ఎక్కువ కదా? ఒక అసిస్టెంట్ ఎడిటర్ ను తీసుకోండి!” అని చెప్పారు. వాకాటి వారు వెంటనే నా పేరు చెప్పారు. దానికి ఎ సి వి చెప్పిన సమాధానం ” అతడిని తప్ప ఇంకెవరినైనా తీసుకోండి. అతను మాత్రం వద్దు!” అన్నారు. ఈ మాట వాకాటి వారు స్వయంగా నాకు చెప్పారు.
ఎ సి వి అలా అనటానికి కారణం లేకపోలేదు! సమ్మె కాలంలో మద్రాసులో పని చేశాం కదా? అప్పట్లో ఎ సి వి ఎవరో నాకు తెలియదు. ఎవరూ చెప్పనూ లేదు. వీక్లీ విభాగానికి వెళ్ళటానికి లిఫ్ట్ లో వెళ్ళాలి. ఈయన లిఫ్ట్ లోకి ఎక్కితే మిగిలిన వారు ఎవరూ ఎక్కేవారు కాదు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఇతరులు ఎందుకు రారో తెలియదు. నేను మాత్రం ఆయన తో పాటు లిఫ్ట్ లో వెళ్ళిపోయేవాడిని. ఎంత అహంకారం?! ఒక జనరల్ మేనేజర్…ఆ సంస్థకు మకుటం లేని మహారాజు… ఆయనతో పాటు సమానంగా లిఫ్ట్ ఎక్కడమా?! అంత మంది ఆగిపోయి ఆయనకు త్రోవ ఇచ్చేస్తే నేను వెడితే ఇగో హర్ట్ అయిపోదూ?!
ఆ తరువాత హైదారాబాద్ కి వచ్చాక కానీ ఆయన ” హోదా” ఏమిటో నాకు తెలియలేదు. ఆయన అప్పుడప్పుడూ హైదారాబాద్ ఆఫీస్ కి వచ్చేవారు. ఎక్కడో అక్కడ ఎదురుపడే వారు. దాదాపు మూడు నెలలు మద్రాసులో ఆయన ఎవరో పట్టించుకోని నేను ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన ” హోదా” తెలిశాక విష్ చేయటం నాకు అసహ్యం అనిపించింది. అందుకే విష్ చేసేవాడిని కాదు. ఇంకా హర్ట్ అయిపోడూ ఆ “హోదా మనిషి”?! ఇవన్నీ కలిసి ” అతడిని తప్ప ఇంకెవరైనా తీసుకోండి. అతను మాత్రం వద్దు” అనిపించి ఉంటాయని నా అభిప్రాయం… కాదు… నమ్మకం!
అసిస్టెంట్ ఎడిటర్ పోస్ట్ కి కొన్ని దరఖాస్తులు వచ్చాయి. కానీ వాకాటి వారు తాను ఆంధ్రప్రభ వీక్లీ డిప్యూటీ ఎడిటర్ గా ఉన్నన్ని నాళ్ళూ ఎవరినీ తనకు అసిస్టెంట్ ఎడిటర్ గా తీసుకోలేదు! ” ఆ స్థానం మీకు అనుకున్నా. అంతే!” అన్నారు ఆయన. ” ఇంక వర్క్ లోడ్ అంటారా? మనిద్దరం ఉన్నాంగా? చాలు” అని కూడా అన్నారు ఆయన!
” మీరు చదివిన తెలుగు, సంస్కృతాలు చాలు. ఇంగ్లీష్ చదవాలి” అంటూ తన స్వంత లైబ్రరీ లోని పుస్తకాలు చదివించారు. పాఠకులనే కాదు…నన్నూ ఒక ” ఇంచ్” ఎదిగేటట్టు చేశారు. నా సాహిత్య, సాహిత్యేతర పరిధిని విస్తృతం చేశారు.
కొన్ని సభలలో మేమిద్దరమూ “సహ వక్త”లుగా పాల్గొన్నాం. నన్ను తనతో సమానంగా చూశారు. కొన్ని సభలలో నా ప్రసంగం ఉంటే ఆయన కేవలం ” శ్రోత” గా వచ్చారు నేను చెప్పకపోయినా! ఒకసారి ఆయన నాతో అన్నారు… ” నాకు చెప్పకుండా ఏ సభలలో మాట్లాడటానికి వెళ్ళకండి” అన్నారు. ” ఎందుకు సర్?” అని అడిగాను. ఆయన నవ్వుతూ ” మీరు ఏం మాట్లాడుతారో నేను వినద్దా?! ” అన్నారు. అదీ ఆయన నా పట్ల చూపిన అభిమానం, ఆప్యాయత!
వ్యక్తిగతంగా ఎన్నో సందర్భాలలో మార్గదర్శనం చేశారు. నేనూ, మిత్రుడు సదాశివశర్మ ఒక ప్రతిపాదన చేశాం వాకాటి వారి దగ్గర. మన సమాజంలో ” మను స్మృతి” గురించి అనేక వివాదాలు ఉన్నాయి. అదేమిటో అస్సలు చదవని వాళ్ళూ నోటికి వచ్చినట్టు మాట్లాడేవారు. (ఇప్పటికీ ఆ జాతికి తక్కువేమీ లేదు) అసలు మనుస్మృతిలో ఏది అసలు? ఏది ప్రక్షిప్తం అనేదీ తెలియదు. బ్రిటిష్ పాలనా కాలంలోనే ఒక బ్రిటిష్ జడ్జ్ అప్పటికి ప్రచారంలో ఉన్న మను స్మృతిలో 70 శాతం ప్రక్షిప్తం అని తేల్చి చెప్పిన సంగతీ తెలియదు. ఎన్ని శ్లోకాలు ఒరిజినల్? ఎన్ని ఫేక్? అని లెక్కలు తేల్చిన పరిశోధనల గురించి కూడా తెలియదు. కానీ నోరు చేసుకుంటారు. అందువల్ల అసలు అందులో ఏముంది అనేది చెప్పాలి అని నేనూ, సదాశివ శర్మ అనుకున్నాం. ” మన ‘ మనుగడ’ అనే శీర్షికతో వ్రాయాల”ని అనుకున్నాం. వాకాటి వారితో సుదీర్ఘ చర్చ జరిగింది. చివరికి ఆ ప్రతిపాదన విరమించుకున్నాం. ఆయన దానిలో ఉండే సాధక బాధకాలు వివరించిన విధానం మమ్మల్ని కన్విన్స్ చేసింది.
ఇలా ఎన్నో సందర్భాలలో ఆయన మార్గదర్శనం, అండదండలూ నాకు లభించాయి.
ఆంధ్రప్రభలో ఆయన టర్మ్ అయిపోయింది. వీడ్కోలు చెప్పాలి ఆయనకు. ఆయనకు వీడ్కోలు అంటే మనసులో నుంచి ఒక ముక్క కోసి అవతల పారేయటమే! ఆయన లేని ఆఫీస్ కి వెళ్లగలనా? అనిపించింది. ఆ రోజు సాయంత్రం వీక్లీ సిబ్బంది అంతా ఒక హోటల్ లో చేరాం. డిన్నర్. అయిపోయింది. ఇక వెళ్లిపోవాలి! ఆయనను వదలి వెళ్లిపోవాలి! నా ” వాలకం” కనిపెట్టారు ఆయన. భుజం మీద చేయి వేసి పక్కకు తీసుకువెళ్ళారు. ” రేపటి నుంచీ మీరు ఆఫీస్ కి ఎప్పటిలాగే వెడుతున్నారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు, నిర్ణయాలు వద్దు. నా మాట కాదనరని నా నమ్మకం” అన్నారు. అప్పటికి సరే అన్నాను.
” మంత్ర సాధనలో రెండవ అడుగు” రేపు…
Leave a comment