స్వీయ అన్వేషణ – 65
ఆంధ్రపత్రికలో ఉన్న రోజులలో డాక్టర్ ప్రసాదరాయ కులపతి వద్ద గణపతి మంత్రం ఉపదేశం పొంది కొన్నేళ్ళు జపం చేశాను.
ఆ రోజులలోనే మరొక మహా మంత్ర సిద్ధుడు శ్రీ చెన్నూరు కృష్ణమూర్తి గారు మిత్రుడు వివేకానందం ద్వారా పరిచయం అయ్యారు. ఆయన అద్దంకిలో నివాసం ఉండటం వల్ల ఆయనను అందరూ “అద్దంకి కృష్ణమూర్తి” అని పిలిచేవారు. ఆయన ఒకసారి హైదారాబాద్ లో ఉన్న మా ఇంటికి వచ్చారు. ఏవో మాటలలో మా అమ్మ కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రస్తావించింది. ఆయన ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ” రాజమండ్రిలో మీ ఇంటిలో 25 యంత్రాలు ఉన్నాయి కదా?” అని అడిగారు. నేను ఆశ్చర్యపోయాను. ఆ ఇంటి గురించి గతంలో వివరించాను. ఆ ఇంటిలో 24 గుమ్మాలు ఉన్నాయి. ప్రతి గుమ్మం మీద మా చిన్న తాత వేంకట వల్లభాచార్యులు గారు ఒక్కొక్క యంత్రం స్థాపించారు. లెక్క వేసుకుని చూసుకున్నాను. 24 యంత్రాలు ఉన్నాయి. ” 25 కాదు, 24 మాత్రమే ఉన్నాయి” అన్నాను. ” అవునా? గుమ్మాల మీద ఉన్నవన్నీ లెక్కేసి చెప్పావ్ సరే! మరి మీ చిన్న తాత మీ సింహ ద్వారం క్రింద పెట్టిన మత్స్య యంత్రం సంగతేవిటీ?” అని అడిగారు. నాకు మతి పోయింది. ఎక్కడ హైదారాబాద్? ఎక్కడి రాజమండ్రి? ఆ ఇల్లు, దానిలో ఎన్ని యంత్రాలు? ఎలా? ఎలా సాధ్యం? కళ్ళతో చూసినట్టు చెప్పేసే ఆ శక్తి ఏమిటి? నోట మాట రాలేదు! అలాటి మహా సిద్ధుడు జీవితంలో పరిచయం కావటమే ఒక భాగ్యం కాదూ?
ఆయన్ను వాకాటి వారికి కూడా పరిచయం చేశాడు మిత్రుడు వివేకానందం. వాకాటి వారు ఆయనతో ఇంటర్వ్యూ చేయించి ప్రచురించారు.
ఒక సందర్భంలో నేను ఆయనను అడిగాను… ” దేనిలోనూ ఎదుగుదల లేదు” అని. ఆయన ” దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా? అద్దంకి రా! చెబుతాను” అన్నారు. నేనూ, మిత్రుడు వివేకానందం వెళ్లాం. వాకాటి వారు, ఆయన కుమారుడు కూడా వచ్చారు. వాకాటి వారి అమ్మాయి కరుణ ఆ ప్రాంతంలోనే గ్రూప్ వన్ అధికారిగా పని చేస్తున్నారు. వాకాటి వారు ఆమె దగ్గర వున్నారు. వాకాటి వారి కుమారుడు మాతో పాటే కృష్ణమూర్తి గారి ఇంటిలోనే ఉన్నాడు. మేము వెళ్లి కృష్ణమూర్తి గారిని కలిశాక ” రేపు చెబుతాను” అన్నారు.
ఆ రోజు అంతా ఖాళీ. ఆ రోజు సాయంత్రం అద్దంకి సమీపంలోని సింగరకొండకు వెళ్లాం అందరం. సింగరకొండలో కొండ మీద శ్రీ నృసింహ స్వామి ఆలయం, కొండ క్రింద శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నాయి. సాయంత్రం కావటంతో కొండ మీది ఆలయం మూసివేశారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లాం. అందరూ పూజ సామగ్రి తీసుకున్నారు. నాకూ, మిత్రుడు వివేకానందంకి అప్పట్లో అలాటి అలవాటు లేదు. గుడికి వెళ్ళటం, ఒక నమస్కారం పెట్టుకోవటం… అంతే. అలాగే వెళ్లాం.
ఆ గుడిలో పూజ అంటే గర్భాలయం ఎదురుగా మంటపంలో ఒక పొడవాటి బల్ల వేసి, దానిపై స్వామి పాదాలు ఉంచి, వాటికి పూజ చేయిస్తారు. అందరినీ కూర్చోమన్నారు. మేము పూజ సామగ్రి తీసుకోలేదు కాబట్టి ఒక ప్రక్కగా నిలబడ్డాం. అర్చకుడు ” అలా నిలబడ్డారేవిటీ? రండి, కూర్చోండి!” అని పిలిచారు. ఇక బాగుండదని కూర్చున్నాం. అందరితో పాటు పూజ చేశాం. చివరిలో కొబ్బరికాయలు కొట్టి, ఆరగింపు చేసి, తలకొక చెక్క చేతిలో పెట్టారు అర్చకుడు. నా చేతిలో ఉంచిన కొబ్బరి చెక్కలో ఒక చిన్న పువ్వు వచ్చింది!
మరునాడు కృష్ణమూర్తిగారు ” స్నానం చేసి రండి” అన్నారు. నేనూ, మిత్రుడు వివేకానందం వెళ్లాం. ఆయన ఆరాధ్య దేవత శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి. ఆయన ఇంటికి ఎదురుగా రోడ్డుకు అటు వైపు ఒక పెద్ద షెడ్డు వంటి నిర్మాణం చేశారు. దానిలో లోపల ఒక ప్రక్కగా అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ అమ్మవారి ఎదుట కూర్చోబెట్టి శాస్త్రోక్తంగా మంత్ర ఉపదేశం చేశారు. అది ” శ్రీ ఆంజనేయ మంత్రం!” నిన్న సాయంత్రం కొబ్బరి చిప్పలో పువ్వు! ఈ రోజు ఉదయం ఆ స్వామి మంత్రమే లభించటం! అప్పటి వరకూ అసలు నాకు ఆ స్వామి మీద ఎలాటి ఆసక్తీ లేదు. అప్పుడు నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఆంధ్ర పత్రికలో ఉన్నప్పుడు అమలాపురంలో “నాడీ జ్యోతిష్యం” కోసం వెళ్ళాను అని చెప్పాను కదా? అప్పుడు ” నువ్వు ఆంజనేయ భక్తుడివి” అన్నారు. నేను నవ్వుకున్నాను. ఇప్పుడు ఈ శ్రీ ఆంజనేయ మంత్రంతో ఆ స్వామి నా జీవితంలోకి ప్రవేశించాడు. రుద్రాక్ష మాలతో లక్షన్నర జపం చేయాలి.
హైదారాబాద్ తిరిగి వచ్చిన కొద్ది రోజులకు నా భార్య ప్రెగ్నెంట్ అని నిర్ధారణ అయింది. నేను కృష్ణమూర్తిగారు ఉపదేశించిన మంత్రం జపం చేయటం మొదలు పెట్టాను. ఎలాగూ శ్రీ ఆంజనేయ మంత్ర జపం కదా అని ప్రతి మంగళవారం కొబ్బరికాయ కొట్టడం మొదలు పెట్టాను. ఆశ్చర్యంగా ప్రతి సారీ కాయలో పువ్వు వచ్చేది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ పువ్వు సైజ్ పెరుగుతూ వచ్చింది!
కొన్నాళ్ళకు ఇంట్లో జపం చేయటం కుదరక పోవటంతో అప్పుడప్పుడే నిర్మాణంలో ఉన్న శ్రీ ఆంజనేయ ఆలయానికి వెళ్ళి చేసేవాడిని. ఆ ఆలయంలో స్వామి ప్రతిష్ఠ జరిగింది. ముఖ మంటపం నిర్మాణం జరిగింది. ఇంకా ప్రహారీ గోడ కట్టలేదు. ఓపెన్ గా ఉండేది. రాత్రి 8 గంటలకు స్నానం చేసి, ఆసనం – మాల తీసుకుని అక్కడికి వెళ్లి దాదాపు రాత్రి 11 గంటల వరకూ జపం చేసేవాడిని. నాలుగైదు రోజులకు ఆ సమయానికి మరి కొంత మంది వచ్చి కూర్చొని జపమో, హనుమాన్ చాలీసా పారాయణం చేయడమో మొదలు పెట్టారు!
కొన్నాళ్ళు జపం చేశాక విచిత్రమైన ఒకటే దృశ్యం కనిపించేది… ఆకుపచ్చని రంగులో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి! నాకు అర్థం కాలేదు… ఆ వర్ణంలో ఆ స్వామి గురించి ఎప్పుడూ వినలేదు. నా భార్య పెళ్ళికి ముందు తన తల్లితో పాటు తమిళనాడు లోని చాలా క్షేత్రాలు దర్శించింది. అందుకని ఆమెను అడిగాను ” ఆకుపచ్చ ఆంజనేయ స్వామిని ఎక్కడైనా చూశావా?” అని. ” చూశాను… కానీ ఎక్కడో గుర్తు లేదు” అంది. సో, ఏదో ఒక క్షేత్రంలో ఆ వర్ణంలో శ్రీ ఆంజనేయ స్వామి ఉన్నాడు అని నిర్ధారణ అయింది నాకు. అనంతర కాలంలో ఒక శ్రీ ఆంజనేయ స్తోత్రంలో వివిధ వర్ణాలలో ఉండే శ్రీ ఆంజనేయ స్వామి గురించి, ఒక్కొక్క వర్ణంలో ఉండే స్వామి కి ఉన్న వేరు వేరు మంత్రాల గురించి ఎరుక కలిగింది. నా లక్షన్నర జపం పూర్తి అయ్యేవరకు అదే దృశ్యం, అదే మూర్తి! ఇది నేను చేసిన రెండవ సాధన!
కృష్ణమూర్తి గారు ఒకసారి గుంటూరులో ఒక రచయిత్రి షష్టిపూర్తి సభకు వచ్చారు. నేనూ, మిత్రుడు వివేకానందం కూడా వెళ్లాం. అందరూ ఆమెకు ఏదో ఇక బహుమతి ఇస్తున్నారు. కృష్ణమూర్తి గారు ఏమీ తీసుకురాలేదు. ” ఏమీ తీసుకురాలేదురా ! ఎలా?” అన్నారు. ” ఆశీర్వాదమే పెద్ద బహుమానం. వెళ్ళండి” అన్నాం. ఆయన వేదిక వైపు బయలు దేరారు. గోచీ పోసి కట్టిన పంచ, ఎడమ భుజాన ఉత్తరీయం… అంతే. వేదిక పైకి వెళ్లి ఆమెను మంత్ర పూర్వకంగా ఆశీర్వదించారు. కుడి చేయి పూర్తిగాగాలిలోకి లేపి, పిడికిలి బిగించి, గాలి నుంచి ఏదో తీస్తున్నట్టు చేసి, ఒక వస్తువు ఆమె చేతిలో ఉంచారు బహుమతిగా! అది అంగుళన్నర బంగారు లక్ష్మీ ప్రతిమ! వేదిక దిగి వచ్చి కూర్చున్నారు. ” ఎక్కడ నుంచి నుంచి తెచ్చారు?” అని అడిగాడు వివేకానందం. ఆయన నవ్వేసి ఊరుకున్నారు. అదీ ఆయన శక్తి. తరువాతి కాలంలో అర్థం అయింది. ఎవరూ వస్తువును సృష్టించరు! ఒక స్థలంలో ఉన్న దానిని మరొక చోటికి ” Tele portation” చేయగలరు ఆ శక్తి ఉంటే! అలాటి విచిత్రాన్ని మరొక సందర్భంలో మరొకరు కూడా చేసి చూపించారు.
చాలా మంది అరచేతి నుంచి విభూతి తీస్తూ ఉంటారు. హేతువాదులు కూడా ఆ పని చేస్తారు. అయితే వారి full hands చొక్కాలు లేదా లాల్చీల వంటివి ధరించి ఉంటారు. కానీ కృష్ణ మూర్తి గారు చొక్కా, లాల్చీ ఏదీ ధరించరు. పైన ఒక కండువా ధరిస్తారు… అంతే!
నవరాత్రులు చివరి రోజు. కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి. అప్పుడు కూర్చున్నారు ఆయన. ఒంటి మీద పంచ మాత్రమే ఉంది. పైన కండువా కూడా లేదు. రెండు అరచేతులు ఒకదానితో మరొకటి రుద్దుతూ నమకం పఠించటం మొదలు పెట్టారు. అలా నమక చమకాలు రెండూ పూర్తి అయ్యేవరకూ ఆయన రెండు అరచేతులూ రాస్తూనే ఉన్నారు. ఆ అరచేతుల మధ్య నుంచి ఏకధారగా విభూతి వస్తూనే ఉంది… ఒక గుట్ట విభూతి వచ్చింది. అదీ కృష్ణ మూర్తి గారి సిద్ధి! ఆయన నుంచి ఒక మంత్రాన్ని ఉపదేశం పొందే భాగ్యం ఎంత మందికి లభిస్తుంది?
” క్రొత్త ఎడిటర్! క్రొత్త పాలన! రేపు…

Leave a comment