” క్రొత్త ఎడిటర్ – క్రొత్త పాలన”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 66

ఆంధ్రప్రభ వీక్లీలో నాకు తెలిసిన రెండు శకాలు ఒకటి పొత్తూరి వారిది, రెండవది వాకాటి వారిది ముగిసి పోయాయి. నేను పొత్తూరి వారి హయాంలో నేరుగా పని చేయలేదు. ఆంధ్రప్రభ సమ్మె కాలంలో మద్రాసులో పని చేశాను. సమ్మె ముగిసే లోపుగానే పొత్తూరి వారు రిటైర్ అయిపోయారు. కనుక నేను నేరుగా ఆయన హయాంలో పని చేయలేదు. అయితే ఎన్నో ఏళ్ల తరువాత శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ఆయనతో కలిసి ” ధర్మ క్షేత్రం” అనే చర్చా కార్యక్రమానికి పని చేశాను. ఆంధ్రప్రభ కాలంలోనే కాదు, ఆంధ్రపత్రిక కాలంలోనే ఆయనతో గాఢమైన పరిచయం ఉంది. అందుకే ఆయన వాకాటి వారితో ” అతడు మొండి వాడు, స్వతంత్రుడు” అని చెప్పగలిగారు.  వాకాటి వారి శకం కూడా అయిపోయింది.

తరువాత క్రొత్త ” ఎడిటర్” వచ్చారు! ఆయనే ఇంద్రగంటి శ్రీకాంతశర్మ! ఆయన ఎడిటర్ గా రావటానికి చాలా కాలం ముందే ఒక సంఘటన జరిగింది. ఆయన ఆంధ్రప్రభ వీక్లీలో ప్రచురణకు ” చిత్రాంగి మేడ” అనే నవల పంపించారు. నవలలు ముందుగా చదివేది నేనే. చదివాను. ” వద్దు” అనుకున్నాను. వాకాటి వారికి చెప్పారు. ఆయనా చదివి నా మాట ఒప్పుకున్నారు. ఆ నవల మాకు దైలీలో ఉన్న భాస్కరం గారి ద్వారా అందింది. అందుకని ఆయనకే తిరిగి ఇచ్చి ఒక మాట చెప్పాను… ” భాస్కరం గారూ! ఈ నవల వద్దు. శ్రీకాంతశర్మ గారు కవిగా మంచి పేరున్నవారు. అనుభూతి కవితా రంగంలో తనదైన ముద్ర ఉన్నవారు. ఇప్పటికే ఆంధ్రజ్యోతి వీక్లీలో తాంత్రిక విద్యల నేపథ్యంతో నవల వ్రాసి ఆ పేరు కొంతలో కొంత చెడగొట్టుకున్నారు. ఇప్పుడు ఈ నవలతో పూర్తిగా పోతుంది. కనుక వద్దు”

ఆ శ్రీకాంత శర్మ గారు ఇప్పుడు అదే వీక్లీకి ” ఎడిటర్” గా వచ్చారు! ఒక ఆదివారం విజయవాడ ఆఫీస్ లో జాయిన్ అయి, సోమవారం హైదారాబాద్ ఆఫీస్ కి వచ్చారు. డైలీ ఎడిటర్ వాసుదేవ దీక్షితులు గారు ఆయనను వెంటబెట్టుకొని వచ్చి వీక్లీ సిబ్బందికి పరిచయం చేసి వెళ్లారు. శర్మ గారు తన కేబిన్ లోకి వెళ్లి నన్ను పిలిచారు. ” మీరు ఎన్నింటికి వెడతారు?” అని అడిగారు. ” ఈవెనింగ్ ఫైవ్ కి” అన్నాను ముభావంగా! వాకాటి వారి నిష్క్రమణ నుంచి నేను ఇంకా బయటపడ లేదు! ” ఒకే! వెళ్లే ముందు ఒకసారి రండి. మీతో మాట్లాడాలి” అన్నారు శర్మ గారు. సరేనని బయటకు వచ్చేశాను. సాయంత్రం అయిదింటికి వెళ్లి ” వెడుతున్నాను సర్” అన్నాను. ” రండి, కూర్చోండి, మాట్లాడాలి” అన్నారు. కూర్చున్నాను. ఆయన…

” నేను చాలా ఏళ్ళ క్రితం ఆంధ్రజ్యోతి వీక్లీలో పని చేశాను. తరువాత ఆల్ ఇండియా రేడియోలో ఉన్నాను ఇన్నేళ్లు. ఇప్పుడు మళ్ళీ వీక్లీ కి వచ్చాను. నిన్న విజయవాడలోనే జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను. దీక్షితులు గారు కూడా ఉన్నారు. నేను ఆయన్ని ఒక మాట అడిగాను… హైదారాబాద్ ఆఫీస్ లో ఎవరిని నమ్మి, డిపెండ్ అవచ్చు?… అని. ఆయన మీ పేరు చెప్పారు. ఇక్కడ నాకు మీ సహకారం అవసరం” అన్నారు.

” నన్ను నమ్మకండి సర్! నేను ఎప్పుడు మానేసి వెళ్లిపోతానో నాకే తెలియదు. మంచి అవకాశం ఉంటే వెళ్ళిపోతాను. వాకాటి వారు నన్ను అసిస్టెంట్ ఎడిటర్ గా తీసుకోవాలి అనుకున్నారు. అది జరగలేదు. ఇంక జరుగుతుందనే నమ్మకమూ లేదు. సో, ఎన్నాళ్ళు ఉంటాను అనేది నాకు బయట వచ్చే అవకాశాలను బట్టి ఉంటుంది” అన్నాను.

ఆయన ” కొంచెం వెయిట్ చేయండి. వాకాటి వారు ఇచ్చిన మాట నేను నిలబెడతాను. టైమ్ కావాలి. కానీ ఒక్కసారి అసిస్టెంట్ ఎడిటర్ అంటే కాదు. ముందు చీఫ్ సబ్ ఎడిటర్ కావాలి. ఆ తరువాత అది” అన్నారు.

” నమ్మకం లేదు సర్!” అన్నాను.

” సరే! మీకు మంచి అవకాశం ఉంటే వెళ్ళండి. అప్పటి వరకూ ఉండండి” అన్నారు. నా ఆలోచన కూడా అదే కనుక సరేనన్నాను.

అలా శర్మ గారితో ప్రయాణం మొదలైంది. వాకాటి వారి వ్యవహార శైలి వేరు, శర్మ గారి వ్యవహారం వేరు. వాకాటి వారి వ్యవహారం అంతా ” నోటి మాట మీద” సాగేది. శర్మ గారి వ్యవహారం అంతా ” అఫిషియల్ గా పేపర్ మీద” ఉంటుంది.

” ఇది నాకు క్రొత్త శిక్షణ!”” రేపు…


Leave a comment